యూదా రాసిన పత్రిక
Chapter 1
1 నేను యూదాను. యేసు క్రీస్తు సేవకుణ్ణి, యాకోబు సోదరుణ్ణి. దేవుడు తన దగ్గరకు పిలిచిన వాళ్ళకి, యేసుక్రీస్తు కోసం దేవుడు భద్రం చేస్తున్న వాళ్ళకీ , తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తున్న వాళ్ళకీ నేను రాస్తున్నాను. 2 దేవుడి కరుణ మీపై ఉండు గాక! ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన శాంతి మీకు కలుగు గాక!
3 మనందరినీ దేవుడు ఎలా రక్షించాడో అనే విషయం గురించి నేను ఎంతో ప్రేమించే మీకు ఈ ఉత్తరం రాయాలని చాలా ప్రయత్నించాను. మనం విశ్వసించే కొన్ని సత్యాలను గురించి మీకు సాధ్యం అయినంత వరకు మీకు చెప్పాలని మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను ఈ ఉత్తరం రాయవలసి వచ్చింది. క్రీస్తులో విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ దేవుడు ఈ విషయాలు బోధించాడు. ఈ విషయాలు ఎప్పటికీ మారవు.
4 మీ సమావేశాల్లోకి కొందరు చొరబడుతున్నారు. పూర్వం ప్రవక్తలు రాసినట్టు వీళ్ళు కీడు చేసే వాళ్ళు. అబద్ద బోధలు చేస్తూ, దేవుడు వాళ్ళ పట్ల దయ చూపిస్తున్నాడు అనుకుంటున్నారు. లైంగిక పాపం చేసే అనుమతిని దేవుడు వాళ్లకు ఇచ్చాడు అనుకుంటున్నారు. వాళ్ళు ఈ విధంగా మన గురువు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన సత్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు.
5 ఇవన్నీ మీకు ముందే తెలిసినా మీకు నేను గుర్తు చేయాలని ఆశించేవి కొన్ని ఉన్నాయి. ప్రభువు తన ప్రజలను ఐగుప్తు నుండి రక్షించినా, అదే ప్రజల్లో చాలామందిని తనలో విశ్వాసం ఉంచనందుకు ఆయన నాశనం చేసాడు. 6 పరలోకంలో దేవుడు దేవదూతలకు కొన్ని అధికార స్థానాలు నియమించాడు కూడా. కానీ ఆ స్థానాల్లో వాళ్ళు అధికారం నిలుపుకోలేదు. ఆ స్థానాలను కోల్పోయారు. అందుకే దేవుడు ఆ దూతలను గొలుసులతో బంధించి నిత్యం నరకంలోని చీకటిలో పెట్టాడు. దేవుడు తీర్పు తీర్చి, శిక్షించే ఆ ముఖ్యమైన దినం వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. 7 అలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలలోని వాళ్ళు, వాటి దగ్గరలో ఉన్న పట్టణాల వాళ్ళు లైంగిక అవినీతికి పాల్పడ్డారు. దేవుడు అనుమతించిన దానికి భిన్నంగా వాళ్ళు అన్ని రకాల లైంగిక సంబంధాలను కోరుకున్నారు. ఆ మనుషులకు, పరలోకంలోని దూతలకు ఏమయ్యింది? అబద్ధ బోధలు బోధించే వాళ్ళను నిత్య నరకాగ్నితో దేవుడు శిక్షిస్తాడని చూపాడు. 8 అలాగే మీ మధ్య నివసించే వాళ్ళు కూడా అనైతికంగా జీవిస్తూ తమ శరీరాలను మలినం చేసుకున్నారు కూడా. దేవుడు వాళ్లకి దర్శనాలు చూపించి అలా చేయమని చెప్పాడని వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు దేవుని ఆజ్ఞలకు లోబడరు. దేవుని దూతలను అవమానిస్తారు.
9 ప్రధాన దూత మిఖాయేలు మోషే శరీరాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారు అనే విషయంలో సాతానుతో వాదిస్తూ ఉన్నప్పుడు, వాడిని నిందించలేదు, అవమానించలేదు. కేవలం "ప్రభువు నిన్ను శిక్షించును గాక" అని మాత్రమే అన్నాడు. 10 కానీ నేను ఎవరికి అయితే రాస్తున్నానో వాళ్ళు తమకు అర్థం కాని మంచి విషయం గురించి చెడ్డగా మాట్లాడతారు. సాధారణంగా వాళ్ళు అర్థం చేసుకునేవి అన్నీ నాశనం అయ్యేవే కాబట్టి వాళ్ళు ఆలోచించలేని కౄర మృగాల్లాంటి వాళ్ళు.
11 ఈ పనులు చేసే వాళ్ళని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. కయీను ప్రవర్తించినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. డబ్బు కోసం బిలాము పాపం చేసినట్టు వాళ్ళు పాపం చేస్తారు. మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, కోరహు చనిపోయినట్టు వాళ్ళు చనిపోతారు. 12 ఈ మనుషులు నీటి కింద ఉండే బండ రాళ్ళల్లాంటి వాళ్ళు. ఇలాంటి వాటికే ఓడలు గుద్దుకొని బద్దలైపోతాయి. వాళ్ళు తమను సంతోష పెట్టుకోవడం కోసం తింటారు కాబట్టి మీ ప్రేమ విందుల్లో వాళ్ళు పాలు పంచుకున్నప్పుడు వాళ్లకు సిగ్గు ఉండదు.
