తెలుగు (Telugu): Indian Easy Version (IEV) Telugu

Updated ? hours ago # views See on DCS

ఫిలిప్పీయులకు రాసిన పత్రిక

Chapter 1

1 ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న ప్రియమైన నా తోటి విశ్వాసులకు పౌలు అనే నేను రాస్తున్నాను. క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి అనే మేము ఫిలిప్పీలో దేవుని కోసం ప్రత్యేకంగా ఉండి క్రీస్తు యేసుతో కలిసి ఉన్న మీకందరికీ ఈ ఉత్తరం పంపుతున్నాము. ఇంకా అక్కడ పని చేస్తున్న సంఘ నాయకులకూ పరిచారకులకూ కూడా ఈ ఉత్తరం పంపుతున్నాము. 2 మన తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువు యేసుక్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలగాలనీ ప్రార్థిస్తున్నాం.

3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా నా ప్రార్థనల్లో నా దేవునికి వందనాలు చెబుతాను. 4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ చాలా సంతోష పడతాను. 5 సువార్త ప్రకటించే విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీరు నాతోనూ, తిమోతితోనూ కలిసి పని చేసినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను. 6 దేవుడు మీ మధ్యలో చాలా మంచి పనులు చేస్తున్నాడని నాకు తెలుసు. యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పనులను ఆయన కొనసాగించి పూర్తి చేస్తాడని నా గట్టి నమ్మకం.

7 మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నేను ఖైదులో ఉన్నప్పుడూ, సువార్త పక్షంగా బహిరంగంగా వాదిస్తూ అది సత్యమని నిరూపిస్తున్నపుడూ మీరంతా దేవుడు నాకు దయతో అనుగ్రహించిన ఈ పని చేయటానికి నాతో భాగస్వాములుగా ఉన్నారు. 8 మీతో కలిసి ఉండాలని నేను ఎంతగా కోరుకుంటున్నానో దేవుడికే తెలుసు. క్రీస్తు యేసు మనల్నందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాను.

9 మీరు ఒకరినొకరు ఇంకా ఎక్కువగా ప్రేమించుకోవాలి. దేవుడు ఎందుకు అలా కోరుకుంటున్నాడో అది మీరు తెలుసుకుని అర్థం చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. 10 ఇంకా, మీరు దేన్ని విశ్వసించాలో శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి ఎలా తెలుసుకోవాలో దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలని కూడా నేను ప్రార్ధిస్తున్నాను. క్రీస్తు తిరిగి వచ్చే రోజున మీరు యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన. 11 యేసు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని మంచివారిగా ప్రకటించినందున మీరు చేయగలిగే పనులను ఎప్పుడూ చేస్తారని కూడా నేను ప్రార్ధిస్తున్నాను. మీరు దేవుణ్ణి ఎలా గౌరవిస్తున్నారో అందరూ చూస్తారు.

12 నా తోటి విశ్వాసులారా, నేను అనుభవించిన కష్టాలు మనుష్యులకు శుభవార్తను ప్రకటించకుండా నన్ను ఆపలేదని మీరు తెలుసుకోవాలని నా అభిలాష. అంతేకాకుండా నా కష్టాల వల్లే ఇంకా ఎక్కువమంది క్రీస్తును గురించిన శుభవార్తను వినగలిగారు. 13 ముఖ్యంగా నేను క్రీస్తును గురించిన శుభవార్తను ప్రకటించడం వల్లే నేను ఇలా ఖైదీగా అయ్యానని ఇక్కడున్న కావలి సైనికులకూ మిగిలిన వారికీ తెలిసిపోయింది. 14 ఇంకా ఇక్కడి విశ్వాసులలో చాలామంది యేసు గురించిన శుభవార్తను మరింత ధైర్యంగా, నిర్భయంగా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే వారు తమకు సహాయం చేసే ప్రభువును ఇంకా గట్టిగా నమ్మారు. వారు యేసు గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడతారు, ఎందుకంటే నేను సువార్త చెపుతూ జైలులో ఉండగా ప్రభువు నాకు సహాయం చేయడం వారు చూసారు.

