కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక
Chapter 1
1 పౌలు, అనే నేను ఈ లేఖ మన తోటి విశ్వాసి అయిన సొస్తెనేసుతో కలిసి రాస్తున్నాను. దేవుడు తనకు నచ్చిన విధంగా యేసుక్రీస్తు అపొస్తలుడుగా ఉండటానికి పిలిచాడు. 2 కొరింతులో ఉన్న దేవుని సంఘానికి చెందిన నీకు ఈ లేఖ పంపుతున్నాను. నువ్వు యేసు వాడవు కనుక నిన్ను పవిత్రునిగా చేశాడు. నీతోపాటు ప్రభువైన యేసు నామంలో ప్రార్థించే వారందరినీ పవిత్రులని పిలిచాడు. 3 మన తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు నీకు కృప, శాంతి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను.
4 మీ గురించి ఆలోచించిన ప్రతిసారీ యేసుక్రీస్తును మనకు దయచేసి మనపై కృపను చూపిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 5 ఉదాహరణకు మనం చెప్పే, మనకు తెలిసిన అన్ని విషయాలు యేసు కలుగజేసినవే. 6 ఈ విధంగా యేసు గురించి చెప్పిన ప్రతి విషయం నిజం అయ్యింది.
7 ఆ కారణం చేత మనం దేవుని ఆత్మ నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించక, యేసు దర్శనం కోసం ఎదురుచూస్తున్నాము. 8 యేసు తిరిగి వచ్చే సమయానికి నిన్ను ఎవరూ నిందించకుండా చివరి వరకు దేవునిలో స్థిరంగా ఉండేలా ఆయన నిన్ను బలపరుస్తాడు.
9 ఆ విధంగా దేవుడు తన మాటను నిలబెట్టుకుంటున్నాడు. మన ప్రభువు, తన కుమారుడైన యేసుక్రీస్తును తెలుసుకుని, ప్రేమించడానికి దేవుడు మనలను పిలిచాడు.
10 సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరంతా ఒకటిగా మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా, ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో కలిసి ఉండండి. 11 మీలో మీకు విభేదాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా నాకు తెలిసింది.
12 మీలో ఒకడు "నేను పౌలు వర్గం," ఒకడు "నేను అపొల్లో వర్గం," మరొకడు "నేను పేతురు వర్గం" "నేను క్రీస్తు వర్గం" అని రకరకాలుగా చెప్పుకుంటున్నారని విన్నాను. 13 క్రీస్తు ముక్కలుగా అయిపోయాడా? పౌలు మీ కొరకు సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా.
14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప మీకెవరికీ బాప్తిసం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 15 ఎందుకంటే వారు నా శిష్యులుగా ఉంటారని నేను బాప్తిసం ఇచ్చానని ఎవ్వరూ చెప్పుకోకూడదు. 16 స్తెఫను ఇంటి వారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప ఇంకా ఎవరికీ బాప్తిసం ఇచ్చినట్టు నాకు తెలియదు.
17 క్రీస్తు నన్ను బాప్తిసం ఇవ్వడానికి పంపలేదు, దేవుని శుభవార్త చెప్పడానికి పంపాడు, మానవ జ్ఞానంతో కాకుండా, ఆయన సిలువ మరణం , దాని శక్తితో సువార్త చెప్పడానికి పంపాడు.
18 నశించిన వారికి దేవుని కార్యాలు అర్థం కావు. యేసు వారి కోసం సిలువపై మరణించాడు, కానీ వారికి అది అర్థం కాదు. కానీ దేవుని వల్ల రక్షణ పొంది తిరిగి జీవం పొందిన వారికి అది దేవుని శక్తి. 19 ఒక ప్రవక్త ఇలా రాసాడు:
"జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను.
20 "లోకంలో జ్ఞానులు ఎక్కడున్నారు? మేధావులు ఎక్కడున్నారు? వారికి దేవుని గురించి ఏమీ తెలియదు. వారి లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రి తనంగా చేశాడు కదా?"
21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో అనుగ్రహించాడు.
22 యూదులు ఎవరినైనా నమ్మే ముందు వారికి అద్భుతాలు చూపించాలి. వారు కొత్త విధానాల ద్వారా జ్ఞానం కావాలని వెతుకుతున్నారు. 23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. అయితే యూదులకు సిలువ మరణం శాపం తెచ్చిపెడుతుందని నమ్మకం. అలాగే గ్రీకులకు కూడా అది బుద్ధిహీనతగా అనిపించింది.
24 దేవునిచే పిలవబడిన మనమైతే, ఆయనను తెలుసుకోగలం. ఆ సువార్తలో మనకొరకు చనిపోవడానికై క్రీస్తును పంపించడంలో దేవుడు చూపిన బల వివేకాలు కనబడతాయి. ఈ శుభవార్త ఒక జాతి, ఒక ప్రాంతం వారికి మాత్రమే కాదు. ఎందుకంటే యేసుకు యూదులైనా ఇతర దేశస్తులైనా , భూమి మీద అన్ని జాతులు ఒకటే. 25 బుద్ధిహీనంగా కనిపించే దేవుని కార్యాలు మానవుల అత్యున్నత మేధస్సు గల వాటికంటే తెలివైనవి. దేవుని బలహీన కార్యాలు మానవుల్లో మహా బలమైన వాని కన్నా బలమైనవి.
26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీరు ఏమీ ప్రాధాన్యత లేనివారని గమనించండి. మీలో లోకం దృష్టిలో మేధావులు, జ్ఞానులు, ఉన్నత కులీనులు ఎంతో మంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బుద్ధిహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతుల్ని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
28 అవిశ్వాసులు వేటినైతే విలువ లేనివిగా చూస్తారో, వారు సిగ్గుపడేలా దేవుడు ఆ విలువలేని వాటినే ఎంచుకుంటాడు. 29 ఎందుకంటే ఏ మనిషి తనను తాను కీర్తించుకోకుండా దేవుడినే ఘనపరచాలని ఇలా చేశాడు.
30 దేవుడు చేసిన దానివల్ల మనం యేసుతో ఉన్నాము, ఆయన ఎంత జ్ఞానవంతుడో మనల్నితనతో పాటు ఉంచుకుని కాపాడుకోవడం ద్వారా తెలిసింది. 31 లేఖనాలలో ఇలా రాసి ఉంది.
"అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి."
Chapter 2
1 సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి మాటకారితనాన్నీ , జ్ఞానులు చెప్పిన విషయాలను గానీ ప్రదర్శించ లేదు, దేవుని గురించిన సత్యాన్ని బోధించాను. 2 నేను యేసు గురించి, ఆయన సిలువ మరణం గురించి తప్ప వేరే ఏ విషయం గురించి మీతో మాట్లాడకూడదని తీర్మానించుకున్నాను.
3 నేను మీతో ఉన్నప్పుడు ఎంత బలహీనుడిగా, మనస్సులో భయంతో, వణుకుతూ ఉండేవాడినో మీరు చూశారు. 4 కానీ మీరు నా బోధ విన్నప్పుడు, నేను ముందుగా సిద్ధపడి చెప్పిన వాటి లాగా కాకుండా, దేవుని ఆత్మ ప్రేరణతో నా జీవితంలో యేసు చేసిన అద్భుత కార్యాల ద్వారా నేను సత్యాన్ని బోధించడం చూశారు. 5 నేను ఈ విధంగా ఎందుకు చెప్పానంటే, మీరు మనిషి జ్ఞానం వలన కాకుండా పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుణ్ణి నమ్మాలని.
6 కాని మనం దేవుని యందు జ్ఞానం కలిగిన వారికి బోధిస్తున్నాము. ఆ జ్ఞానం ఈ లోకానికి చెందినది కాదు, త్వరలోనే అంతమైపోయే రాజులు, అధికారులది కూడా కాదు. 7 అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకాన్ని సృష్టించకముందే మనల్ని ఒకరోజు ఘనపరచడానికి సృష్టించాడు.
8 అయితే దాని గురించి ఈ లోకాధికారులు ఎవరికీ తెలియదు. అది వాళ్ళకి తెలిసి ఉంటే మహిమగల ప్రభువుని సిలువ వేసేవారు కాదు. 9 దాన్ని గురించి లేఖనాలలో,
"దేవుడు తనను ప్రేమించేవారి కోసం ఏం సిద్ధపరిచాడో
అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు,
మానవ ఊహకు అందవు" అని రాసి ఉంది.
10 మనకు దేవుడు ఆ విషయాలను తన ఆత్మ ద్వారా చూపించాడు. కాగా ఆ ఆత్మకు అన్ని విషయాలూ , చివరికి దేవుని లోతైన రహస్యాలు కూడా తెలుసు. 11 ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తప్ప వేరే ఎవ్వరికీ తెలియవు. అలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు.
12 దేవుడు మనకిచ్చిన ఆత్మ ఈ లోకం నుండి వచ్చినది కాదు, దేవుని నుండి వచ్చినది. ఆ ఆత్మ మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిన వాటిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. 13 వాటిని ఈ లోకసంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు అర్థం చేసుకోలేరు, దేవుని జ్ఞానం కలిగిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు.
14 అయితే దేవుని గురించి తెలియని వారికి ఈ విషయాలు అర్థం కావు. వారికి అవి తెలివితక్కువ మాటలుగా అనిపిస్తాయి. ఒకవేళ వారు ఆ విషయాలు అర్థం చేసుకోవాలన్నా వారికి అర్థం కావు, ఎందుకంటే అవి దేవుని జ్ఞానం ఉన్నవారికే అర్ధమవుతాయి. 15 అయితే దేవుణ్ణి తెలిసినవాడు అన్నింటిని అంచనా వేయగలడు. కాని దేవుణ్ణి అంచనా వేయడం ఆయన అంగీకరించడు. 16 ఒక ప్రవక్త ఇలా రాసాడు,
"ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు బోధించగలరు? మనకైతే ప్రభువు మనసు ఉంది."
Chapter 3
1 సోదరీ సోదరులారా, నేను మీతో ఉన్నప్పుడు దేవుని గురించి గ్రహించలేని సత్యాలు మాట్లాడలేదు. క్రీస్తులో పసిబిడ్డలతో మాట్లాడిన విధంగా మాట్లాడవలసి వచ్చింది. 2 ఒక తల్లి తన పిల్లలను పాలతో పెంచినట్లుగా, నేను మీకు సులువైన విషయాలు చెప్పాను. బలమైన ఆహారం కొరకు మీరు ఇంకా సిద్ధంగా లేరు. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టలేము కదా.
3 క్రైస్తవులు అయినప్పటికీ మీరు అవిశ్వాసుల్లాగా ప్రవర్తిస్తున్నందుకు నేను అలా అన్నాను. ఎందుకంటే మీ మధ్య అసూయ, ద్వేషాలు ఉన్నాయి. మీలో మీరు గొడవలు పడుతూ అవిశ్వాసులుగానే ఉన్నారు కదా. 4 మీలో కొందరు పౌలు చెప్పిన విధంగా పాటిస్తున్నాము అని, మరికొందరు అపొల్లోను అనుసరిస్తున్నాము అని అంటున్నారు. కాని మీరు అవిశ్వాసుల్లాగా ప్రవర్తిస్తున్నారు.
5 దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలును బట్టి పౌలు ఎవరు? అపొల్లో ఎవరు? మేము దేవుని సేవకులం, ఆయన మాకు అప్పగించిన దాన్ని బట్టి మేము ఆయన్ని సేవిస్తున్నాము.
6 నేను మీలో దేవుని వాక్యం అనే విత్తనం నాటాను, అపొల్లో విశ్వాసజలం పోసి పెంచాడు. కాని దేవుడు మాత్రమే మీలో ఆత్మీయ ఎదుగుదల ఇవ్వగలడు. 7 మళ్ళీ చెబుతున్నాను, "విత్తనం నాటేవాడూ, వాటికి నీళ్ళు పోసేవాడూ ముఖ్యం కాదు. దానికి ఎదుగుదల ఇచ్చే దేవుడు ముఖ్యం. మీరు ఆయన నాటిన తోటవంటి వారు."
8 నాటేవాడు, నీరు పోసేవాడు ఒకే పని కోసం పనిచేస్తున్నారు, కాని పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ప్రతిఫలం ఎవరి కష్టాన్ని బట్టి వారికి వస్తుంది. 9 మేము దేవునికి చెందినవాళ్ళం, ఆయన కొరకు పని చేస్తున్నాం. కాని మీరు మాత్రం దేవుని పొలంలో పెరుగుతున్న వాళ్ళు, మీరు దేవుని కట్టడం.
10 నేను దేవుడి పని చెయ్యడానికి ఆయన నాకు ఈ నైపుణ్యం ఇచ్చాడు. నేను మీ మధ్యలో ఒక గొప్ప నిర్మాణకునిగా పని చేశాను. నా తర్వాత వేరే ఒకరు దానిమీద నిర్మిస్తారు. అయితే ప్రతి ఒకరు తాము ఏ విధంగా కడుతున్నామో జాగ్రతగా చూసుకోవాలి. 11 ముందు వేసిన పునాది కాకుండా, వేరే పునాది ఎవరు వేయలేరు. పునాది యేసు క్రీస్తే.
12 పునాది పైన కట్టే నిర్మాణకుల వంటి వాళ్ళం మనం. ఈ పునాది మీద బంగారం, వెండి, విలువైన రాళ్ళను వాడొచ్చు, లేక పనికిరాని చెక్క, చెత్త పరకలు, గడ్డి లాంటివి కూడా వాడొచ్చు. 13 ఆయన కోసం మనం చేసిన పనులను బట్టి తీర్పు తీరుస్తాడు. మన పనులను పరీక్షించడానికి ఆయన అగ్నిని పంపుతాడు, అది ప్రతి ఒక్కరి పనినీ పరీక్షిస్తుంది.
14 మనం కట్టిన దాన్ని అగ్ని పరీక్షించిన తర్వాత అది నిలబడుతుందో లేదో అన్న దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది. 15 ఎవరి పని అయితే కాలిపోతుందో, అతనికి ప్రతిఫలం అందదు. కాని అతని పని పూర్తిగా కాలిపోయినా , దేవుడు అతణ్ణి కాపాడగలడు.
16 మీరు దేవుని నివాస స్థలమనీ, దేవుని ఆలయమనీ, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? 17 ఆయన ఆలయాన్ని నాశనం చేసేవారిని, దేవుడు నాశనం చేస్తానని వాగ్ధానం ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఆలయం దేవునిది మాత్రమే. అదే వాగ్దానంతో ఆయన మిమ్మల్ని కూడా కాపాడతాడు, ఎందుకంటే మీరు దేవుని ఆలయం.
