తెలుగు: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

1. సృష్టి

OBS Image

ఆదిలో దేవుడు ఈ విధంగా సమస్త సృష్టిని చేసాడు. అయన ప్రపంచాన్ని సృష్టించాడు. దానిలోని సమస్తాన్ని ఆరు రోజులలో చేసాడు. దేవుడు భూమిని సృష్టించిన తరువాత అది చీకటిగానూ, శూన్యంగానూ ఉంది, ఎందుకంటే దానిలో ఆయన అప్పటికి ఇంకా ఏమీ సృష్టించలేదు. అయితే దేవుని ఆత్మ నీటిమీద అల్లాడుతూ ఉంది.

OBS Image

అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “వెలుగు కలుగును గాక!” అప్పుడు వెలుగు కలిగింది. దేవుడు వెలుగును చూసినప్పుడు అది మంచిదిగా కనిపించింది. దానిని “పగలు” అని పిలిచాడు. పగటిని చీకటినుండి ఆయన వేరు చేసాడు. దానిని “రాత్రి” అని పిలిచాడు. దేవుడు సృష్టి మొదటి రోజున వెలుగును సృష్టించాడు.

OBS Image

సృష్టిలో రెండవ రోజున దేవుడు ఇలా అన్నాడు, “నీటి మీద విశాలం కలుగును గాక,” అక్కడ విశాలం కలిగింది. దేవుడు దానిని “ఆకాశం” అని పిలిచాడు.

OBS Image

మూడవ రోజున దేవుడు ఇలా చెప్పాడు: “నీరు అంతా ఒక చోటకు వచ్చును గాక, భూమి కనబడును గాక.” పొడి నేలను దేవుడు “భూమి” అని పిలిచాడు, నీటిని “సముద్రాలు” అని పిలిచాడు. తాను సృష్టించిన దానిని చూచినప్పుడు అది మంచిదిగా ఉంది.

OBS Image

అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “భూమి సమస్త చెట్లనూ, మొక్కలనూ మొలిపించును గాక.” ఆ విధంగా జరిగింది. తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది.

OBS Image

సృష్టిలో నాలుగవ దినాన్న దేవుడు ఇలా పలికాడు, “ఆకాశంలో నక్షత్రాలు కలుగును గాక.” సూర్యుడూ, చంద్రుడూ నక్షత్రాలు కలిగాయి. భూమి మీద వెలుగునివ్వడానికీ, రాత్రినీ పగలునూ, కాలాలనూ, సంవత్సారాలనూ వేరు చెయ్యడానికి ఆ నక్షత్రాలను చేసాడు. తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది.

OBS Image

ఐదవ రోజున దేవుడు ఇలా పలికాడు: “జీవము కలిగినవన్నీ నీటిని నిండించును గాక, పక్షులు ఆకాశాన్ని నిండించును గాక.” ఈ విధంగా ఆయన నీటిలో ఈదే వాటన్నిటినీ, పక్షులన్నిటినీ చేసాడు. తాను చేసిన సృష్టి యావత్తూ మంచిదని దేవుడు చూసాడు, ఆయన దానిని ఆశీర్వదించాడు.

OBS Image

సృష్టి చేసిన ఆరవ రోజున దేవుడు ఇలా పలికాడు, “భూమి మీద సంచరించే సమస్త జంతువులు కలుగును గాక!” దేవుడు పలికిన ప్రకారం ఇలా జరిగింది. వాటిలో కొన్ని సాధు జంతువులు, కొన్ని నేలమీద పాకే జంతువులు, కొన్ని అడవి జంతువులు. తాను చేసిన సృష్టిని దేవుడు మంచిదిగా చూచాడు.

OBS Image

తరువాత దేవుడు, “మన పోలిక చొప్పున, మన స్వరూపంలో నరుని చేయుదము. వారు సమస్త భూమిమీదనూ, సమస్త భూజంతువుల మీదనూ ఏలుదురు గాక!” అని పలికాడు.

OBS Image

అప్పుడు దేవుడు కొంత మన్నును తీసుకొని దానితో మానవుణ్ణి చేసాడు, వానిలో జీవాత్మ ఊదాడు. ఈ మనిషి పేరు ఆదాము. దేవుడు ఆదాము నివసించడానికి ఒక తోటను నాటాడు, దానిని సేద్యపరచడానికి ఆదామును దానిలో ఉంచాడు.

OBS Image

తోట మధ్యలో దేవుడు రెండు ప్రత్యేకమైన చెట్లను నాటాడు-జీవవృక్షం, మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం. తోటలో మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలములను తప్పించి మిగిలిన చెట్ల ఫలములన్నిటినీ ఆదాము తినవచ్చునని దేవుడు చెప్పాడు. ఆ వృక్షఫలములను తినునప్పుడు అతడు చనిపోతాడని చెప్పాడు.

OBS Image

అప్పుడు దేవుడు, “మనుష్యుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు” అన్నాడు. అయితే జంతువులలో ఏదియూ ఆదాముకు సహకారి కాలేదు.

OBS Image

కాబట్టి దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగ జేశాడు. అప్పుడు ఆదాము పక్కటెముకలలో ఒక దానిని తీసి దానిలోనుండి ఒక స్త్రీని కలుగ జేశాడు.

OBS Image

ఆదాము ఆమెను చూచినప్పుడు ఇలా అన్నాడు, “చివరకు, ఈమె నాలా ఉంది! ఈమె “నారి” అని పిలువబడుతుంది, ఎందుకంటే ఆమె పురుషునిలో నుండి తీయబడింది.”

OBS Image

దేవుడు తన స్వరూపంలో స్త్రీని, పురుషుని చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించి వారితో ఇలా చెప్పాడు, “మీరు ఫలించి, సంతానంలో విస్తరించండి, భూమిని నిండించండి!” దేవుడు తాను చేసిన సమస్తమూ మంచిదిగా చూచాడు. దానిని బట్టి దేవుడు సంతోషించాడు. ఇదంతా సృష్టిలో ఆరవ రోజున జరిగింది.

OBS Image

ఏడవ రోజు వచ్చినప్పుడు దేవుడు తాను చేసిన ప్రతీదానిని ముగించాడు. ఏడవ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దానిని పరిశుద్ధపరచాడు. ఎందుకంటే ఆ దినం సృష్టి చెయ్యడం నిలుపు చేసాడు. ఈ విధంగా దేవుడు సమస్త లోకాన్నీ, దానిలోని సమస్తాన్ని సృష్టించాడు.

ఆదికాండం 1-2 నుండి బైబిలు కథ