15 కొంతమంది మనుషులు అసూయతో శుభవార్త ప్రకటిస్తున్నారు. విశ్వాసులందరూ నన్ను గౌరవించడం కన్నా వారినే ఎక్కువగా గౌరవించాలని వారి కోరిక. మరికొందరు కూడా శుభవార్త ప్రకటిస్తున్నారు. అయితే వారు క్రీస్తును ప్రేమించేవారు, ఇంకా శుభవార్త వినని మనుషులు వినాలని వారు కోరుకుంటున్నారు. 16 దేవుడు నన్ను శుభవార్త వివరించడానికీ ఆయన గురించి బహిరంగంగా మాట్లాడడానికీ నియమించాడని క్రీస్తును తమ ప్రేమ మూలంగా ప్రకటించే వారికి తెలుసు. 17 కాని, స్వార్ధపూరిత కారణాల వల్ల క్రీస్తు గురించిన శుభవార్త ప్రకటిస్తున్నవారు మంచి ఉద్దేశంతో ప్రకటించడం లేదు. నేను ఇక్కడ జైలులో ఉన్నప్పుడు ఇలా చెయ్యడం వల్ల నన్ను చాలా బాధ పెడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు.

18 అయితేనేం? మంచి కారణాలవల్ల గానీ చెడ్డ కారణాలవల్ల గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. మనుషులు క్రీస్తు గురించిన సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా నేను దానిలో ఆనందిస్తూనే ఉంటాను. 19 దేవుడు నన్ను జైలు నుండి విడిపిస్తాడు అని నాకు తెలుసు. అందుకే నేను సంతోషిస్తాను. మీరు నా కోసం ప్రార్ధించడం వలన, యేసు క్రీస్తు ఆత్మ సాయం వలన, దేవుడు ఇదంతా చేసాడు.

20 నేను క్రీస్తుని విశ్వాసంతో గౌరవిస్తానని చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నందువల్ల ఇది జరుగుతుందని నాకు తెలుసు. అయితే, ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా నా చావు వలన గానీ బ్రతుకు వల్ల గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం నాకు ఉంది.

21 నావరకైతే నేను క్రీస్తుని గౌరవించటానికే జీవిస్తున్నాను. కానీ నేను చనిపోతే అది నాకు ఇంకా మంచిది. 22 అయినా ఈ లోకంలో నేను నా శరీరంతో నివసిస్తూ ఉంటేనే నేను ఇక్కడ క్రీస్తుకు సేవ చేయగలుగుతాను. అందువల్ల, నేను జీవించటానికి ఇష్టపడుతున్నానా లేదా చనిపోవాలనుకుంటున్నానా అనేది నాకు తోచడం లేదు. 23 జీవించడమా, చావడమా ఏది ముఖ్యమో నేను తేల్చుకోలేక పోతున్నాను. నేను చనిపోయి ఈ లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. ఎందుకంటే ఎవరికైనా క్రీస్తుతో ఉండడం అనేదే అన్నిటికంటే ఉత్తమం. 24 అయినా నేను భూమి మీద బ్రతికి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే నేను మీకు సాయం చేయటం మీకు ఎంతో అవసరం. 25 ఈ విషయంలో నాకు నమ్మకం ఉన్నందున క్రీస్తులో మీరు మరింతగా సంతోషించడంలో విశ్వసించడంలో మీకు సహాయపడటానికి నేను మీ అందరితో బ్రతికి ఉంటానని నాకు తెలుసు.