18 ఎవరూ తమను తాము మోసగించుకోవద్దు. ఎవరైనా తమకి గొప్ప జ్ఞానం ఉందనీ, అవిశ్వాసులు సైతం దాన్ని మెచ్చుకుంటున్నారనీ అనుకుంటుంటే, అతను జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసులు మెచ్చే విషయాలు మీరు వదిలేయండి. వారు మిమ్మల్ని అజ్ఞానులు అనుకున్నా ఫరవాలేదు. ఎందుకంటే అదే నిజమైన దేవుని జ్ఞానం.
19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో తెలివి తక్కువతనమే. "జ్ఞానులను వారి కుట్రల్లోనే ఆయన పట్టుకుంటాడు”
20 "జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అని లేఖనాల్లో రాసి ఉంది కదా.
21 కాబట్టి క్రైస్తవ నాయకులు గురించి గొప్పలు చెప్పుకోవడం మానండి. ఎందుకంటే అన్నీ దేవుడు ఇచ్చినవే కదా. 22 పౌలైనా, అపొల్లో అయినా, పేతురు అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, దేవుడు సృష్టి ఏదైనా అన్నీ మీవే కదా. 23 మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళు, క్రీస్తు దేవునికి చెందినవాడు.
Chapter 4
1 కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని శుభవార్త రహస్యాలను మోసుకొచ్చేవారమనీ పరిగణించాలి. 2 నమ్మకంగా మనం దేవుని పనులు చెయ్యాలి, ఎందుకంటే మనం చెయ్యగలమని దేవుడు నమ్మాడు.
3 మనుషులు గాని, న్యాయస్థానం గాని నాకు తీర్పు తీర్చడం అనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోవడం అంత విలువైనదని భావించను. 4 నేను తప్పు చేశాను అని ఒప్పుకునేవారు ఎవరూ లేరు, అంత మాత్రంచేత నేను ఏమీ తప్పు చెయ్యనట్టు కాదు. నాకు ప్రభువే తీర్పు తీర్చేవాడు.
5 కాబట్టి ఆ సమయం, అంటే ప్రభువు వచ్చేవరకు మనం దేనిని గురించి తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి సరైన తీర్పు తీర్చగలడు, ఎందుకంటే ఆయనకి మన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ వారికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
6 సోదరీ సోదరులారా, మనం పాటించాల్సిన నియమం ఏమిటంటే, "రాసి ఉన్నవాటిని మించి వెళ్లవద్దు." నేనూ అపోల్లో వాటిని బట్టే జీవిస్తూ, మా జీవితమే ఒక ఆదర్శంగా ఉంచి మీకు బోధిస్తున్నాము. మీరు ఒకరి మీద ఒకరు పెట్రేగి పోకూడదని ఇలా బోధిస్తున్నాము. 7 మీకు, ఇతర విశ్వాసులకు ఏమీ తేడా ఉండదు. మీరు పొందినదంతా ఉచిత బహుమానమే. ఇతరుల కంటే మీరు గొప్పేమీ కాదు. మనమందరం సమానమే.
8 ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటనే, ధనవంతులయ్యారంటనే, మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటే మంచిదే మరి! మీరు రాజులు కావడం మంచిదేగా, మేము కూడా మీతో కలిసి పాలించవచ్చు! 9 నిజానికి దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని యుద్ధం తరువాత బందీల ఊరేగింపులో చివరి వరసలో ఉంచి నడిపిస్తున్నట్టు ఉంది. మేము మరణశిక్ష పొందిన వారిలా ఉన్నామని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక చోద్యంలా ఉన్నాము.
10 మేము క్రీస్తు కోసం జీవిస్తున్నాం కాబట్టి ఇతరులు మమ్మల్ని బుద్దిహీనులుగా, తమను తాము తెలివైన వాళ్ళుగా భావిస్తారు. మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు. మీరు ఘనులు. మేము అందరిచేతా అవమానం పొందిన వాళ్ళం. 11 ఈ సమయం వరకు మేము ఆకలి దాహంతో అలమటిస్తున్నాము. మా పేదరికం వల్ల మాకు సరైన బట్టలు కూడా లేవు. అధికారులు మమ్మల్ని దారుణంగా కొట్టారు. నిలువ నీడ కూడా లేని వాళ్ళం.
12 మాకు రెక్కాడితే గానీ డొక్కాడదు. మమ్మల్ని ఇతరులు నిందించినా మేము వారిని ఆశీర్వదిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం. 13 మా గురించి వారు అబద్దాలు చెప్పినా మేము వారితో మంచిగా ఉంటున్నాము. అయినా సరే వారు మమ్మల్ని లోకంలోని మురికిగా, కుప్పలో పారేసిన చెత్తలా చూస్తున్నారు.
14 ఒక తండ్రి తన పిల్లల్ని సరిదిద్దినట్టుగా నేను మిమ్మల్ని సరిదిద్దాలి అనుకుంటున్నాను. అంతేకానీ మిమ్మల్ని సిగ్గుపరచడానికి కాదు. 15 ఎందుకంటే క్రీస్తు గురించి చెప్పడానికి మీకు పదివేలమంది ఉన్నా, ఒకే ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు. నేను చెప్పిన శుభవార్త మీరు నమ్మినప్పుడు నేను క్రీస్తులో మీ తండ్రిని అయ్యాను. 16 అందుకే నా ఉదాహరణను పాటించండి.
17 అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కొడుకు లాంటివాడైన తిమోతిని మీ దగ్గరికి పంపాను. అతడు నేను ఏ విధంగా ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధంగా అనుసరిస్తున్నానో, మీకు జ్ఞాపకం చేస్తాడు.
18 నేను మీ దగ్గరికి రాననుకుని కొందరు మిడిసిపడుతున్నారు.
19 కానీ నేను అక్కడికి తిరిగి రావాలని దేవుడు భావిస్తే, త్వరలో వస్తాను. అక్కడ గర్వంతో మాట్లాడే వారి మాటలు కాకుండా, వారికి దేవుని బలం ఉందో లేదో తెలుసుకుంటాను. 20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు, అది దేవుని శక్తి. 21 నేను మీకు ఏమి చెయ్యాలి? నేను మిమ్మల్ని తీవ్రంగా శిక్షించడానికి రావాలా? లేక ప్రేమతో, మృదువైన మనసుతో రావాలా?
Chapter 5
1 మీ మధ్య వ్యభిచారం అనే పాపం ఉన్నదనీ మీ సంఘంలో కొందరు చెప్పడం మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యతో సంబంధం పెట్టుకున్నాడంట గదా. ఇలాంటి వ్యభిచారం అవిశ్వాసుల్లో సైతం కనిపించదు. 2 ఇలా ఉండి కూడా మీరు అహంకారంతో ఉన్నారు. నిజానికి మీరు ఆ పాపానికి బాగా విలపించాలి కదా. ఇలాంటి పని చేసిన వాడిని మీ సంఘం నుండి వెలివేయాలి.
3 నేను మీకు శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ ఆత్మపరంగా మీతోనే ఉన్నాను. నేను మీతో ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను. 4 మీరు యేసు ప్రభు నామంలో ఆరాధనకు సమకూడినప్పుడు, ఆయన శక్తి ద్వారా నేను నా ఆత్మా మీతో ఉండగా, 5 మీరు అతని శరీరం మాత్రమే నాశనం చేయగలవాడైన సాతానుకు అప్పగించండి, కాగా ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలుగుతుంది.
6 మీరు మిమ్మల్ని మీరు పొగడుకోవడం మంచిది కాదు. ఎలాగైతే పులిపిండి కొంచమే అయినా అది పిండి ముద్దను ఎలా ఉబ్బేలా చేస్తుందో, ఈ చెడు కూడా అలాంటిదే. 7 పాపం కూడా పులిపిండి లాంటిదే. మీరు పాత పులిపిండిని పారెయ్యాలి. లేకపోతే మీ మొత్తం పిండి పాడైపోతుంది. మీరు కూడా పులియని పిండి లాంటివారు. అయితే పస్కా పండుగలో క్రీస్తు మన పస్కా బలిపశువు గనక పిండిముద్దను పులిపిండికి దూరంగా ఉంచుతాం. 8 కాబట్టి మనం పస్కా పండుగ జరుపుకుని శుద్ధీకరణ నియమాలు పాటిద్దాం. చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండిని పారవేసి, దేవునికి లోబడి, అందరితో సత్యం మాట్లాడి పండగను జరుపుకుందాం. మనం అలా చేస్తే పులిపిండి లేని రొట్టెలా ఉంటాము.
9 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. 10 అయితే ఈ లోకానికి చెందిన అనైతికమైన అవిశ్వాసులు, దురాశపరులు, దోచుకునేవారు, విగ్రహాలను పూజించేవారు, ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.
11 నేను చెప్పేది ఏమిటంటే, అక్రమ సంబంధాలు పెట్టుకునే తోటి విశ్వాసులతో మీరు స్నేహం చెయ్యకండి. అంతేకాదు దురాశపరులు, విగ్రహాలను పూజించే వాళ్ళూ, ఇతరులను దూషించే వాళ్ళూ, తాగుబోతులూ, మోసగాళ్ళతో కూడా దూరంగా ఉండండి. అలాంటి వారితో స్నేహమే కాదు, వారితో కనీసం కలిసి భోజనం కూడా చెయ్యకూడదు. 12 సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి, సంఘం లోపలి వారికి తీర్పు తీర్చడమే నా బాధ్యత. 13 సంఘానికి బయట ఉన్నవారికి దేవుడే తీర్పు తీరుస్తాడు.
"మీ మధ్య ఉన్న ఆ దుర్మార్గుడిని మీరు తొలగించండి" అని లేఖనాలలో ఆజ్ఞ ఉంది.
Chapter 6
1 మీలో ఒకరితో ఒకరికి ఏమైనా గొడవ ఉంటే మీరు ఆ గొడవ విషయం గురించి అవిశ్వాసి అయిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళకండి. దేవుడు ఏర్పాటు చేసిన తోటి విశ్వాసుల దగ్గరికి వెళ్ళండి. 2 దేవునికి చెందినవారే ఈ లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చే వారిలా ఉన్నారు. మీరు చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకోలేరా? 3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీరు తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఈ లోకసంబంధమైన విషయాలను సవ్యంగా తీర్పు తీర్చగలగాలి.
4 మీరు జీవితంలో ముఖ్యమైన విషయాలను పరిష్కరించుకోగలినప్పుడు, మీ మధ్య వివాదాలను పరిష్కరించడానికి అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళకూడదు. 5 మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను. క్రైస్తవ సోదరీ సోదరుల మధ్య విభేదాలను పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు ఈ సంఘంలో ఎవరో ఒకరు ఉండిఉంటారు గదా? 6 అయితే మీలో కొంత మంది విశ్వాసులు ఒకరిని ఒకరు నిందించుకుంటూ అవిశ్వాసి అయిన న్యాయాధికారి దగ్గరికి వెళ్తున్నారు.
7 మీకు ఎవరితోనైన గొడవ ఉంది అంటే, మీరు చెయ్యవలసింది మీరు చెయ్యలేదు అని అర్థం. ఆ సోదరి లేక సోదరుడిని మీ మీద విజయం సాధించనివ్వండి. 8 అలా కాకుండా మీరు ఇతరులను మోసంచేసి తప్పు చేశారు. మీ సొంత సొదరీ సోదరులను మోసం చేశారు.
9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి చెందిన వారు కాదని మీరు అర్థం చేసుకోండి. వారిని నమ్మకండి. లైంగిక పాపాలు చేసేవారు, దేవుడిని కాకుండా విగ్రహాలను పూజించేవారు, పెళ్లిని లక్ష్యపెట్టనివారు, వ్యభిచారులు, పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు, 10 దొంగతనం చేసేవారు, ఆశబోతులు, అబద్దాలాడేవారు, ఇతరులను మోసం చేసేవారు. వాళ్ళు ఎవరూ దేవుని రాజ్యానికి చెందరు. 11 మీలో కొందరు అవి చేసేవారే, కాని దేవుడు మిమ్మల్ని ఆ పాపాల నుండి శుభ్రపరచి, మిమ్మల్ని తనకోసం ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇదంతా క్రీస్తు యేసు ప్రభు నామంలో, పరిశుద్ధాత్మ ద్వారా చేశాడు.
12 "నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి, ఏమైనా చేసే స్వేచ్ఛ నాకు ఉంది" అని కొందరు అంటారు. నిజమే. కానీ కొన్నిటికి మనకు అనుమతి ఉన్నంత మాత్రాన అవన్నీ మనకు మేలుకరం కాదు. ఏది చేయడానికైనా నాకు స్వేచ్ఛ ఉంది కానీ దేనికీ నేను బానిసైపోను. 13 అన్నాన్ని జీర్ణించు కోడానికి కడుపూ, కడుపు జీర్ణించుకోవడం కోసం అన్నమూ ఉన్నాయి అంటారు కదా. కానీ దేవుడు త్వరలోనే అన్నాన్నీ సామాన్య దేహ ధర్మాలనూ కూడా లేకుండా చేస్తాడు. అన్నం, కడుపు అనడంలో లైంగిక సంబంధాల గురించే ఆ మాటలు అంటున్నారు. అయితే ప్రభువు మన శరీరాలను చేసింది లైంగిక అవినీతి కోసం కాదు. శరీరం ప్రభువును సేవించడం కోసమే. ప్రభువు శరీరానికి పోషణ దయచేస్తాడు.
14 ఎలాగైతే దేవుడు యేసు క్రీస్తును మరణం నుండి లేపాడో, అలాగే మనల్ని కూడా ఆయన శక్తితో లేపుతాడు.
15 మీ శరీరాలు క్రీస్తుకు చెంది ఉన్నాయని మీకు తెలియాలి. అలాంటి శరీర భాగాలను తీసుకుపోయి వేశ్యతో కలుపుతారా? అలా ఎన్నటికీ జరగకూడదు.
16 వేశ్యతో కలిసేవాడు ఆమెతో ఏకం అవుతాడని మీరు అర్థం చేసుకోండి. "వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని వివాహం గురించి లేఖనాలలో రాసి ఉంది కదా. 17 అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మ అవుతాడు.
18 మీరు లైంగిక పాపం చెయ్యాల్సి వస్తే, దాని నుండి వీలైనంత త్వరగా పారిపోండి. మనిషి చేసే ప్రతి పాపం తన శరీరానికి బయట చేసేవే. ఆ పాపాలు చేస్తున్నవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.
19 మీలో నివసించే పరిశుద్ధాత్మకు మీ శరీరం ఆలయమని మీరు గ్రహించాలి. ఆయనను దేవుడే అనుగ్రహించాడు. మీరు మీ సొంతం కాదు. 20 దేవుడు ఆయన కుమారుని ప్రాణాన్ని వెలగా చెల్లించి మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో చేసే ప్రతిదానిలోనూ ఆయనను ఘనపరచండి.
Chapter 7
1 పెళ్ళి అయిన విశ్వాసులు ఎలా జీవించాలి అనే దాని విషయం మీరు నాకు కొన్ని ప్రశ్నలు రాసారు. వారికి నా జవాబు ఇది. భార్యతో కాపురానికి దూరంగా ఉండవలసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. 2 అయితే పురుషులు తరచూ లైంగిక పాపంలో పడే శోధనకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి భర్తకు తన సొంత భార్య ఉండాలి. అలాగే ప్రతి భార్యకు సొంత భర్త ఉండాలి.
3 పెళ్లి అయిన ప్రతి విశ్వాసీ తన భర్త లేక భార్యతో సంసార ధర్మం జరిగించే హక్కు కలిగి ఉంటారు. 4 భర్తకు తన సొంత శరీరం మీద ఉన్న అధికారాన్ని అతడు తన భార్యకు ఇస్తాడు. అలాగే భార్య కూడా తన దేహం పై అదుపు భర్తకు ఇస్తుంది.
5 ప్రార్థన చేయడానికి వీలు కోసం తాత్కాలికంగా విడిగా ఉండడం కోసం మాత్రమే పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు లైంగిక కలయికకు దూరంగా ఉండవచ్చు. అది అయి పోయిన తరువాత మళ్ళీ కలుసుకోవచ్చు. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేరు కనుక సాతాను మిమ్మల్ని శోధనలో పడవేయకుండా చూసుకోండి.
6 పెళ్లి చేసుకునే విషయంలో నేనేమీ మీకు ఆజ్ఞ ఇవ్వడం లేదు. కాని పెళ్లి చేసుకున్న, చేసుకోవాలనుకుంటున్నన వారిగురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 7 ఇందుకు నేనే మీకు ఉదాహరణ: నేను ఒంటి వాణ్ణి. కొన్నిసార్లు మీరందరూ దేవుని సేవ కోసం ఒంటిగాళ్ళుగా ఉంటే ఎంత బావుండును అనుకుంటాను. కాని దేవుడు తన పిల్లలకి రకరకాల సామర్థ్యాలు ఇస్తాడు. కొందరిని వివాహితులుగా ఉండేలా మరి కొందరిని ఒంటరివాళ్ళుగా ఉండే వీలు ఇస్తాడు.
8 మీలో పెళ్లి కాని వారు, వితంతువులు నాలాగా ఒంటరిగా ఉంటేనే మంచిదని నేను అంటాను. 9 అయితే ఒంటరిగా ఉండటం మీకు కష్టంగా ఉంటే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే కామవాంఛలతో ఉండటంకన్నా పెళ్లి చేసుకుంటేనే మంచిది.
10 పెళ్ళైన వారికి దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు. "భార్య తన భర్త నుండి వేరు కాకూడదు." 11 ఒక వేళ వేరైతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యకి విడాకులు ఇవ్వకూడదు.
12 నేను ఇప్పుడు చెప్పేది నా మాటే గానీ దేవుని ఆజ్ఞ కాదు, ఒకవేళ నీ భార్య అవిశ్వాసి అయితే నీతో ఉండాలని కోరితే ఆమెను విడిచిపెట్టకండి. 13 అలాగే నువ్వు స్త్రీవైతే విశ్వాసి కాని నీ భర్తను విడిచిపెట్టకూడదు. 14 అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్య వల్ల పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. ఇదే విషయం మీ పిల్లలకి కూడా వర్తిస్తుంది. కానీ ఇప్పుడు వారు పవిత్రులే.
15 ఒకవేళ అవిశ్వాసి అయిన నీ భార్య లేదా భర్త మిమ్మల్ని విడిచిపెట్టాలి అనుకుంటే వారిని వెళ్ళనివ్వండి, అప్పుడు తన పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు 16 అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామివల్ల నువ్వు దేవుని పని చెయ్యగలవో లేదో నీకు తెలియదు. మీ ద్వారా మీ జీవిత భాగస్వామిని దేవుడు కాపాడతాడు అని మీకు తెలియదు.
17 మనం దేవుని పిలుపుకు లోబడి ఉండాలి, దేవుడు మనకి అప్పగించిన జీవితం జీవించాలి. ప్రతి సంఘం దీన్ని పాటించాలి. 18 ఒకవేళ ఎవరైనా దేవునిచే రక్షణ పొందక ముందు సున్నతి పొంది ఉంటే, అతను ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వస్తే, అతడు సున్నతి పొందనక్కర లేదు. 19 సున్నతి పొందాడో లేదో ముఖ్యం కాదు. దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నామా లేదా అనేదే ముఖ్యం.
20 ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండండి. 21 నిన్ను దేవుడు రక్షించే నాటికి నువ్వు బానిసవైతే, బాధపడకు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి అవకాశం ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది. 22 ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందినవాడు క్రీస్తుకు బానిస. 23 దేవుడు నిన్ను ఆయన కుమారుడినే వెలగా చెల్లించి కొన్నాడు, నీ స్వతంత్రం విలువైనది. కాబట్టి మనుషులకు బానిస కావొద్దు. 24 క్రీస్తునందు సోదరీ సోదరులారా, దేవుని పిలుపుకు ముందు మనం ఏ స్ధితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉందాం.
25 పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఎలాటి ఆజ్ఞ లేదు కనుక, ప్రభువు కృప చేత నమ్మదగినవాడిగా ఉన్న నేను నా అభిప్రాయం చెప్తాను. 26 మనకి రాబోతున్న కష్ట సమయాలను బట్టి, దేవుడు పిలిచే సమయానికి మనం ఉన్న స్థితిలోనే ఉంటే మంచిదని నా అభిప్రాయం.
27 పెళ్ళైన వారు తమ భార్యలను విడిచిపెట్టకండి, పెళ్లి కానివారు భార్య కావాలని కోరవద్దు. 28 ఆడవారు గాని, మగవారు గాని, ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అయితే పెళ్లి చేసుకుంటే లోకాంతర కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.
29 సోదరీ సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే, ప్రస్తుత కాలంలో సమయం కొద్దిగానే ఉంది, కష్టం తరుముకొస్తూ ఉంది. కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి. 30 శోకంలో ఉన్నవారు ఏడవకూడదు. అద్భుత కార్యాల వల్ల సంతోషించే వారు సంతోషించనట్టు ఉండాలి. ఏదైనా కొనేవారు తాము కొన్నది తమది కానట్టు, వారి దగ్గర ఏమి లేనట్టు ఉండాలి. 31 ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ కృంగిపోతూ ఉంది.
32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్లి కాని వ్యక్తి దేవునికి ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. అతను దేవుణ్ణి సేవిస్తూ, ఆయనికి కావాల్సిన పనులు చేస్తుంటాడు. 33 కాని పెళ్ళైన వాడు, ఈ లోక విషయాలు గురించి శ్రద్ధ కలిగి ఉండటమే కాకుండా తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అనే దృష్టి కూడా ఉంటుంది. 34 అందుచేత పెళ్ళైన మగాళ్ళు వారు చెయ్యాల్సిన పనుల్లో కొన్ని చేస్తారు. అదే విధంగా వితంతువులకి, పెళ్లి కాని స్త్రీకి తేడా ఉంది. విశ్వాసి అయిన పెళ్లి కాని స్త్రీ తన శరీరంతో ఆత్మతో పూర్తిగా దేవుని కార్యాల కోసం గడపడానికి శ్రద్ధ కలిగి ఉంటుంది. కాని పెళ్ళైన స్త్రీకి తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.
35 మీకు సులువుగా ఉండాలని ఇది చెప్తున్నా. మీకు ఆటంకంగా ఉండాలని కాదు. పెళ్ళైన వారు సంసార ఝంఝాటంలో పడిపోయి చింతల పాలు కాకుండా సులభంగా దేవుని సేవ చెయ్యాలని ఈ విషయాలు చెప్తున్నాను.
36 ఒకవ్యక్తి తాను పెళ్లి చేసుకోవాల్సిన స్త్రీకి పెళ్లీడు మించి పోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అది పాపం కానే కాదు. 37 అయితే ఎవరైనా పెళ్లి చేసుకోకూడదని బలంగా నిశ్చయించుకొని, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే, అతడు చేసేదీ మంచి పనే. 38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని అసలు పెళ్ళే చేసుకోను అని నిర్ణయించుకున్న వాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
39 భార్య తన భర్త బ్రతికి ఉన్నంత వరకూ అతనితోనే ఉండాలి. భర్త మరణిస్తే ఆమెకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, కాని ఆ వ్యక్తి విశ్వాసి అయ్యుండాలి. 40 అయితే ఒక వితంతువు మళ్ళీ పెళ్లి చేసుకోకపోతేనే ఆమెకు మంచిది అని నా నమ్మకం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాలో ఉందని నా నమ్మకం.
Chapter 8
1 విగ్రహాలకు బలి అర్పించే ఆహారాన్ని తినడం అనే ప్రశ్నకు: మనమంతా తెలివైన వారమని మనకి తెలుసు. నీకు అన్నీ తెలుసు అనుకుంటే నీలో గర్వం పెరుగుతుంది. కాని నువ్వు ఇతరులను ప్రేమిస్తే, నువ్వు వాళ్ళని విశ్వాసంలో బలంగా చెయ్యగలవు. 2 నిజం ఏమిటంటే ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అనుకుంటే, అతను నేర్చుకోవలసిన విధేయత అతడింకా నేర్చుకోలేదు అని అర్థం. 3 నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునికి నువ్వు తెలుస్తావు.
4 ఇప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, కొందరు చెప్పినట్టు "ఈ లోకంలో విగ్రహంలో దేవుడు లేడు." అదే విధంగా మోషే చెప్పినట్లు, "ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు." 5 దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతోమంది ఉన్నారని కొందరు అంటున్నారు. 6 అయితే మనం ఇలా చెప్పగలం,
మనకైతే ఒకే దేవుడున్నాడు.
ఆయన తండ్రి అయిన దేవుడు.
ఆయన నుండి సమస్తమూ కలిగింది.
ఆయన కోసమే మనమున్నాం.
అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
7 అయితే ఈ విషయం అందరికి తెలియదు. కొందరు ఇంతకుముందు విగ్రహాలను ఆరాధించేవాళ్ళు కాబట్టి, వాటికి అర్పించిన ఆహార పదార్ధాలను తింటే వాటిని పూజించినట్టే అని అనుకుంటారు. వాళ్ళ అభిప్రాయం క్రీస్తు మీద బలహీనంగా ఉండటం వల్ల ఆ ఆహారం తింటే వాళ్ళు విగ్రహాలను పూజిస్తున్నాం అని అనుకుంటారు.
8 మనం తినే ఆహారం మనల్ని దేవుని దృష్టిలో మంచిగా లేదా చెడుగా చెయ్యవని మనకు తెలుసు. 9 అయితే మనకి క్రీస్తులో సోదరీ సోదరులు ముఖ్యం. మనం ఏదైనా తినొచ్చు కాని ఆ విషయం వల్ల మన విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. 10 విగ్రహాలకు ప్రాణం లేదు, అవి దేవుళ్ళు కావు అని మనకి తెలుసు. కాని మంచికీ చెడుకూ తేడా తెలియని వాళ్ళు విగ్రహాలు పెట్టిన స్థలంలో ఉంచిన ఆహరం తింటే మీరు విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నారని వాళ్ళు అనుకుంటారు.
11 ఆ విధంగా విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని మీరు తినడం విశ్వాసంలో బలహీనులుగా ఉన్నవారు చూస్తే, నీకున్న బలం వాళ్ళకి లేదు కాబట్టి ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన విశ్వాసి నీ తెలివి వలన పాడైపోతాడు. 12 ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారిని బాధపెట్టడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. 13 కాబట్టి నా భోజనం నా సోదరీసోదరులు విశ్వాసంలో కాలు జారడానికి కారణమైతే, వాళ్ళకి అభ్యంతరం కలిగించకుండా ఉండేలా నేను ఎన్నటికీ మాంసాహారం తినను.
Chapter 9
1 నేను చేస్తున్న పనిని విమర్శించే వాళ్లకు ఇదే నా సమాధానం: నేను ప్రభువైన యేసుని చూసిన అపొస్తలుడిని. నాకు స్వేచ్ఛ ఉంది. నేను చేసిన పనికి ఫలితం మీరే. నా పనితనానికి మీరే నిదర్శనం. 2 నేను నిజమైన అపొస్తలుణ్ణి కానని కొందరు అనుకున్నా నేనే మీకు అసలైన అపొస్తలుణ్ణి. ప్రభువు నన్ను నియమించుకున్న దానికి రుజువుగా మీరే ఇందుకు సాక్షులు.
3 నా పరిచర్య నిమిత్తం విశ్వాసులైన మీరు ఇచ్చే డబ్బు వాడుకోకపోవడంచేత నేను నిజమైన అపొస్తలుణ్ణి కానని అంటున్న వారికి నేనిచ్చే జవాబు ఇదే. 4 ఆ డబ్బు వాడుకునే హక్కు మాకు తప్పకుండా ఉంటుంది. 5 ప్రభువు సోదరుడు, కేఫా, మిగిలిన అపొస్తలుల వలే విశ్వాసులైన తమ భార్యలను వెంటబెట్టుకుని ప్రయాణాలు చేసే హక్కు మాకూ ఉంది. 6 నేనూ, బర్నబా మాత్రమే మాకోసం మేమే సంపాదించుకోవాలని చెప్పే అధికారం ఎవరికీ లేదు.
7 తన సొంత ఖర్చులు భరించుకుంటూ ఎవ్వరూ సైన్యంలో పనిచెయ్యరు. ద్రాక్ష తోట నాటి దాని పండ్లు తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఎవరు ఉంటారు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగకుండా ఎవరు ఉంటారు?
8 ఇది కనీస జ్ఞానం. చట్టం కూడా ఇదే చెబుతుంది.
9 మోషే చట్టం ఇలా చెబుతుంది, "ధాన్యం నూర్చే ఎద్దు ఏమీ తినకుండా దాని మూతి కట్టివేయవద్దు." ఈ విషయంలో దేవునికి ఇంకా ఎక్కువ పట్టింపు ఉంది. 10 ఈ చట్టం మన కోసమే. మోషే చెబుతున్నది ఏమిటంటే, పంట నూర్చే ఎద్దుకు పంట ఫలాన్ని తినే హక్కు ఉన్నట్టే, ఏదైనా పని చేస్తున్న వ్యక్తికి దాని నుండి ప్రతిఫలం పొందే హక్కు ఉంటుంది. 11 మేము సువార్త అనే విత్తనాలు మీకోసం చల్లినప్పుడు, మీ నుండి మా పని కోసం డబ్బు స్వీకరించడంలో తప్పు ఏమీ లేదు.
12 వేరే వ్యక్తులు మీ నుండి ఇలాటి సహాయం పొందుతున్నప్పుడు, మాకింకా ఎక్కువ అధికారం ఉంటుంది కదా.