26 నేను మళ్ళీ మీతో కలిసి ఉండటానికి క్రీస్తు యేసు నన్ను తీసుకు వచ్చినందుకు మీకు చాలా సంతోషం కలిగి ఉండొచ్చు. 27 మరీ ముఖ్యంగా క్రీస్తు గురించిన శుభవార్తను మీరు గౌరవిస్తూ మీ చుట్టూ నివసిస్తున్న మనుష్యుల ముందు చక్కగా ప్రవర్తించండి. నేను వచ్చినా రాకపోయినా మీరు ఇలా జీవిస్తున్నారని తెలుసుకుని నేను సంతోషించేలా మీరు ఇది చెయ్యండి. శుభవార్త మనకు బోధించినట్టు మీరు అందరూ నమ్మి అలాగే జీవించటానికి మీరు ఎంతో కృషి చేస్తున్నట్టు ఆ మనుషులు నాకు చెప్పాలి.

28 మీకు వ్యతిరేకంగా ఉన్న మనుషులు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. మీరు ధైర్యంగా ఉండి వారిని ఎదిరించినప్పుడు దీని వల్ల దేవుడు మిమ్మల్ని రక్షించి, వారిని నాశనం చేస్తాడని తెలుస్తుంది. 29 దేవుడు మీ పట్ల ఎంతో దయ కలిగి ఉన్నాడు. మీరు క్రీస్తు కోసం బాధలు పడటానికీ ఆయనపై నమ్మకం ఉంచటానికీ ఆయన మీకు అవకాశం కలిగిస్తున్నాడు. 30 నేను ఫిలిప్పీలో సువార్తను వ్యతిరేకించే వారిని ఎలా ఎదిరించాల్సి వచ్చిందో మీరు చూసినట్టే ఇంకా అలాంటి మనుష్యులను ఇక్కడ కూడా ఎదిరించినట్టు మీరు విన్నట్టే మీరు అదే విధంగా ఎదిరించాల్సి ఉంది.

Chapter 2

1 క్రీస్తు మనలను ప్రోత్సహిస్తున్నందువల్లా మనలను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ, దేవుని ఆత్మ మనతో సహవాసం చేస్తున్నందువల్లా క్రీస్తు మన పట్ల దయ కలిగి ఉండడం వల్లా, 2 నేను పూర్ణ సంతోషంతో ఈ పనులన్నింటినీ చేయగలుగుతున్నాను. మీరు ఒకరితో ఒకరు సమ్మతిస్తూ, ప్రేమ కలిగి ఏకగ్రీవంగా పని చేస్తూ, ఒకే ప్రయోజనం కోసం పాటుబడుతూ ఉండండి. 3 ఇతరుల కన్నా మీకు మీరే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన వారుగా ఎంచుకోవటానికి ప్రయత్నించవద్దు. ఇంకా మీరు చేస్తున్న దాని గురించి గొప్పలు చెప్పుకోవద్దు. దానికి బదులుగా వినయంగా ఉండండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం కంటే ఇతరులను ఎక్కువగా గౌరవించండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకుని వారికి సహాయం చేస్తుండాలి.

5 క్రీస్తు యేసు ఎలా ఆలోచించాడో మీరూ అలానే ఆలోచించండి.

     6 ఆయన దేవుని స్వభావం కలిగినవాడైనప్పటికీ

     దేవునితో సమానంగా ఉండే అన్ని ప్రాధాన్యతలను ఉంచుకోవాలని పట్టుబట్ట లేదు.

     7 అందుకు బదులుగా అన్నింటిని వదిలేసాడు.

     సేవకుడి లక్షణాలు తీసుకున్నాడు.

     ఆయన మనిషిగా అయ్యాడు. మనిషిగా అయినప్పుడు

     8 తనను తాను తగ్గించుకుని, చనిపోవటానికి సిద్ధమయ్యేటంతగా లోబడ్డాడు. ఒక నేరస్తుడిలా చనిపోవడానికి అంటే సిలువకు వ్రేలాడటానికి కూడా సిద్ధపడ్డాడు.

     9 దేవుడి పట్ల క్రీస్తు చూపిన విధేయత వల్లే దేవుడు ఆయన్ని అత్యున్నతంగా హెచ్చించాడు.

     ప్రాణం ఉన్న వారందరి కంటే ఎక్కువగా ఆయనను గౌరవించాడు.