అయినప్పటికీ మాకు ఆ అధికారం ఉన్నప్పటికీ మేము మీనుండి ఏమీ ఆశించడం లేదు. బదులుగా క్రీస్తు సువార్తకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అన్నిటినీ భరిస్తున్నాం. 13 దేవాలయంలో పనిచేసేవాళ్ళు దేవుడికి అర్పించిన వాటిలో నుండి కొంత తమ సొంత అవసరాలకు వాడుకుంటారని మీకు తెలుసు. దేవుని సొమ్ము వాళ్ళు వాడుకుంటారు. 14 అదే విధంగా సువార్త ప్రకటించేవాళ్ళు సువార్త ద్వారానే తమ జీవనం గడపాలని ప్రభువు నియమించాడు. దేవునికి ఇవ్వబడిన దాని నుండి కొంత భాగం వాళ్ళు పొందుతారు.
15 అయితే నా కోసం నేనేమీ హక్కుగా భావించి అడగడం లేదు. ఆ కారణం చేత ఇప్పుడు నేను ఈ విషయం రాయడం లేదు. మీ నుంచి ఎన్నడూ నేనేమి అడుగలేదని నేను గర్వంగా చెప్పొచ్చు. మీరు నాకు చెల్లించాల్సిన దాని గురించి నేను ఎన్నడూ అడుగలేదు, దానికంటే మరణమే మేలు. 16 నేను సువార్త ప్రకటించే విషయంలో గర్వించడానికి ఎలాంటి కారణం లేదు. సువార్త ప్రకటన నా బాధ్యతగా భావిస్తున్నాను. దేవుని పిలుపుకు లోబడి నేనా పని చేయకపోతే నాకు కన్నీళ్ళే మిగులుతాయి.
17 నా ఇష్టపూర్తిగా నేను సువార్త ప్రకటిస్తున్నాను. నాకు గొప్ప బహుమతి దొరుకుతుంది. ప్రభువు నాకు ఆ పని అప్పగించాడు కనుక నన్ను ఎవ్వరూ ఒత్తిడి చేయకపోయినా నేను ప్రభుకు కోసం ఆ పని చేస్తాను. 18 అలాంటప్పుడు దేవుని నుండి నాకు వచ్చే బహుమానం ఏమిటి? నా సువార్త ప్రకటనలో నాకు వచ్చే ప్రతిఫలం వాడుకోకుండా నేను సువార్త ఉచితంగా ప్రకటించడమే నాకు బహుమానం.
19 నేను ఎవ్వరికీ లోబడనవసరం లేదు. అయితే నేను అందరికీ సేవకుణ్ణి. క్రీస్తు కోసం అనేకులను సంపాదించడానికి నన్ను నేను సేవకుడుగా మలుచుకున్నాను. 20 యూదుల మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు యూదుడుగా ఉన్నాను. ధర్మశాస్త్రం పాటించే వాళ్ళను క్రీస్తు కోసం సంపాదించడానికి నేను ధర్మశాస్త్రం పాటించకపోయినా, దానికి లోబడినట్టు ఉన్నాను.
21 ధర్మశాస్త్రం పాటించని యూదులు కానివారి విషయంలో నేను వాళ్ళలాగే ఉన్నాను. నేను దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేనివాణ్ణి కాను. క్రీస్తుకు చెందినా ధర్మశాస్త్రం నాకు ఉంది. అయితే ధర్మశాస్త్రం లేనివాళ్ళ కోసం ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. 22 చట్టాలు, ధర్మాల విషయంలో బలహీనులుగా ఉన్నవాళ్ళ కోసం బలహీనుడనయ్యాను. వాళ్ళు క్రీస్తుపై నమ్మకముంచాలని అలా చేశాను. కొందరైనా రక్షణ పొందాలని అన్ని రకాల ప్రజల పద్ధతులతో కలిసిపోయి దేవుడు నియమించిన పని జరిగించాను. 23 క్రీస్తు సువార్త ప్రకటన కోసం ఇదంతా చేస్తాను. ఫలితంగా, సువార్త ప్రకటన తెచ్చే ఉత్తమ ఫలాలలో నేనూ భాగస్వామి అవుతాను.
24 పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే వస్తుందని మీకు తెలుసు కదా! కాబట్టి అదే విధంగా మీరూ బహుమానం కోసం పరుగెత్తండి. 25 అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడిపోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము. 26 కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. 27 ఇతరులకు ప్రకటించిన తరువాత ఒకవేళ నేనే అర్హత కోల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.
Chapter 10
1 సోదరీ సోదరులారా, మీకు గుర్తుందా, దేవుణ్ణి అనుసరించిన మన యూదు పితరులను ఆయన పగటివేళ మేఘం తోడుగా ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు. వారు ఎర్ర సముద్రం మధ్య ఆరిన నేలపై నడిచారు. 2 మనమందరం క్రీస్తులో బాప్తీసం పొందినట్టు వాళ్ళు మోషే నాయకత్వంలో సముద్రంలో మేఘాల కింద బాప్తిసం పొందారు. 3 పరలోకం నుండి దేవుడు వాళ్లకు ఆధ్యాత్మిక మన్నా అనుగ్రహించగా వాళ్ళు భుజించారు. 4 మోషే బండను కొట్టగా ప్రవహించిన ఆత్మ సంబంధమైన నీరు తాగారు. ఆ బండ క్రీస్తే.
5 అయితే వారిలో అనేకులు దేవునికి అవిధేయులై వేరే దేవుళ్ళను పూజించి ఆయన ఉగ్రతకు లోనయ్యారు. అందువల్ల వాళ్ళు చనిపోగా వాళ్ళ శవాలు అరణ్యంలోనే చెల్లాచెదరుగా రాలిపోయాయి.
6 వాళ్ళు చేసినట్టుగా మనం చెడ్డ పనులు చేయకుండా ఉండడానికి ఇప్పుడు మనకొక ఉదాహరణగా ఆ సంగతులు మన ముందు నిలిచాయి.
7 మన పూర్వీకులలో కొందరు విగ్రహాలను పూజించారు. లేఖనాలలో రాసి ఉన్న ప్రకారం, "ప్రజలు తాగడం కోసం, తినడం కోసం, నాట్యం చేయడం కోసం, కామ కార్యకలాపాలు కొనసాగించడం కోసం లేచారు" అని రాసి ఉంది. 8 మన యూదు పూర్వికులు తమ కామ కార్యకలాపాలను బట్టి ఒకే రోజు 23,000 మంది చనిపోయారు.
9 క్రీస్తుకు అవిధేయులై ఆయన అధికారాన్ని పరీక్షించకుండా ఉందాం. అలా చేసి మన పూర్వికులు ఒక్క రోజులోనే విష సర్పాల కాటుకు బలైపోయారు. 10 దేవుడు అనుగ్రహించే వాటి విషయం సణుగుకోవద్దు. అలా చేసి మన పూర్వికులలో కొందరు దూత చేతిలో హతమయ్యారు.
11 ఈ సంగతులన్నీ వారికి జరిగినది మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని గ్రహించి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి. 12 కాబట్టి నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, నువ్వు గనక స్థిరంగా నిలబడి ఉన్నానని భావిస్తే, పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త వహించు. 13 మీరు ఎదుర్కొంటున్న శోధనలు అందరికీ కలిగేవే. మీరు సహించలేనంత బలమైన శోధనలు మీకు కలగనివ్వనని ఆయన వాగ్దానం చేశాడు. అలాంటి శోధన ఎదురైనా దాని నుండి తప్పించుకోనే మార్గం కూడా ఆయన చూపిస్తాడు.
14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు ఎంత దూరంగా పారిపోతే అంత మంచిది.
15 ఎలా జీవిస్తున్నామో అని జాగ్రత్తగా తమను తాము పరీక్షించుకొనే మనుషులతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేనేమి చెప్తున్నానో దాని గురించి ఆలోచించండి. 16 మనం స్తుతులు చెల్లించే ఆ పాత్రలో ఉన్న ద్రాక్షరసాన్ని తాగినప్పుడు క్రీస్తు రక్తంలో మనం ఒక భాగం అవుతున్నాం. మనం రొట్టెను విరుస్తున్నప్పుడు, క్రీస్తు శరీరంలో మనం ఒక భాగం అవుతున్నాం. 17 అక్కడ ఒకే ఒక్క రొట్టె మాత్రమే ఉంది మనం చాలా మందిమిగా ఉన్నప్పటికీ మనమంతా కలిసి ఒకే శరీరం లాగా ఒకే ఒక్క రొట్టెను తీసుకొని కలిసి తింటున్నాం.
18 ఇశ్రాయేలు ప్రజానీకం గురించి ఆలోచించండి. బలిపీఠం దగ్గర అర్పించిన అర్పణలు తినేవారు బలిపీఠం లో భాగం అవుతున్నారు. 19 కాబట్టి విగ్రహాలు నిజమైనవి కావనీ, వాటికి అర్పించిన అర్పణలకి ప్రత్యేకత ఏమీ లేదనీ నేను చెప్తున్నాను. అయినప్పటికీ ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. 20 నా అభిప్రాయం ఏమిటంటే ఒక యూదేతరుడు అర్పణలు అర్పించేటప్పుడు అతడు దయ్యాలకే వాటిని అర్పిస్తాడు గానీ, దేవునికి ఎంతమాత్రం కాదు. కాబట్టి మీరు దయ్యాలతో దేనినీ పంచుకోవాలని నేను కోరుకోవడం లేదు. 21 మీరు ప్రభువు పాత్రలో ఉన్నది తాగి తరవాత మళ్ళీ దయ్యాల పాత్రలో ఉన్నది తాగకూడదు. ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్న తరవాత మళ్ళీ దయ్యాలతో భోజనం చేయకూడదు. 22 అలా చేయడం వల్ల మీ రాజభక్తిలో ఉన్న ద్వంద్వ వైఖరి ప్రభువుకు రోషం తెప్పిస్తుంది. మీరు ఆయన కంటే బలమైన వాళ్ళేమీ కాదు.
23 కొంతమంది అంటారు, "అన్నీ న్యాయ సమ్మతమైన నియమాలే” అని. కానీ అన్నీ మన క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం చేయగలిగేవిగా ఉండవు. అవును, "అన్నీ న్యాయ సమ్మతమైన నియమాలే” కానీ అన్నీ మనుషులు తమ జీవితాల్లో దేవునిలో బలంగా ఎదగడానికి సహాయపడవు. 24 మీ క్షేమం కోసం మాత్రమే పని చేయకండి. ఇతరుల క్షేమం గురించి కూడా పని చేయండి. ఈ రకంగా మనందరం ప్రతి ఒక్కరికీ సాయపడుతూ ఉండాలి. 25 బజారులో దొరికే ఏ మాంసమైనా విగ్రహాలకు దానిని అర్పించారా లేదా అని ఆరా తీయకుండానే మీరు కొనవచ్చు, తినవచ్చు. ఇదే మన నియమం. 26 కీర్తనకారుడు చెప్తున్నట్టుగా, "భూమీ, అందులో ఉన్న సమస్తమూ ప్రభువువే." 27 ఒక యూదేతర అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, వెళ్లాలని మీకూ కోరికగా ఉంటే వెళ్ళండి. అతడు మీకు ఏది వడ్డిస్తే అది తినండి. అతణ్ణి ఈ పదార్థాలను ఎక్కడ కొన్నారని ఆరా తీయమని దేవుడు అడగడు. 28 అయితే ఎవరైనా నీతో, "గుడి దగ్గర విగ్రహాలకు అర్పించిన ఆహార పదార్థాల్ని కొని తెచ్చాము” అని చెబితే మీకు వడ్డించిన ఆ వ్యక్తి క్షేమం కోసం, ఆ వ్యక్తి తప్పొప్పుల మధ్య సందిగ్థంలో పడకుండా ఉండేలాగా అలాటివాటిని మీరు తినవద్దు. 29 మీకు దాని విషయంలో మీ స్వంత ఆలోచన ఏమిటి అనేదానికంటే ఆ తప్పొప్పుల విషయంలో ఎదుటి వ్యక్తి ఆలోచన ఏమిటి అని ఆలోచించాలి. ఇతరులు నమ్మేది తప్పా, ఒప్పా అనేదాని మీద నా వ్యక్తిగత ఎంపికలు మారవు. 30 ఆ భోజనాన్ని నేను కృతజ్ఞతలు చెప్పి ఆనందిస్తూ తిన్నట్టైతే ఇతరులు ఎవరూ నన్ను తప్పు పట్టడానికి నేను ఆస్కారం ఇవ్వను.
31 ఇక్కడ నియమం ఏమిటంటే, మీకిచ్చినది ఏదైనా సరే, అది భోజనం అయినా, పానీయం అయినా, ఏది చేసినా సరే, దేవునికే ఘనత కలిగేలా సమస్తం చేయండి. 32 ఈ విషయాల్లో యూదుల్ని గానీ, గ్రీసు దేశస్తుల్ని గానీ దేవుని సంఘంలో ఉన్నవాళ్ళని గానీ ఇబ్బంది పెట్టవద్దు. 33 సాధ్యమైనంత వరకూ ఏదో విధంగా ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టడమే ధ్యేయంగా నేను పని చేస్తున్నాను. ఇది నా స్వంత లాభం ఆశించి చేయడం లేదు, ఇతరులకు సహాయం చేయడం వల్ల దేవుడు వాళ్ళని రక్షించ గలిగేలా వారిని సిద్ధపరచ డానికి ప్రయత్నిస్తున్నాను.
Chapter 11
1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్నట్టుగా మీరు నాలాగా ఉండండి.