     10 అందుచేత ఎవరైనా "యేసు" అనే పేరు విన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనను గౌరవిస్తూ మోకరించాలి.

     11 ప్రతి ఒక్కరూ ప్రతి చోటా ఆయనను కీర్తిస్తూ,

     యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించాలి. వారందరూ ఆయన గురించే తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరుస్తారు.

12 నా ప్రియ స్నేహితులారా, నేను మీ దగ్గర ఉన్నప్పుడు దేవునికి లోబడుతున్నట్టుగానే, మీతో లేనప్పుడు కూడా మరి ఎక్కువగా ఆయనకు లోబడి ఉండండి. విధేయత కలిగి ఉండండి. దేవుడు రక్షించిన వారిలాగా జీవించటానికి మీ వంతు కృషి చేయండి. 13 దేవుడు మీ హృదయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన సంతోషపడేలా మీరు చేయాలనుకుంటున్న మంచి పనులన్నీ చేయండి.

14 మీరు చేసేవన్నీసణుగుడు లేకుండా వాదించకుండా చేయండి. 15 మీరు దేవుని పిల్లలుగా అవిశ్వాసుల మధ్య జీవిస్తున్నారు కాబట్టి మీరు తప్పు చేయకూడదు, దాన్ని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఈ మనుష్యులంతా మేక తోలు కప్పుకున్న తోడేలువంటి వారు. ఈలాంటి వక్రజనం మధ్య మీరు చీకటిలో ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి. 16 మిమ్మల్ని శాశ్వతంగా జీవింపచేసే సందేశంఫై నమ్మకం ఉంచండి. మీరు అలా చేస్తే క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే దీన్ని బట్టి నేను మీ మధ్య చేసిన పని వ్యర్ధం కాలేదని నాకు తెలుస్తుంది.

17 వారు నన్ను చంపినా నా రక్తాన్ని దేవునికి పానార్పణం చేసినట్టుగా అనుకుని నేను మీ అందరితో కలిసి ఆనందిస్తాను. మీరు దేవునిపై నమ్మకం ఉంచి ఆయన చేసిన త్యాగానికి నేను చేసింది అదనంగా కలుస్తుంది. 18 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.

19 యేసు ప్రభువు చిత్తమైతే త్వరలో తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను. అతడు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఏమి చేస్తున్నాడో చెబితే విని ప్రోత్సాహం పొందాలని ఆశిస్తున్నాను. 20 మీ గురించి తిమోతి పట్టించుకున్నంతగా పట్టించుకొనే వాడు నా దగ్గర ఎవరూ లేరు. 21 నేను పంపిన మిగతా వారంతా తమ సొంత పనులే చూసుకుంటున్నారు. యేసు క్రీస్తు ముఖ్యమైనదిగా భావించే దాని గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. 22 తిమోతి తనను తాను రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే, తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో సువార్త ప్రచారంలో సేవ చేశాడని మీకు తెలుసు. 23 అందుచేత నాకు ఏం జరగబోతున్నదో తెలిసిన వెంటనే అతన్ని తప్పక మీ దగ్గరకు పంపాలనుకుంటున్నాను. 24 ఇలా జరగాలని ప్రభువు కోరుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారు త్వరలో నన్ను విడుదల చేస్తారనీ నేను మీ దగ్గరకు వస్తాననీ నాకు ఇంకా నమ్మకం ఉంది.