2 మీరు చేసే అన్ని పనుల్లో నన్ను గుర్తు చేసుకుంటూ, నేను మీకు చెప్పిన ముఖ్యమైన బోధలన్నీ కచ్చితంగా పాటిస్తూ ఉన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. 3 క్రీస్తుకు ప్రతి పురుషుడి మీదా అధికారం ఉందనీ, అలాగే పురుషుడికి స్త్రీ మీద అధికారం ఉందనీ అలాగే క్రీస్తు మీద దేవునికి అధికారం ఉందనీ మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. 4 కాబట్టి ఏ పురుషుడైనా ప్రార్థన చేసేటప్పుడు గానీ దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు గానీ తలను కప్పుకుంటే తనను తను అవమానించుకున్నట్టే. 5 అయితే ఒక స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు గానీ దేవుని సువార్తను ప్రకటించే టప్పుడు గానీ తన తలను కప్పుకోక పోతే తనను తానే అవమానించు కున్నట్టు. ఆమె గుండు చేయించుకున్నట్టే. 6 ఎవరైనా ఒక స్త్రీ తన తలను కప్పుకోడానికి ఒప్పుకోకపోతే ఆమె పురుషుడి లాగా తన జుట్టుని కత్తిరించు కోవాలి. అయితే మీకు బాగా తెలుసు, జుట్టు కత్తిరించుకోవడం, గుండు చేసుకోవడం ఒక స్త్రీకి అవమానం. కాబట్టి వీటన్నిటికీ బదులుగా స్త్రీ తన తలను కప్పుకోవాలి. 7 పురుషుడు తన తల కప్పుకోకూడదు. ఎందుకంటే పురుషుణ్ణి దేవుడు తన పోలికలో చేశాడు. కాబట్టి పురుషుడు కొంతవరకు దేవుని ప్రతిబింబిస్తాడు. కానీ స్త్రీలు పురుషులు ఎలా ఉంటారో కొంతవరకు అలా ఉంటారు. 8 దేవుడు పురుషుడైన ఆదామును, స్త్రీ అయిన అవ్వనుండి చేయలేదు. ఆదాము నుండే అవ్వను చేశాడు. 9 దేవుడు పురుషుణ్ణి స్త్రీకి సహాయంగా ఉండడానికి చేయలేదు గానీ, పురుషుడికి సహాయంగా ఉండడం కోసమే స్త్రీని చేశాడు. 10 ఈ కారణం గానే స్త్రీలు తమ అధికారానికి సూచనగా దేవుని దూతల కారణంగా కూడా తప్పనిసరిగా తమ తలను కప్పుకోవాలి.
11 అయితే ప్రభువుతో కలిసి జీవిస్తున్నప్పుడు స్త్రీలకు సహాయంగా పురుషులు అవసరం, పురుషులకు సహాయంగా స్త్రీలు అవసరం. 12 ఎందుకంటే దేవుడు పురుషుడి నుండి స్త్రీని తయారు చేశాడు. అదే కాదు, పురుషుడు స్త్రీనుండే పుట్టాడు. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. అయితే ఇవన్నీ దేవుని నుండే కలిగాయి. 13 మీకు మీరే ప్రశ్నించుకోండి. స్త్రీ తన తలను కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం ఆమెకు సరైనదేనా? 14 పురుషుడు జుట్టును పొడవుగా పెంచుకోవడం అతనికి అవమానం అని ప్రకృతి కూడా మనకి తెలుపుతుంది. 15 అయితే స్త్రీ పొడవైన వెంట్రుకలు పెంచుకోవడం వల్ల ఆమె అందం ఎక్కువవుతుందని ప్రకృతి కూడా మనకి తెలియజేస్తుంది. తన అందాన్ని కప్పుకోడానికి దేవుడే ఆమెకు ఆ తల వెంట్రుకలు ఇచ్చాడు. 16 ఈ విషయం గురించి సంఘంలో ఎవరైనా వాదం పెట్టుకోవాలి అనుకుంటే దీన్ని మించి వేరే రకమైన ఆచారం గానీ, అభిప్రాయం గానీ దేవుని సంఘంలో గానీ, మాలో గానీ లేదని తెలుసుకోవాలి.
17 నేను ప్రభురాత్రి భోజనం విషయంలో మీరు చేస్తున్న దాని గురించి మిమ్మల్ని ఏమీ మెచ్చుకోవడం లేదు. మీరు భోజనానికి అందరూ కలిసి వచ్చినప్పుడు ఒకళ్ళ నొకళ్ళు ప్రోత్సహించు కోవడం, సహాయం చేసుకోవడం మానేసి ఆ సంఘ సహవాసాన్ని మరీ అధ్వాన్నంగా చేసేస్తున్నారు. 18 మొట్ట మొదటిగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మీరు సమావేశం అయినప్పుడు రక రకాలైన ముఠా తగాదాలతో వస్తున్నారు. ఈ విషయాలు నాకు చాల మంది చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమే. 19 మీలో మీకు ఇలా రక రకాల గుంపులూ, భిన్నాభిప్రాయాలూ ఉండడమే మంచిది అనిపిస్తుంది. దీనివల్ల గౌరవం పొందడానికి ఎవరు అర్హులో, ఎవరు కారో పరీక్షించి తెలుసుకోవచ్చు. 20 మీరు సమావేశ మైనప్పుడు ప్రభు రాత్రి భోజనాన్ని చేయడం లేదు. 21 మీరు భోజనం చేసేటప్పుడు ముందు వచ్చిన వ్యక్తే ఇతరుల కోసం కనిపెట్టకుండా మొత్తం భోజనం అంతా తినేస్తున్నాడు. దీనివల్ల ఒకడు బాగా ఆకలితో ఉంటే, ఇంకొకడు బాగా తినీ బాగా ద్రాక్ష రసం తాగీ మత్తులో తూగుతున్నాడు. 22 మీకు తినడానికి ఇల్లే లేనట్టుగా ఉన్నారు. మీరు సంఘాన్ని అవమాన పరుస్తున్నారు. మీరెందుకు సమావేశం అవుతున్నారో ఆ ఉద్దేశానికే విలువ లేకుండా చేస్తున్నారు. పేదవారిని మీరు హీనంగా చూస్తున్నారు. ఇదేమీ మంచి పద్ధతి కాదు. ఇది చాలా అవమానకరమైన విషయం.
23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు దగ్గర నుండే పొందాను, ప్రభువు తన శత్రువులకు తనను అప్పగించుకొనే రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకొని 24 కృతజ్ఞతలు చెప్పిన తరవాత దానిని విరిచి, "ఇది మీ కోసమే ఉన్న నా శరీరం, ఇలా చేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి” అని చెప్పాడు. 25 అలాగే భోజనం చేశాక ఆయన ఒక పాత్రను పట్టుకొని, "ఈ పాత్ర నా రక్తం వల్ల వచ్చిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగుతున్న ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోండి” అని చెప్పాడు. 26 మీరు రొట్టె తిని, ద్రాక్ష రసం తాగే ప్రతిసారీ ప్రభువు మరణాన్ని ఆయన తిరిగి వచ్చేవరకూ ప్రకటిస్తారు.
27 ప్రభు రాత్రి భోజన వేడుకకు వచ్చే వాళ్ళందరూ, అందులో భాగస్వాములైనట్టు. దేవునికి మహిమ తేవాలనే అక్కడికి రావాలి. ఎవరైతే రొట్టె తినడానికీ, పాత్రలోనిది తాగడానికీ వస్తున్నారో, వాళ్ళు తప్పకుండ దేవుని మహిమ కోసమే దాన్ని ఆచరించాలి. ఎవరైతే రొట్టె, ద్రాక్షరసాలను అగౌరవ పరుస్తారో వాళ్ళు ప్రభువు శరీరం, రక్తం విషయంలో దోషులు అవుతారు. 28 కాబట్టి ప్రభు రాత్రి సంస్కారాన్ని తీసుకొనే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా చేసిన తరవాతే రొట్టెని తిని, ద్రాక్షరసాన్ని తాగాలి. 29 ప్రభువు శరీరం అని ఆలోచించకుండా, తిని తాగే వాడు తన మీదికే శిక్షను కొని తెచ్చుకుంటున్నాడు. 30 ప్రభువు శరీరం విషయంలో మీరు ప్రవర్తించే తీరు వల్ల మీలో ఎంతో మంది శారీరికంగా రోగులుగా ఉన్నారు. కొంత మందైతే చనిపోయారు కూడా. 31 ప్రభు రాత్రి సంస్కారాన్ని ఆచరించేటప్పుడు ముందుగా మనల్ని మనం పరీక్షించు కొనేట్టయితే దేవుడు మనల్ని తీర్పు తీర్చడు. 32 అయితే ప్రభువు మనల్ని విమర్శించి శిక్షించి నప్పుడు ఆయన మనల్ని సరిదిద్దడానికే అలా చేస్తాడు. ఆ విధంగా దేవునిపై తిరుగుబాటు చేసిన లోకంతో పాటు మనం శిక్షకు గురికాకుండా చేస్తాడు.
33 నా తోటి విశ్వాసులారా, ప్రభు రాత్రి భోజనానికి మీరు సమావేశం అయినప్పుడు ఒకరికోసం ఒకరు కనిపెట్టండి. 34 మీలో ఎవరికైనా ఆకలేస్తే మీ ఇళ్ళ దగ్గర తినేసి రండి. అలా చేయడం వల్ల సంఘంగా అందరూ సమకూడినప్పుడు దేవుడు క్రమశిక్షణ లో పెట్టే పరిస్థితిని మీరు తీసుకు రారు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు మీరు రాసిన ఇతర విషయాల గురించి సూచనలు చేస్తాను.
Chapter 12
1 సోదర సోదరీలారా, ఇప్పుడు ఆత్మ వరాల గురించి నన్ను చెప్పనీయండి. వాటిని మీరు ఎలా ఉపయోగించాలో తెలియజేయాలి అనుకుంటున్నాను. 2 గతంలో మీరు విగ్రహాలను పూజించిన రోజుల్లో, అవి ఒక్క మాట కూడా మాట్లాడలేవనీ, అవి మిమ్మల్ని పూర్తిగా దారి తప్పించాయనీ ఒకసారి గుర్తు చేసుకోండి. 3 దేవుని ఆత్మ "యేసే ప్రభువు” అని ప్రకటించడానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళెవ్వరూ "యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు.
4 దేవుని ఆత్మ ఒక్కడే గానీ ఆయన తన ప్రజలకు అనేక ఆత్మ వరాలు ఇస్తాడు. 5 దేవుణ్ణి సేవించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి గానీ ప్రభువు ఒక్కడే. 6 దేవుని రాజ్యంలో పరిచర్య చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి గానీ ఆయన కోసం పనిచేయడానికి తన ప్రజలకు శక్తినిచ్చే వాడు మాత్రం దేవుడే.
7 దేవుడు ప్రతి విశ్వాసీ ఎంతో కొంత ఆత్మ శక్తి కలిగి, దానిని కనపరచ గలిగేలా సహాయం చేస్తాడు. అందరూ తనను నమ్మాలనీ, తనను మహిమ పరచాలనే ఉద్దేశంతో దేవుడు విశ్వాసులందరికీ ఈ విధంగా సహాయం చేస్తాడు. 8 ఆ ఆత్మ ఒక వ్యక్తికి దేవుని జ్ఞానంతో ఒక సందేశాన్ని ప్రకటించే సామర్ధ్యం ఇస్తే, మరొక వ్యక్తికి ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందించే సామర్ధ్యం ఇస్తాడు. 9 దేవుని ఆత్మ ఒక విశ్వాసికి దేవుని అద్భుత కార్యాన్ని విశ్వసించే సామర్ధ్యాన్ని, అదే ఆత్మ మరొక వ్యక్తికి ఇతరుల స్వస్థత కోసం దేవునికి ప్రార్థించే సామర్ధ్యాన్ని ఇస్తాడు. 10 ఆ ఆత్మే కొంతమంది విశ్వాసులకు అనేకులు దేవుణ్ణి మహిమ పరిచేలా అద్భుతాలు చేయగలిగే సామర్ధ్యం ఇస్తాడు. కొంతమంది విశ్వాసులకు దేవుని నుండి వచ్చిన ప్రవచనాలు పలికే సామర్ధ్యం ఇస్తాడు, మరి కొంతమందికి దేవున్ని మహిమపరచే ఆత్మలను, మహిమపరచని ఆత్మలను గ్రహించగలిగే సామర్ధ్యం ఇస్తాడు. మరి కొంతమందికి వివిధ రకాల భాషల్లో మాట్లాడే సామర్ధ్యాన్నీ, ఇంకొందరికి ఆ భాషల అర్ధాన్ని మన స్వంత భాషలో వివరించే సామర్ధ్యాన్నీ ఇస్తాడు. 11 అదే ఆత్మ మళ్ళీ రక రకాల వరాలను ఆయన ఎంచుకున్న వ్యక్తులకు ప్రత్యేకంగా ఇవ్వడం మనం చూస్తాం.
12 మనిషి శరీరంలో ఎన్నో అవయవాలున్నా శరీరం ఒక్కటే. అయితే ప్రతి అవయవం శరీరాన్ని సంపూర్ణం చేస్తుంది. క్రీస్తు విషయం లో కూడా ఇంతే. 13 మనం బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు ఆత్మ చేతనే పొందాం. మనలో ప్రతి ఒక్కరం క్రీస్తు శరీరంలో కలిసి భాగం అయ్యాం. మనం ముందు, వెనకలు ఎలాంటివైనా సరే, ఇందులో ఎలాంటి తేడా లేదు. యూదుడైనా, గ్రీకు వాడైనా, బానిసైనా, స్వతంత్రుడైనా మనలో ప్రతి ఒక్కరం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాం.
14 గుర్తుంచుకోండి, శరీరం అంటే ఒకే ఒక్క అవయవం కాదు. ఒక్క శరీరాన్ని తయారు చేయడానికి ఎన్నో అవయవాలు కలిసి పని చేయాలి. అప్పుడే ఒక శరీరం అవుతుంది. 15 నీ కాలు ఒకవేళ, "నీతో నేను చెయ్యిని కాదు కాబట్టి, నేను నీ శరీరంలో భాగం కాదు” అంటే అది శరీరంలో నీ చెయ్యిలాగా ఉండదు కాబట్టి శరీరంలో భాగం కాకుండా పోతుందా ఏంటి? 16 ఒకవేళ చెవి నీతో, "నేను నీ కన్నుని కాదు కాబట్టి ఆ కారణంగా నీ శరీరంలో నాకు స్థానం లేదు” అని చెబితే అది నీ కన్నులాగా లేదు కాబట్టి నీ శరీరంలో భాగం కాకుండా పోతుందా ఏంటి? 17 నీ శరీరం అంతా కన్నే అయితే వినడానికి అక్కడ ఏమీ ఉండదు. నీ శరీరం అంతా చెవే ఉన్నట్టయితే చూడ్డానికి అక్కడ ఏమీ ఉండదు. 18 అయితే దేవుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాల్నీ కలిపి ఒక్కటిగా అమర్చాడు. ఆయన రూపకల్పన చేసినట్టుగా అవి పని చేస్తున్నాయంతే. ప్రతి అవయవమూ అవసరమే. 19 మనలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఒకే రకమైన అవయవాలుగా ఉంటే మనకి అసలు శరీరం అనేదే ఉండదు. 20 మనందరం ఎంతోమందిమి. అవయవాలు ఎన్నో ఉన్నాయి. అయితే శరీరం మాత్రం ఒక్కటే. 21 మీ శరీరంలో కన్ను, "నువ్వు నాకు అవసరం లేదు” అని చేతితో చెప్పలేదు. తప్పకుండా చెయ్యి అవసరమే. తల పాదాలతో, "నువ్వు నాకు అక్కరలేదు” అని చెప్పడానికి వీలు లేదు. 22 శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు కూడా శరీరం మొత్తానికి ఎంతో అవసరం. 23 శరీరంలో ఇతరులు చూడ్డానికి సిగ్గుపడే కొన్ని అవయవాల విషయంలో మనం ఎంతో జాగ్రత్త తీసుకొని వాటిని కప్పుకుంటాం. ఇలా చేయడం వల్ల మనం వాటి విషయంలో మరింత గౌరవం చూపుతున్నాం. 24 అయితే దేవుడు అలాంటి ప్రత్యేకమైన అవయవాలను తక్కువ ప్రాధాన్యత ఉన్న వాటితో జత కలిపాడు. అంతే కాదు, దేవుడు ఎక్కువగా ప్రదర్శించలేని అలాంటి అవయవాలకు అవి కూడా శరీరంలోని భాగాలు కాబట్టి వాటికి ఎక్కువ ఘనతనిస్తాడు. 25 ఆ విధంగా దేవుడు శరీరం అంతటికీ గౌరవం ఇచ్చాడు. అలా చేయడం వల్ల సంఘంలో వివాదాలు రావు. క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి విశ్వాసీ దాని ఉద్దేశాలతో, హోదాతో, వరాలతో, సామర్ధ్యాలతో సంబంధం లేకుండా శరీరంలోని ఇతర విశ్వాసుల విషయంలో అదే ప్రేమ, అదే శ్రద్ధ చూప గలుగుతారా? 26 ఎందుకంటే మనందరం ఒకే శరీరం కాబట్టి ఒక అవయవం బాధ పడితే మిగిలిన అవయవాలన్నీ బాధ పడతాయి. ఒక విశ్వాసి వల్ల క్రీస్తుకు మహిమ కలిగితే శరీరంలో ఉన్న విశ్వాసులంతా కలిసి సంతోషిస్తారు.
27 ఇప్పుడు మీరు క్రీస్తు శరీరం కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆ శరీరానికి చెందిన అవయవాలు. 28 దేవుడు సంఘానికి ప్రజలను కూడా వరాలుగా ఇచ్చాడు. సంఘానికి మొదటిగా అపోస్తలుల్నీ రెండవదిగా ప్రవక్తల్నీ, మూడోది బోధకుల్నీ తరవాత అద్భుతాలు చేసే వాళ్ళనీ, స్వస్థతలు చేసే వాళ్ళనీ, ఉపచారం చేసే వాళ్ళనీ, అజమాయిషీ చేసే వాళ్ళనీ, ఆత్మ అనుగ్రహించిన వివిధ రకాల భాషలు మాట్లాడే వాళ్ళనీ, ఇచ్చాడు. 29 మనందరం అపోస్తలులం కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ అద్భుతాలు చేయరు. 30 అందరం స్వస్తతలు చేయలేము, అందరం ప్రత్యేకమైన భాషలు మాట్లాడలేం, అందరం ఇతర భాషల్లోకి సందేశాలను అనువదించలేము. 31 అయితే శ్రేష్టమైన వరాల కోసం ఆసక్తిగా వెదకండి. ఇప్పుడు నేను వీటన్నిటిని మించిన సర్వ శ్రేష్టమైన మార్గాన్ని మీకు చూపిస్తాను.
Chapter 13
1 ఎదుటివారిని ఆశ్చర్య చకితుల్ని చేసి, నాకు అనుకూలమైన పనులు చేసేలా వారిని ఒప్పించ గలిగేలా మాట్లాడినా, ఒకవేళ దేవదూతల భాషతో మాట్లాడినా సరే, మనుషులపై ప్రేమ లేకపోతే మాత్రం నా మాటలన్నీ శబ్దం చేసే గంట లాగా, గణ గణ మని మోగే కంచు తాళం లాగా విలువ లేకుండా ఉంటాయి. 2 దేవుని కోసం ప్రవచించ గలిగినా, దేవుని మర్మాలను వివరించి చెప్పగలిగినా పర్వతాలను పెళ్ళగించే విశ్వాసం దేవునిపై ఉంచగలిగినా సరే, నేను మనుషుల్ని ప్రేమించకపోతే మాత్రం విలువ లేని వాడినే. 3 నాకున్నదంతా పేదలను పోషించడానికి ధారపోసినా, ఎవరినో కాపాడడానికి నా శరీరం కాలిపోయేంతగా నేను త్యాగం చేసినా సరే, మనుషుల్ని ప్రేమించలేక పోతే మాత్రం వీటి వలన నేనేమీ సంపాదించుకోలేను.
4 మీరు నిజంగా ఇతరుల్ని ప్రేమించ గలిగితే కష్టాలను సంతోషంగా ఓపికతో సహిస్తారు. మీరు నిజంగా ప్రేమిస్తే, ఇతరుల విషయంలో దయ కలిగి ఉంటారు. మీరు నిజంగా ప్రేమిస్తే ఇతరులు ఎంత సంపాదించుకున్నా మీకేమీ లేకపోయినా సరే మీరు అసూయ పడరు. మీరు నిజంగా ప్రేమిస్తే మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోరు, గర్వంతో మిడిసిపడరు. 5 మీరు ఇతరుల్ని నిజంగా ప్రేమిస్తే మీరు వాళ్ళని నిందించరు. కేవలం మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోడానికే జీవించరు. ఇతరులు ఏమి చేసినా మీరు తొందరపడి కోపం తెచ్చుకోరు. ఇతరులు మీ విషయంలో చేసిన తప్పుల్ని మీ మనసులో ఉంచుకోరు. 6 మీరు నిజంగా ఇతరుల్ని ప్రేమిస్తే, ఎవరైనా చెడ్డ పనులు చేస్తుంటే మీరు సంతోషంగా ఉండలేరు. అయితే ఎవరైనా దేవునికి నమ్మకస్తులుగా ఉంటే మీరెంతో సంతోషిస్తారు. 7 మీరు నిజంగా ప్రేమిస్తే జరిగే వాటన్నిటినీ భరిస్తారు. దేవుడు తన ప్రజలకు మేలు చేస్తాడని నమ్మి ఆశతో ఎదురు చూస్తారు. ఏది జరిగినా, దేవున్నే నమ్ముతారు. మీరు ఎలాంటి కష్టాలు ఎదురైనా, దేవునికే విధేయులై ఉంటారు.
8 మీరు నిజంగా ప్రేమిస్తే మీరు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. ఎవరైతే దేవుని ప్రవచనాలు చెప్పగలరో, కొత్త భాషలు మాట్లాడగలరో, ఎవరైతే దాగి ఉన్న మర్మాలు గ్రహించగలరో, ఇవన్నీ కొంతకాలం మట్టుకే ఉంటాయి. ఇలా చేయడం వాళ్ళు ఒక రోజు ఆపేస్తారు. 9 ఇప్పుడు ఈ జీవితంలో మనకు తెలిసింది కొంచెం మాత్రమే. దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు కొంతవరకు మాత్రమే చేస్తారు. 10 అయితే విషయాలన్నీ పరిపూర్ణం అయినప్పుడు పాక్షికంగా ఉన్నవీ, అసంపూర్ణంగా ఉన్నవన్నీ అంతమై పోతాయి. 11 నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, చిన్న పిల్లాడిలా మాట్లాడాను. చిన్న పిల్లాడిలాగా ఆలోచించాను, చిన్న పిల్లవాడు చేసే నిర్ణయాలు చేశాను. అయితే పెద్దవాడైనప్పుడు చిన్న పిల్లాడి చేష్టలు మానేశాను. పెద్దవాడిలా ఉండటం మొదలు పెట్టాను. 12 క్రీస్తును గురించి ఇంతవరకు ఏం అర్థం చేసుకున్నామో అది అసంపూర్ణం మాత్రమే. అయితే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన్ని మనం ముఖా ముఖిగా చూస్తాం. వాస్తవంగా ఇప్పుడు కొంత మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన గురించి ఆయనకు పూర్తిగా తెలిసినట్టుగా మనం కూడా ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటాం. 13 మనం క్రీస్తును విశ్వసించడం, ఆయన వాగ్దానం చేసినవన్నీ కచ్చితంగా చేస్తాడనే ఆశాభావం కలిగి ఉండడం దేవుణ్ణీ, మన పక్కవాళ్ళని ప్రేమించడం, ఈ మూడూ చాలా ముఖ్యమైనవి. అయితే ఈ మూడింటిలో గొప్పదీ, ఉత్తమమైందీ ప్రేమే.
Chapter 14
1 నేను ఎలా ఇతరుల్ని ప్రేమించాలో అని మీ తోటి విశ్వాసుల్ని బలపరిచే వరాల కోసమని నేను పోరాడుతున్నాను. ముఖ్యంగా దైవ సందేశాలను ప్రకటించే వరం కోసం ప్రయాసపడండి. 2 ఒక వ్యక్తి ఆత్మతో తెలియని భాషలో మాట్లాడినప్పుడు అతడు అక్కడి ప్రజలతో మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు కాబట్టి అతడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఆత్మ నడిపిస్తుండగా అతడు విషయాలను దేవునితోనే చెప్తున్నాడు. 3 ఇంకో పక్క ప్రవక్త, దేవుని నుండి వచ్చిన సందేశాన్ని నేరుగా ప్రజలకు ప్రకటిస్తున్నాడు. వాళ్ళని బలపరచడానికీ, స్థిరంగా నిలిచి ఉండేలా సహాయపడడానికీ, కష్టాల్లో కూడా సంతోషంగా ఉండేలా వారిని ఆదరించడానికీ ప్రకటిస్తున్నాడు. 4 ఆత్మ సహాయంతో భాషలతో మాట్లాడే వ్యక్తి తన వ్యక్తిగత క్షేమాభివృద్ధికీ, తన ఆత్మీయ జీవితం ఎదగడానికీ భాషలతో మాట్లాడుతున్నాడు. అయితే దైవ సందేశాన్ని ప్రకటించే వ్యక్తి ప్రతి ఒక్కరి క్షేమాభివృద్ధికీ, విశ్వాస జీవితం బలపడడానికీ, ప్రతి ఒక్కరికీ ఆదరణ, ఓదార్పు కలగడానికి సహాయపడతాడు.
5 ఇప్పుడు మీరందరూ అలాంటి భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. గానీ దానికంటే మరింత గొప్ప వరం దేవుడు తెలియచేసిన సందేశాలను ప్రకటించే వరం. ఆ వరాన్ని మీరందరూ కోరుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే దేవుని నుండి వచ్చిన సందేశాలను ప్రకటిస్తారో వాళ్ళు తమ తోటి విశ్వాసుల్ని బలపరచడానికి సహాయపడిన వాళ్ళవుతారు. ఆ కారణంగా తెలియని భాషలతో సందేశాన్ని ప్రకటించే వాళ్ళ కంటే ఈ పని చాలా గొప్పది. ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవానికి అర్థం చెప్పేవాడు ఇంకొకడు ఉంటేనే తప్ప ఆ సందేశాలు ఎవరికీ అర్థం కావు.
6 నేను మీ దగ్గరకు మీకు తెలియని భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. అది మీకేమైనా సహాయపడుతుందా? అది బూడిదలో పోసిన పన్నీరే కదా? నేను వచ్చి మీతో మాట్లాడి మీ మనసులో ఉన్న విషయాలు తెలుసుకుంటే తప్ప మీకేవిధంగానూ నేను సహాయపడలేను. లేకపోతే మీకు తెలియని సత్యాన్ని అర్ధమయ్యేలా చెపితే తప్ప ఇంతకు ముందెప్పుడూ మీరు వినని సందేశాన్ని ప్రకటించి, లేక ఇంతకు ముందెప్పుడూ మీరు నేర్చుకోని నియమాన్ని మీకు అర్ధమయ్యే భాషలో మాట్లాడితేనే తప్ప మీకు ఏవిధంగానూ సహాయపడలేను. 7 ఎవరైనా, వేణువు గానీ, వీణ గాని (అవి ప్రాణమున్నవి కాదు) వాటి మీద ఉన్న స్వరాల మధ్య తేడా ఒక్కొక్కటీ వేరు వేరుగా స్వరాలు పలకకపోతే నేను వాయించే రాగం ఏమిటో ఎవరూ చెప్పలేరు. 8 సైనికులు బాకాను పేలవంగా ఊదితే సైన్యానికి యుద్ధానికి సిద్ధపడాలో లేదో ఏమీ అర్థం కాదు. 9 ఎవరూ అర్థం చేసుకోలేని మాటలు పలికితే ఇలాగే ఉంటుంది. మీరేమి చెప్పారో ఎవరికీ అర్థం కాదు. 10 ఈ లోకంలో చాలా భాషలు ఉన్నాయి. ఆ భాషలు తెలిసిన వాళ్లకి అవి అర్ధమవుతాయి. 11 కానీ ఎవరి భాష అయినా నాకు అర్థం కాకపోతే నేను అతనికి ఒక విదేశీయుడి లాగా ఉంటాను. అతడు కూడా నాకు అలాగే ఉంటాడు. 12 కాబట్టి ఆత్మ మీలో బాగా పని చేయాలని కోరుకుంటే సంఘంలో ఉన్న విశ్వాసులు క్రీస్తును విశ్వసించి ఆయనకు లోబడేలాగా వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించండి. 13 అందువల్ల దేవుడు మీకిచ్చిన తెలియని భాషలో మీరేం చెప్తారో దాని అర్థం చెప్పే సామర్ధ్యం కూడా దేవుడు మీకివ్వాలని దేవుణ్ణి ప్రార్థించండి. 14 ఎవరైనా అలాంటి భాషలో ప్రార్థన చేస్తే అతని ఆత్మ కచ్చితంగా ప్రార్ధిస్తుంది గానీ అతని మనసు మాత్రం ప్రార్ధించదు. 15 కాబట్టి మనం తప్పకుండా మన ఆత్మతో, మన మనసుతో కూడా ప్రార్ధించాలి. దేవుని స్తుతించే విషయంలో కూడా అంతే. 16 మీరు మీ ఆత్మతోనే దేవుని స్తుతించాలని మీరు పట్టుబడితే గనక మీరేం మాట్లాడుతున్నారో బయటివాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అంతే కాదు, వాళ్ళెప్పటికీ మీరు చెప్పే ఆ సందేశాన్ని అంగీకరించలేరు. 17 ఒకవేళ మీరు ఆత్మతో స్తుతులు చెల్లిస్తే అది మీకు మేలుకరమే గానీ మీరు సహ విశ్వాసులకు ఏమాత్రం సహాయం చేయలేరు. 18 మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడు తున్నందుకు దేవునికి వందనాలు చెబుతున్నాను. 19 కానీ సంఘంలో ఆత్మతో తెలియని భాషతో పది వేల మాటలు పలకడం కన్నా ఇతరులకు అందులో ఉన్న ఉపదేశం అర్థం అయ్యేలాగా నా మనసుతో ఐదు మాటలు పలకడం మేలు.