25 నా తోటి విశ్వాసి, జత పనివాడు, క్రీస్తు యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవ చేసేవాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపడం అవసరమనుకున్నాను. 26 అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో కలిసి ఫిలిప్పీలో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు. 27 నిజానికి అతడు చాలా జబ్బుపడి చావుకు దగ్గరగా వెళ్ళాడు కాని చనిపోలేదు. దేవుడు అతని మీద జాలి పడ్డాడు. అతని మీదే కాదు, గోరు చుట్టుపై రోకటిపోటు పడకుండా నా మీద కూడా జాలి చూపాడు. 28 కాబట్టి మీరు అతన్ని మళ్ళీ చూసి సంతోషించేలా, నా విచారం తగ్గేలా అతన్ని త్వరపెట్టి పంపుతున్నాను. 29 ప్రభువైన యేసు మనలను ప్రేమిస్తున్నాడు గనక ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అతనినీ మిగిలిన విశ్వాసులనూ గౌరవించండి. 30 ఎందుకంటే అతడు క్రీస్తు పనిలో దాదాపుగా ప్రాణాలు పోయినంత పని అయింది. నాకు సేవ చేయడానికీ మీరు తీర్చలేకపోయిన నా అవసరాలను మీ బదులు తీర్చడానికి, అతడు తన ప్రాణం సైతం లెక్కచేయలేదు.

Chapter 3

1 చివరిగా, నా తోటి విశ్వాసులారా, మీరు ప్రభువుకు చెందినవారు కాబట్టి సంతోషంలో కొనసాగండి. ఈ విషయాలనే మీకు మళ్ళీ రాయడంవల్ల నేనేమీ అలసిపోను. ఇది మీకు హాని చేయాలనుకునే వారి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

2 ప్రమాదకరమైన అడవి కుక్కల్లాంటి మనుష్యుల గురించి జాగ్రత్తగా ఉండండి. యూదులు మనుష్యులను హింసించినట్లే అవి కూడా వారి శరీరాలను ముక్కలుగా చేస్తాయి. 3 కాని మనకు దేవుని ఆత్మ నిజంగా ఆయనను ఆరాధించడానికి అవకాశం కల్పిస్తుంది. యేసుక్రీస్తుని మనం నమ్ముతాము కాబట్టి మనం సంతోషంగా ఉంటాం. మనుషులు పాటించే ఆచారాలు లేక వేడుకలు అర్థం లేనివి కాబట్టి మనకు వాటిపై నమ్మకం లేదు. 4 మేము దేవునికి అంగీకారంగా ఉండాలని ఈ ఆచారాలు పాటించడం లేదు. అయినప్పటికీ అది నాకు ఉపయోగకరంగా ఉంటే నేను ఇంకా బాగా చేయగలను.

5 నేను పుట్టిన ఏడు రోజులకు నాకు సున్నతి చేసారు. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. మీరు నన్ను మించిన హీబ్రూ జాతి వాణ్ణి కనుగొనలేరు. నా పితరులంతా హెబ్రీయులే. ఇంకా ఒక పరిసయ్యుడిగా మా పూర్వికులు బోధించిన మోషే ధర్మశాస్త్ర చట్టాలకు నేను లోబడ్డాను. 6 క్రీస్తు విశ్వాసులు ఈ చట్టానికి లోబడేలా చేసి వారిని బాధించడం చాలా ఇష్టంగా ఉండేది. నేను చట్టానికి అవిధేయుడనని నా గురించి ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేరు.

7 క్రీస్తు నన్ను మార్చినందువల్ల ఏవైతే నాకు లాభంగా ఉండేవో వాటన్నిటినీ క్రీస్తు కోసం పనికి రానివిగా ఎంచాను. 8 వాస్తవంగా ఇప్పుడు మిగతా వాటన్నిటినీ నష్టంగా పనికి రానివిగా ఎంచుతున్నాను ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. క్రీస్తును సంపాదించడానికి మిగిలిన వాటన్నింటినీ నా జీవితంలో నుండి తీసివేసి వాటిని చెత్తతో సమానంగా ఎంచుకున్నాను. 9 ఇప్పుడు నేను పూర్తిగా క్రీస్తుకి చెందినవాణ్ణి. ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల దేవుని దృష్టిలో నేను మంచివాడిగా ఉండలేనని నాకు తెలుసు. క్రీస్తుపై పూర్తి నమ్మిక ఉంచాను కాబట్టి దేవుడే నన్ను ఆయన దృష్టిలో మంచివాడిగా ప్రకటించాడు. 10 నేను క్రీస్తును ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా, క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికినప్పుడు దేవుడు ఎలా శక్తివంతంగా పనిచేసాడో, నేను నా జీవితంలో ఆయన పనిని అలా శక్తివంతంగా నిరంతరం చేయాలనుకుంటున్నాను. దేవునికి విధేయత చూపించి క్రీస్తు ఎలా బాధలు పొందాడో అలాగే నేను కూడా దేవునికి విధేయత చూపించటానికి నిరంతరం బాధలు పొందటానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తు నా కోసం చనిపోయినప్పటికీ ఆయన కోసం చనిపోవడానికి నేను కూడా పూర్తిగా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. 11 ఇవన్నీ ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినట్టు ఆయన నన్ను మళ్ళీ బ్రతికించాలని నేను పూర్తిగా ఆశిస్తున్నాను.

12 ఈ విషయాలన్నీ నాకు ఇంకా పూర్తిగా జరిగాయని నేను చెప్పుకోవటం లేదు. కాని నేను వీటన్నింటినీ స్వీకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ విషయాల వల్లే యేసుక్రీస్తు నన్ను తన వాడిగా చేసుకున్నాడు. 13 నా తోటి విశ్వాసులారా, ఈ విషయాలన్నీ నాకు ఇంకా పూర్తిగా జరిగాయని నేను అనుకోవటం లేదు. నేను పరిగెత్తేవాడిలాగా ఉన్నాను. నేను వెనక్కి తిరిగి చూడలేను ఎందుకంటే నేను ముగింపు గీత వైపుకే పరిగెత్తుతున్నాను. 14 దేవునితో చిరకాలం జీవించి ఉండొచ్చు అనే బహుమానం కోసం నేను అలా పరిగెత్తుతున్నాను. దీని కోసమే దేవుడు నన్ను పిలిచాడు. దానిని యేసుక్రీస్తు సాధ్యపరిచాడు. 15 కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న మనం అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మీలో ఎవరైనా వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. 16 మన గురించి ఇప్పుడు ఏది నిజమైనా మనం ఎంత దూరం వచ్చినా ఇప్పటిదాకా మనం చేసినట్టుగానే క్రీస్తుపై ఇంకా ఎక్కువ నమ్మకం కలిగి ఉందాం.

17 నా తోటి విశ్వాసులారా, నాతో కలిసి ఉండండి, నాలాగా నడచుకోండి. నన్ను ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి. 18 చాలామంది క్రీస్తులో విశ్వాసం ఉందని చెబుతున్నా వారు నిజంగా ఆయన సిలువలో మన కోసం చేసిన దానిని వ్యతిరేకిస్తున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా విచారంతో దుఃఖంతో మళ్ళీ చెబుతున్నాను. 19 దేవుడు వారిని చివర్లో నాశనం చేస్తాడు. ఎందుకంటే తినాలనే ఆశే వారి దేవుడు. వారు సిగ్గుతో జీవిస్తారు, లోక విషయాల గురించే ఆలోచిస్తారు. 20 మనమైతే పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. 21 ఆయన మన బలహీనమైన దేహాలను తన మహిమ గల దేహాలుగా మార్చివేస్తాడు. సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో ఇదంతా చేస్తాడు.

Chapter 4

1 నా ప్రియ సోదరులారా మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. మీరు నాకు సంతోషం కలిగించారు. దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తే దాని కారణం మీరే. నా ప్రియ మిత్రులారా, ఈ ఉత్తరంలో నేను మీకు వివరించినట్టు ప్రభువులో స్థిరంగా ఉండండి.

2 ప్రభువులో చేరి ఉన్నారు కాబట్టి యువొదియా, సుంటుకే, ఒకరికొకరు మనసు కలిసి ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎందుకంటే మీరిద్దరూ ప్రభువులో చేరి ఉన్నారు. 3 నా నమ్మకమైన సహకారీ, ఈ స్త్రీలకు సహాయం చేయమని నిన్ను కూడా బ్రతిమాలుతున్నాను. వారు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి. వారందరూ ఎప్పటికీ నిలిచి ఉండేలా దేవుడే వారి పేర్లను జీవగ్రంథంలో రాసాడు.