20 సోదర సోదరీల్లారా, మీరు పెద్దల్లాగా ఆలోచించాలి. అయితే మీరు చెడ్డ విషయాల గురించి ఆలోచించేటప్పుడు చిన్న పిల్లల్లాగా ఆలోచించాలి. మీ ఆలోచన తెలివిగా ఉండాలి. 21 ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, - "దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో నేను మాట్లాడతాను. పురుషులు, ఎవరైతే తెలియని భాషలో మాట్లాడతారో, వాళ్ళ ద్వారా నేను మాట్లాడ తాను. నా ప్రజలు నన్ను అర్థం చేసుకోరు."
22 కాబట్టి దేవుడు ఒక విశ్వాసికి ఇచ్చిన ఒక్క భాషతో అతడు మాట్లాడినట్లైతే, ఆ మాటలు విన్న ఒక అవిశ్వాసిని ఇది ప్రభావితం చెయ్యొచ్చు. అయితే ఒక విశ్వాసి దేవుని నుండి వచ్చిన సందేశాన్ని చెప్తే అది ఇతర విశ్వాసుల్ని ప్రభావితం చేస్తుంది. 23 ఒక చోట విశ్వాసులంతా కలుసుకొని ఒక్కక్కళ్ళు ఒక్కొక్క భాషతో మాట్లాడుతుంటే అది ఎంత గందరగోళంగా ఉంటుందో మీరు చూడవచ్చు. ఏ అవిశ్వాసి అయినా అది విన్నప్పుడు వాళ్ళని పిచ్చోళ్ళు అనకుండా మానడు. 24 అయితే మీరందరూ దేవుడిచ్చిన సత్య సందేశాలను ప్రకటిస్తూ ఉంటే అవిశ్వాసు లెవరైనా లోపలికి వచ్చి ఆ సందేశం విని దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని ఒకవేళ అతడు గ్రహించవచ్చు. 25 ఈ అవిశ్వాసి తనలో ఉన్న లోతైన మనస్సాక్షిని గుర్తిస్తాడు. అతడు సాష్టాంగపడి భయంతో, ఆశ్చర్యంతో దేవుణ్ణి స్తుతించి నిజంగా మీలో దేవుడున్నాడని ప్రకటిస్తాడు.
26 సోదర సోదరీల్లారా దేవుని ఆరాధించడానికి మీరు వచ్చినప్పుడు ఇలా చేయాలి, ప్రతి ఒక్కళ్ళూ కీర్తన పాడాలి లేకపోతే లేఖన భాగాలలో నుండి ఏదైనా ఉపదేశం చెయ్యాలి. దేవుడు మీతో చెప్పినది ఏదైనా సరే, అది తెలియని భాషలో సందేశం అయినా, దానికి అర్థం చెప్పడం అయినా చెయ్యాలి. మీరు క్రీస్తు సంఘం కాబట్టి మీరేం చేసినా కలిసికట్టుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలి. 27 ఎవరైనా ఆత్మ సహాయంతో తెలియని భాషలో మాట్లాడడానికి ఇష్టపడితే అక్కడ అలాంటి వ్యక్తులు ఇద్దరు లేక ముగ్గురి కన్నా మించకుండా ఉండాలి. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. ఆ సందేశాలకు ఎవరైనా ఒకళ్ళు అర్థం చెప్పాలి. 28 అయితే ఆ సందేశాలను ఆనువదించే వాళ్ళు ఎవరూ లేకపోతే ఆ తెలియని భాషలో సందేశం చెప్పేవాళ్ళు మౌనంగా ఉండి, వాళ్ళు దేవునితో మాత్రమే మాట్లాడాలి.
29 దేవునినుండి వచ్చిన సందేశాన్ని ప్రకటించాలి అనుకునేవాళ్లు ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే ఉండాలి. మిగిలిన వాళ్ళంతా, వాళ్ళు చెప్పిన సందేశాలు లేఖనాలను అనుసరించి ఏమి చెప్తున్నాయో విమర్శనాత్మకంగా పరిశీలించాలి. 30 అయితే సంఘంలో కూర్చుని ఉన్న మరెవరికైనా దేవుడు ఏదైనా వెల్లడి చేస్తే సందేశాన్ని వెల్లడిస్తున్న వ్యక్తి మాట్లాడ్డం ఆపేయాలి. ఇలా చేయడం వల్ల విశ్వాసులంతా ఆ సందేశం లోని అర్ధాన్ని వినగలుగుతారు. 31 వాళ్ళలో ప్రతి ఒక్కరూ అలా దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించాలి. అయితే వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు క్రమాన్ని అనుసరించి అలా చేయాలి. ఇలా చేయడం వల్ల విశ్వాసులందరూ నేర్చుకొనేలా, దేవుణ్ణి ఇంకొంత మెరుగ్గా ప్రేమించడానికి ధైర్యాన్ని, ప్రాత్సాహాన్ని పొందుతారు. 32 దేవుడిచ్చిన సందేశాన్ని నిజంగా ప్రకటించే వారి ఆత్మ వారి స్వాధీనంలో ఉంటుంది. 33 దేవుడు శాంతినీ నెమ్మదినీ కలిగించేవాడే గాని, గందరగోళాన్ని కలిగించే వాడు కాదు. ఈ తరవాతి ప్రశ్న కూడా ప్రతి సంఘంలోని దేవుని ప్రజలకు ఇలాంటి జవాబే ఇచ్చింది. 34 సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడడానికి అనుమతి లేదు. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తున్న వాళ్లకు అడ్డు తగలకూడదు. వాళ్ళు ఎప్పుడూ భర్తలకు లోబడి ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. 35 స్త్రీలు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆరాధనను ఆటంక పరిచే బదులు ఇంట్లో భర్తల దగ్గర నేర్చుకోవాలి. స్త్రీలు సంఘ కార్యక్రమాలకు అడ్డు తగలడం తమ భర్తలకు అవమానం. 36 దేవుడు ఎవరి చేత మనకు ఆయన వాక్కును ఇచ్చాడో, ఆ ప్రజలు మీరేనా? మీరొక్కరి వల్లనే దేవుని వాక్కు వచ్చిందా? 37 మీలో ఎవరైనా ప్రవక్తననీ ఆత్మీయ వ్యక్తిననీ తలస్తే నేనిక్కడ రాస్తున్న విషయాలు ప్రభువు ఆజ్ఞాపించినవనీ, వాటిని కచ్చితంగా అనుసరించాలనీ మీరు అంగీకరించాలి. 38 ఎవరైతే నేను రాసిన వాటిని పట్టించుకోరో, మీ సంఘాల్లో మీరు కూడా వారిని పట్టించుకోకండి.
39 కాబట్టి సోదర సోదరీల్లారా, దేవుడిచ్చిన సందేశాన్ని సంఘానికి ప్రకటించే వరానికై ఉవ్విళ్ళూరండి. దేవుడిచ్చిన తెలియని భాషలో సందేశాన్ని ప్రకటించే వాళ్ళను ఆపకండి. 40 సంఘ ఆరాధన అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో మర్యాదగా క్రమంగా జరపండి.
Chapter 15
1 సోదరీ సోదరుల్లారా, ఇప్పుడు నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ సువార్తను మీరు నమ్మి దాని ప్రకారం ఇప్పుడు జీవిస్తున్నారు. 2 ఈ సువార్త మిమ్మల్ని రక్షించింది. మీరు నిజంగా నమ్మక పోతే తప్ప మీరు దానిని గట్టిగా పట్టుకున్నంత కాలం అది మిమ్మల్ని రక్షిస్తుంది.
3 లేఖనాల్లో ముందే రాసి ఉన్నట్టు క్రీస్తు మన పాపాల గురించి చనిపోయాడని ఇతరులు నాకు చెప్పిన ఉపదేశాన్ని మొదటిగా మీకే తెలియజేశాను. 4 అంతే గాక ఆయన్ని సమాధి చేశారనీ, మూడవ రోజు ఆయన్ని దేవుడు తిరిగి లేపాడనీ, ఇలా లేఖనాల్లో ఎలా రాసి ఉంటే అలా అన్నీ జరిగాయి. 5 తరవాత ఆయన కేఫాకు (పేతురుకు) కనిపించాడు. తరవాత మిగిలిన అపోస్తలులందరికీ కనిపించాడు. 6 ఆ తరవాత ఆయన ఐదు వందల కంటే ఎక్కువగా ఉన్న ప్రభువు సంఘంలో సమావేశమై ఉన్న సోదరీ సోదరులకు కనిపించాడు. వాళ్ళలో కొంతమంది చనిపోయినా చాలామంది ఇప్పటికీ జీవించే ఉన్నారు. మీరు వాళ్ళను అడిగి దాని గురించి తెలుసుకోవచ్చు. 7 తరవాత ఆయన యాకోబుకు కనిపించాడు. ఇంకోసారి అపోస్తలులందరికీ కనిపించాడు. 8 ఇతర అపోస్తులలతో సమానుణ్ణి కాకపోయినా చివరికి నాకు కూడా కనిపించాడు. 9 నేను అపోస్తలులందరిలో చాలా అల్పుడిని. క్రీస్తు సంఘాన్ని ఘోరంగా హింసించాను. అపోస్తలుడుగా ఉండడానికి నేను తగను. 10 అయితే దేవుడు నా విషయంలో అమితమైన దయ చూపించాడు. ఇప్పుడు నేను అపోస్తలుడిని. ఆయన నాద్వారా ఎన్నో మంచి పనులు జరిగించాడు. నిజంగా అందరు అపోస్తలులకంటే నేను ఎంతో కష్టపడి పని చేశాను. అయితే ఇప్పటికీ నాకై నేను చేసింది ఏమీ లేదు. దేవుడే నాకు బలం ఇచ్చి ఆ పనులు జరిగించాడు. 11 కాబట్టి నేనుగానీ ఇతర అపోస్తలులు గానీ, ఎవరైనా సరే క్రీస్తు సువార్తను ప్రకటించాం. మీరు మమ్మల్ని నమ్మారు.
12 అయితే ఇప్పుడు మీలో కొంతమంది చనిపోయిన వాళ్ళు తిరిగి లేవరని చెప్తున్నారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. ఎందుకంటే క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడని మేము మీకు ప్రకటించాం. 13 చనిపోయిన వాళ్ళు ఎవరూ తిరిగి బతకరు అనుకుంటే అప్పుడు దేవుడు కూడా క్రీస్తుని లేపకుండానే ఉండేవాడు. 14 ఆయన క్రీస్తును మృతులలోనుండి లేపకపోతే మనం ప్రకటించేదానికి అర్థమే లేదు. అంతే కాదు, దేనికోసం క్రీస్తును నమ్ముతున్నామో ఆ విశ్వాసం వల్ల మీ జీవంలో గానీ మరణంలో గానీ మీకు ప్రయోజనం ఏమీ లేదు. 15 దానికి తోడు చనిపోయిన వాళ్ళు నిజంగా తిరిగి లేవకపోతే దేవుని గురించి ప్రజల దృష్టిలో మేము అబద్ధాలకోరులం అవుతాం. 16 మళ్ళీ చెప్తున్నాను, చనిపోయిన వాళ్ళెవ్వరూ తిరిగి లేవకపోతే దేవుడు క్రీస్తును కూడా లేపలేదు. 17 దేవుడు క్రీస్తును లేపకపోతే మీరు నమ్మేదంతా వ్యర్ధం. మీరు పాపం చేశారు కాబట్టి దేవుడు ఇప్పటికీ మిమ్మల్ని దోషులుగానే చూస్తున్నాడు. మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్న మాట. 18 అదే పరిస్థితి అయితే క్రీస్తులో విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్లకు కూడా తిరిగి లేస్తామనే ఆశ లేకుండానే చనిపోయారన్నమాట. వాళ్ళు కూడా నశించిపోయినట్టే. 19 ఈ జీవితంలో మాత్రమే క్రీస్తులో మన నిరీక్షణ ఉంటే మనం చనిపోయిన తరవాత ఇంకా ఆయన నుండి ఆశించేది ఇంకేమీ లేదన్నమాట. ఇంక మనం ఒక అబద్ధాన్ని నమ్మామని ప్రజలంతా మనపై జాలి పడడానికి మనం అర్హులం అన్నమాట. 20 నిజానికి, దేవుడు క్రీస్తును చనిపోయిన వాళ్ళలో నుండి లేపాడు. మరణం నుండి దేవుడు లేచిన వారందరిలో ఆయనే మొదటివాడు. 21 ఆదాము అనే ఒకే ఒక్క వ్యక్తి చేసిన పాపం వల్ల ఈ లోకంలో ఉన్న ప్రతివాడూ చనిపోతాడు. అయినప్పటికీ ఏసుక్రీస్తు అనే ఒకే ఒక వ్యక్తి చేసిన పని వల్ల చనిపోయిన వాళ్ళంతా తిరిగి బతుకుతారు. 22 అందువల్ల, అంటే ఆదాము చేసిన పాపం వల్ల అందరూ ఏవిధంగా చావుకు లోనయ్యారో అలాగే క్రీస్తు చేసిన పని వల్ల అందరూ తిరిగి జీవిస్తారు. 23 అయితే ఒక కచ్చితమైన క్రమంలో వాళ్ళు మరణం నుండి తిరిగి లేస్తారు. మొట్టమొదట క్రీస్తు మృతుల్లోనుండి తిరిగి లేస్తాడు. ఆ తరవాత ఆయన ఈ భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకీ చెందిన అందరూ మృతుల్లో నుండి తిరిగి లేచి క్రీస్తుతో పాటు కలుస్తారు. 24 క్రీస్తు ఈ లోకాన్ని తండ్రి దేవుని పాలనకు అప్పగించినప్పుడు ఈ లోకం అంతమై పోతుంది. ఈ లోకంలోని పరిపాలకుల హోదాలూ, సమస్తాన్నీ పాలించే అధికారాల్నీ, సింహాసనాలనూ, బలాన్నీ క్రీస్తు రద్దు చేసినప్పుడు ఈ భూమి అంతమై పోతుంది. 25 దేవుడు క్రీస్తు శత్రువు లందరినీ జయించి, ఇంక వాళ్ళకి అధికారం, బలం లేదని వాళ్ళని క్రీస్తు పాదాల దగ్గర పడేసేటంత వరకూ ఆయన పరిపాలించాలి. 26 దేవుడు నాశనం చేసే చిట్టచివరి శత్రువు మరణం. 27 లేఖనాలు చెప్పినట్టు, "సమస్తాన్నీ దేవుడు ఆయన పాదాల కింద ఉంచాడు." కానీ సమస్తం అనే మాటలో దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయన్నది స్పష్టం అవుతుంది. 28 దేవుడు సమస్త అధికారాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచిన తరవాత కుమారుడు కూడా తండ్రి దేవుడే అందరికీ అన్నిటిలో సర్వాధికారిగా ఉండడం కోసం తానే ఆయనకీ లోబడతాడు.