4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి. 5 మీ మృదుస్వభావం అందరూ చూడాలి, ఎందుకంటే ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేని గురించీ ఆందోళన చెందకండి. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. మీకు ఏది కావాలో కచ్చితంగా అడగండి. మీకు సహాయం చేయమని అడగండి. ఆయన మీకు చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. 7 అప్పుడు మనం అర్థం చేసుకోగలిగిన దానికంటే గొప్పదైన దేవుని శాంతి మనకు ఒక సైనికుడిలా యేసుక్రీస్తుతో మనం ఉండటం వల్ల మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

8 చివరికి, నా తోటి విశ్వాసులారా , ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే ఎప్పుడూ తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూశారో, వాటినే ఎప్పుడూ చేయండి. అప్పుడు దేవుడు మీకు శాంతి ఇస్తాడు, ఎప్పుడూ మీతో ఉంటాడు.

10 నా గురించి మీరు ఇంతకాలానికి మళ్ళీ శ్రద్ధ వహించి నా కోసం డబ్బు పంపారని చాలా సంతోషించి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేసాను. నిజానికి గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ అది తెలియజేయటానికి మీకు సరైన అవకాశం దొరకలేదు. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. 12 నాకు పేదరికంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. అన్ని పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. అన్ని సమయాలలో సంతోషంగా ఎలా ఉండవచ్చో ఆ రహస్యం నాకు తెలుసు. 13 నన్ను బలపరచే క్రీస్తు ద్వారా నేను ఏదైనా చేయగలను. 14 అయినా నా కష్టాల్లో పాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు.

15 ఫిలిప్పీలో ఉన్న నా స్నేహితులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. మరి ఏ విశ్వాసుల సంఘం నాకు సహాయం పంపలేదు, నాకు చేయూత ఇవ్వలేదు. ఈ సంగతి మీకే తెలుసు. 16 ఇంకా నేను తెస్సలోనిక పట్టణంలో ఉన్నప్పుడు కూడా మీరు మాటిమాటికీ నా అవసరాలు తీర్చడానికి నాకు సహాయం చేశారు. 17 నేను డబ్బు ఆశించి ఇలా చెప్పడం లేదు. మీరు ఇంతకంటే ఎక్కువ పనులు చేయాలని నా కోరిక. దేవుడే మిమ్మల్ని మెచ్చుకుంటాడు.

18 ఇప్పుడు నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. యాజకులు దేవునికి జంతువును అర్పణగా కాల్చినప్పుడు అవి ఇంపైన సువాసనగా ఎలా ఉంటాయో మీరు పంపిన వస్తువులు అలానే ఉన్నాయి. 19 నేను సేవించే నా దేవుడు మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు. ఎందుకంటే మీరు పరలోక ఐశ్వర్యానికి అధిపతి అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళు. 20 కాబట్టి ఎప్పటికీ యుగ యుగాల వరకూ అద్భుతమైన కాంతిలో పరిపాలించే మన తండ్రిగా ఉన్న దేవుణ్ణి నరులంతా కొనియాడుదురు గాక. ఆమేన్‌.

21 పవిత్రులందరికీ క్రీస్తు యేసులో అభివందనాలు చెప్పండి. నాతో ఉన్న సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. 22 ఇక్కడున్న దేవుని ప్రజలందరూ అభినందనాలు తెలియచేస్తున్నారు. ముఖ్యంగా సీజర్ చక్రవర్తి రాజభవనంలో ఉన్న నా తోటి విశ్వాసులందరూ మీకు అభివందనాలు చెబుతున్నారు.

23 ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరిపైనా ఉండాలని నా ఆకాంక్ష. ఆమెన్.