29 కొంతమంది చెప్పినట్టుగా మృతుల పునరుత్థానం లేకపోతే కొందరు చేస్తున్నట్టుగా చనిపోయిన వారికోసం బాప్తిసం పొందడంలో అర్థమే లేదు. దేవుడు చనిపోయిన వాళ్ళను తిరిగి లేపి తన వెంట తీసుకు రాకపోతే ఇక్కడ చనిపోయిన వాళ్ళ కోసం బాప్తిసం తీసుకోడానికి సరైన కారణమే లేదు. 30 మృతుల పునరుత్థానం లేకపోతే ఇప్పుడు మేం చేస్తున్నట్టుగా సువార్త ప్రకటించడం దిన దిన గండంగా మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇంకా బతకనక్కర లేదు. 31 నా సోదరీ సోదరులారా, మీ గురించి నేను గర్వపడు తున్నాను. మన ప్రభువైన ఏసుక్రీస్తు ముందు అతిశయించ గలిగే నా ఆస్తి మీరే. ఏ రొజుకారోజు నేను చనిపోయే ప్రమాదం లో ఉన్నాను. 32 దేవుడు చనిపోయిన వాళ్ళను తిరిగి బతికించక పోతే ఎఫెసులో ఆ క్రూర మృగాలతో నేను పోరాడింది అంతా గాలికి ప్రయాస పడినట్టు అన్నమాట. "ఈ రోజే తిని తాగుదాము రండి, ఎందుకంటే రేపు మనం చనిపోతాం అని కవులు రాసింది ఈ విషయంలో నిజమే కావచ్చు. 33 మోసపోకండి. "అప్పుడు మీకున్న చెడ్డ స్నేహితులు మంచి దారిలోకి రావడానికి ఏమాత్రం లెక్క చేయరు." 34 కాబట్టి తెలివిగా ఉండండి. మంచి ప్రవర్తన కలిగి జీవించండి. పాపంలో జీవించకండి. మీలో కొంతమందికి దేవుడంటే ఎవరో కూడా తెలియనే తెలీదు. మీకు సిగ్గు రావాలని ఎలా చెబుతున్నాను.
35 "చనిపోయిన వాళ్ళు ఎలా లేస్తారు? వాళ్లకి ఎలాంటి శరీరం ఉంటుంది?" అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు. 36 మీకసలు ఏమీ తెలీదు! భూమిలో మీరు నాటిన ఏ విత్తనమైనా సరే, చనిపోతేనే గాని మొలకెత్తదనే వాస్తవం గురించి మీరు ఆలోచించడం లేదు. 37 ఒక రైతు నాటింది అది పెరిగి బయటికి వచ్చిందీ ఒకేలా కనిపించదు. అది వట్టి విత్తనం మాత్రమే. తరవాత అది పూర్తి భిన్నంగా మారిపోతుంది. 38 దేవుడు దానికి ఆయన ఎంచుకున్న తన ఇష్టమైన ఒక కొత్త రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనం భూమిలో నాటినప్పుడు వాటికి ఆయన వేరు వేరు శరీరాలను ఇస్తాడు. 39 అయితే భూమి మీద ఉన్న అన్ని జీవులూ ఒకేలా ఉండవు. వాటిలో మనుషులు, రకరకాల జంతువులు, పక్షులు, చేపలు ఉంటాయి. వాటన్నిటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. 40 పరలోకంలో కూడా రకరకాల వస్తువులు ఉంటాయి. ఆకాశంలో ఉన్నవాటికీ, భూమి మీద ఉన్నవాటికీ, వాటి స్వభావంలో హస్తిమశకాంతరం ఉంది. 41 అక్కడ ప్రకాశించే సూర్యుడికి ఒక స్వభావం, మృదువుగా ఉన్న చంద్రుడికి ఇంకొ స్వభావం ఉంటుంది. నక్షత్రాలకు కూడా వేరు స్వభావం ఉంటుంది. అయితే నక్షత్రాలలో కూడా ఒకదానికీ మరొక దానికీ వేరు వేరు స్వభావం ఉంటుంది.
42 అదే విధంగా మనుషులు మరణం నుండి తరిగి లేచినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఏదైతే భూమి లోపలి వెళ్లిందో అది చనిపోయింది. అయితే ఏదైతే మళ్ళీ తిరిగి జీవించిందో అది ఇంకా ఎప్పటికీ మరణించదు. 43 అది భూమిలోకి వెళ్ళినప్పుడు మట్టిలో ఉంటుంది. కానీ దేవుడు దానిని తిరిగి లేపినప్పుడు అది మహిమతో, బలంతో పెరుగుతుంది. 44 భూమిలోకి వెళ్ళేది భూమికి సంబంధించింది, మృతుల్లో నుండి తిరిగి లేచేది దేవుని శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ భూమికి సంబంధించినవీ ఉన్నాయి, దేవుని శక్తి కలిగి నిత్యం నిలిచిపోయేవీ ఉన్నాయి.
45 కాబట్టి, "మొదటి మనిషైన ఆదాము జీవించే ప్రాణి అయ్యి తన పిల్లలకూ వారసులకూ జీవితాన్ని ఇచ్చాడు” అని లేఖనాలు చెప్తున్నాయి. అయితే రెండవ ఆదాము క్రీస్తు తన ప్రజలకు దేవుని శక్తినీ, నిత్యమైన జీవితాన్నీ ఇచ్చాడు. 46 భూమికి సంబంధించింది ఏదో అది మొదట వచ్చింది. అది ప్రకృతి సంబంధమైంది. దేవుడికి సంబంధించింది ఏదో తరవాత వచ్చింది. అది ఆత్మ సంబంధమైంది. 47 మొదటి మానవుడు ఆదాము ఈ భూమికి చెందినవాడు. అతడు మట్టినుండి తయారయ్యాడు. అయితే రెండవ మానవుడు క్రీస్తు పరలోకానికి చెందినవాడు. 48 మట్టి నుండి తయారైన వాళ్ళంతా మట్టినుండి తయారైన ఆదాము లాంటి వాళ్ళే. పరలోకానికి చెందిన వాళ్ళంతా పరలోకం నుండి వచ్చిన క్రీస్తు లాంటి వాళ్ళే. 49 దేవుడు మట్టినుండి మనల్ని మనిషిగా తయారు చేసినట్టు గానే పరలోకం నుండి వచ్చిన మనిషిగా కూడా ఆయన మనల్ని తయారు చేస్తాడు.
50 సోదరీ సోదరులారా, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఒకానొక రోజు చనిపోయే వాళ్ళు తమను పరిపాలించే దేవుడు వాళ్ళ కిస్తానని వాగ్దానం చేసిన వాటిని పొందలేరు. నశించిపోయేవి నశించని వాటిగా మారలేవు. 51 చూడండి, దేవుడు మనకి తెలీకుండా, రహస్యంగా దాచి ఉంచిన విషయాలను మీకు చెప్తాను, విశ్వాసులందరూ చనిపోరు కానీ దేవుడే మనందరినీ మారుస్తాడు. 52 ఆయన ఒక్క క్షణంలో ఒకడు తన కనురెప్పలు వేసినంత వేగంగా దేవుని దూతలు ఆఖరి బూర ఊదగానే ఆయన మనల్ని మార్చేస్తాడు. వారు ఆ బూర ఊదుతారు. అప్పుడు దేవుడు చనిపోయిన వాళ్ళను మళ్ళీ ఇంకెన్నడూ చనిపోని విధంగా వారిని తిరిగి లేపుతాడు. 53 ఈ శరీరాలు చనిపోతాయి. అయితే దేవుడు మళ్ళీ ఇంకెప్పుడూ చనిపోకుండా ఉండేలాగా ఆయన చేస్తాడు. వాళ్ళు మళ్ళీ ఇంకెన్నడూ చనిపోరు. ఈ శరీరాలు ఇప్పుడు నాశనం అయిపోయినా సరే, దేవుడు వాళ్ళను నూతనంగా మళ్ళీ మరణం లేని శరీరంగా చేస్తాడు. 54 ఇది జరిగినప్పుడు ఈ లేఖనాలు నెరవేరతాయి.
"దేవుడు మరణాన్ని సమూల నాశనం చేశాడు."
55 "మరణం ఇంకెప్పుడూ గెలవదు!
మరణ వేదన తొలగించి వేశాడు."
56 మనం చనిపోయేటప్పుడు ఈ పాపమే మనకెంతో బాధ కలిగించింది. ధర్మశాస్త్రం వల్లే పాపం మన జీవితాల్లో ప్రవేశించింది. 57 అయితే ఇప్పుడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరణం మీద మనకు విజయం కలిగించాడు. అందుకే ఇప్పుడు ఆయనకీ స్తుతి.
58 కాబట్టి ప్రియమైన సోదరీ సోదరుల్లారా, విశ్వాసంలో స్థిరంగా, నిలకడగా మీ జీవితంలో మిమ్మల్ని ఎవరూ కదిలించ లేనివాళ్ళుగా ఉండి అంతకంతకు ప్రభువు పనిలో ముందుకు సాగండి. ఆయన కోసం మీరు చేసేది ఏదైనా సరే, ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
Chapter 16
1 యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కోసం పోగుచేస్తున్న డబ్బు విషయంలో మీ ప్రశ్నలకు ఇప్పుడు జవాబు చెప్పాలనుకుంటున్నాను. గలతీ సంఘాల విశ్వాసులకు నేనేం చేయాలని చెప్పానో కచ్చితంగా మీరు కూడా అదే చేయండి. 2 ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కరు మీకు వీలైనంత మట్టుకు కొంత డబ్బును పక్కన పెట్టండి. అలా చేస్తే నేను వచ్చినప్పుడు ఇంకెలాంటి వసూళ్ళూ చేయాల్సిన అవసరం ఉండదు. 3 యెరూషలేముకు మీ కానుకలు తీసుకెళ్ళడం కోసం మీరెవరిని పంపాలనుకుంటే వాళ్ళను మీరే ఎంపిక చేసుకోవాలి. నేను అక్కడికి చేరుకున్నప్పుడు మీ కానుకల గురించిన ఉత్తరాలను వారితోపాటు పంపుతాను. 4 ఒకవేళ వాళ్ళు నాతోపాటు కలిసి యెరూషలేముకు రావడం మంచిదైతే అలా చేయవచ్చు.
5 మాసిదోనియా ప్రాంతం గుండా ప్రయాణం చేసేటప్పుడు మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను. 6 అప్పుడు ఒకవేళ మీ దగ్గర కొంత కాలం ఆగితే ఆగవచ్చు. ఒకవేళ శీతాకాలం అంతా కూడా గడుపుతానేమో మరి. అప్పుడు నేను వెళ్లబోయే ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళడానికి మీరు సహాయపడవచ్చు. 7 కొన్ని రోజులు మాత్రమే మీ దగ్గర ఉండటం నాకిష్టం లేదు. మీతో సరిపడినంత సమయం గడపడానికీ, ఒకరి విషయంలో ఒకరు సహాయపడ గలిగేలా ప్రభువు నాకు అనుమతిస్తాడని ఎదురు చూస్తున్నాను. 8 పెంతెకోస్తు పండుగ వరకు నేను ఎఫెసులో గడపాలని అనుకుంటున్నాను. 9 ఎందుకంటే అక్కడ ఎంతో మంది ఇప్పటికీ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నా సరే, ప్రభువు నాకు అక్కడ ఒక ద్వారం తెరిచాడు.
10 ఇప్పుడు తిమోతి మీ దగ్గరకు వచ్చినప్పుడు అతడు దేనికీ మొహమాట పడకుండా ఉండేలా దయచేసి అతన్ని ప్రేమగా చూడండి. ఎందుకంటే అతడూ నాలాగే ప్రభువు పని చేస్తున్నాడు. 11 ఎవ్వరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. అతడికి మీరెంత సహాయం చేయ గలిగితే అంత సహాయం చేయండి. శాంతితో నా దగ్గరకు చేరుకొనేలా అతన్ని శాంతితో సాగనంపండి. అతడితో బాటు ఇంకా ఇతర సోదరులు కూడా వస్తారని ఎదురు చూస్తున్నాను.
12 మన సోదరుడు అపోలో గురించి మీరు అడిగారు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న సోదరులతో కలిసి వెళ్ళమని అతన్ని చాలా బతిమిలాడాను గానీ ఇప్పుడు రావడం అతనికి ఇష్టం లేదు. అయితే అతనికి అవకాశం దొరికినప్పుడు ఇంకోసారి వస్తాడు.
13 జాగ్రత్తగా ఉండండి. మీ విశ్వాసం నుండి తొలగిపోవద్దు. పరిపక్వత చెందిన వ్యక్తుల్లాగా ప్రభువు కోసం పని చేయండి. బలవంతులుగా ఉండండి. 14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
15 స్తెఫను ఇంటిలో ఉన్నవాళ్ళు మీకు తెలుసు కదా! అకయ ప్రాంతంలో మొట్ట మొదటిగా ప్రభువును విశ్వసించిన వాళ్ళు వీళ్ళే. ప్రభువుకు చెందిన వారందరికీ సహాయం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. 16 కాబట్టి సోదరీ సోదరులారా, అలాంటి వారికీ ప్రభువు పనిలో మాతో కలిసి కష్టపడి పని చేసే వాళ్ళందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. 17 స్తెఫను, ఫోర్మునాతు, అకాయికు అనే వాళ్ళు కొరింతు నుండి రావడం సంతోషంగా ఉంది. వాళ్ళు రావడం వల్ల మీరు నాతో లేరనే కొరత తీరింది. 18 వాళ్ళు నన్ను ప్రోత్సహించి నా ఆత్మకు ఎంతో సహాయకరంగా ఉన్నారు. వాళ్ళు మీకు కూడా సహాయ కరంగా ఉన్నారు. వాళ్ళు మీకు ఎంత సహాయం చేశారో మిగతావాళ్లకు కూడా చెప్పండి.
19 ఆసియా సంఘాల వాళ్ళు మీకు వందనాలు చెప్తున్నారు. అకుల, ప్రిస్కిల్ల వాళ్ళింట్లో కూడుకుంటున్న సంఘం వాళ్ళు కూడా మీరు ప్రభువు పని చేస్తున్నారని మీకెన్నో వందనాలు చెప్తున్నారు. 20 మిగిలిన సోదరీ సోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకళ్ళ నొకళ్ళు వందనాలు చెప్పుకోండి.
21 పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ వాక్యాన్ని రాస్తున్నాను. 22 ఇంకా ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వాళ్ళ మీదే ఆ శాపం ఉంటుంది. ఓ ప్రభువా, రండి! 23 మనకు అర్హత లేని యేసు ప్రభువు కృప మీకు తోడుగా ఉంటుంది గాక. 24 నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, క్రీస్తు యేసులో ఉన్న మిమ్మల్నందరినీ నేను ప్రేమిస్తున్నాను.