వాళ్ళు వర్షం కురవని మేఘాల్లాగా గాలికి కొట్టుకుపోయే మేఘాల్లాగా ఉంటారు. వాళ్ళు ఆకు రాలే కాలంలో కాయలు కాయని చెట్లవంటి వాళ్ళు. వ్రేళ్ళతోసహా పెకలించిన చెట్లవంటి వాళ్ళు. వారు మంచి పనులు చేయరు. రెండు సార్లు చచ్చిన మనుషుల వంటి వాళ్ళు. 13 తమను తాము అదుపులో ఉంచుకోలేరు. వాళ్ళు సముద్రంలో తుఫాను చెలరేగే సమయంలో వచ్చే బలమైన అలల వంటి వాళ్ళు. సముద్రపు అలలు ఒడ్డుకు నురగ, మురికి తెచ్చినట్టు వాళ్ళు తమ సిగ్గుతో ఇతరుల్ని కలుషితం చేస్తారు. ఆకాశంలో తాము ఉండాల్సిన చోట నిలవని నక్షత్రాల్లాటి వారు. దేవుడు వాళ్ళని భయంకరమైన చీకటిలో నిత్యం ఉంచుతాడు.
14 ఆదాము నుండి ఏడవ వ్యక్తి హానోకు ఆ అబద్ద బోధకుల సిద్ధాంతాలను గురించి చెప్తూ, "జాగ్రత్తగా వినండి. లెక్కకు మించిన విశ్వాసులతో ప్రభువు కచ్చితంగా వస్తాడు. 15 దేవుణ్ణి అగౌరవపరచిన ప్రతి ఒక్కరికీ తీర్పు తీర్చి, చెడ్డ వాళ్ళందరికీ శిక్ష వేస్తారు. దేవుడికి వ్యతిరేకంగా, కఠినంగా వీళ్ళు మాట్లాడారు కాబట్టి దూతలు ఈ పని చేస్తారు. 16 దేవుడు చేసిన వాటిని గురించి ఈ తప్పుడు సిద్ధాంతాల బోధకులు సణుగుతారు. వాళ్ళకు జరిగిన దాని గురించి వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. వాళ్లకు అవి చేయడం ఇష్టం కాబట్టి చెడ్డ పనులే చేస్తారు. గొప్పలు చెప్పుకుంటారు. ఇతరుల నుండి వాళ్లకు కావలసినవి పొందడానికి వాళ్ళను పొగుడుతారు."
17 కానీ నేను ప్రేమించే ప్రజలారా, చాలా కాలం క్రితం మన యేసు క్రీస్తు ప్రభువు అపోస్తలులు చెప్పింది గుర్తు తెచ్చుకోండి. 18 అంత్య దినానికి ముందు దేవుడు మనకు చెప్పిన సత్యాలను గురించి కొందరు హేళనగా మాట్లాడతారు. దేవుణ్ణి అగౌరవపరచాలనే ఉద్దేశంతో తమ శరీరాలతో పాపం చేస్తారు. 19 విశ్వాసులు ఒకరి మీద ఒకరు కోపగించుకోనేలా వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేయాలనుకున్న చెడ్డ పనులన్నీ వాళ్ళు చేస్తారు. వాళ్ళలో దేవుని ఆత్మ నివసించదు.
20 కానీ నేను ప్రేమించే నా ప్రజలారా, మీరు నమ్మే దేవుని సత్యాన్ని ఉపయోగిస్తూ ఒకరిని ఒకరు బలపరచుకోండి. ప్రార్థన చేసే నడిపింపుకు పరిశుద్ధాత్మను దారి చూపనివ్వండి. 21 దేవుని ప్రేమించే వారికి తగినట్టుగా మీ జీవితాలను నడుపుకుంటూ ఉండండి. మీ పట్ల యేసు క్రీస్తు ప్రభువు కరుణ ఉండాలని నిరంతరం కనిపెడుతూ ఉండండి. ఆయనతో నిత్యం జీవించడం ప్రారంభించే వరకు కనిపెడుతూ ఉండండి.
22 ఏ బోధలు నమ్మాలో తెలియక సందిగ్ధంలో ఉన్న వాళ్ల పట్ల దయ చూపించి, సహాయం చేయండి. 23 నిత్యాగ్నిశిక్ష నుండి ఇతరులను తప్పించండి. పాపం చేసే వాళ్ళను చూసి జాలిపడండి కానీ వాళ్ళతో కలిసి పాపం చేయడానికి భయపడండి. వాళ్ళ వస్త్రధారణను అసహ్యించుకోండి, ఎందుకంటే వాళ్ళ పాపాలతో అవి మురికి అయ్యాయి.
24 దేవునిలో మీరు విశ్వాసం ఉంచేలా ఆయన చేయగలడు. ప్రకాశించే వెలుగు ఎక్కడ ఉందో అక్కడికి ఆయన సన్నిధికి మిమ్మల్ని తీసుకు వెళ్తాడు కూడా. మీరు పాపాల నుండి విడుదల పొంది ఎంతో ఆనందిస్తారు. 25 నిజమైన దేవుడు ఆయన ఒక్కడే. మన ప్రభువు యేసు క్రీస్తు మనకు చేసిన దాని ఫలితంగా ఆయన మనల్ని రక్షించాడు. దేవుడు మహిమగలవాడు, శక్తివంతుడు, మహా ఉన్నతమైన వాడు. ఆది నుండి ఆయన సర్వాధికారంతో ఏలుబడి చేసాడు. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఎప్పటికీ అలాగే ఉంటాడు! ఆమెన్.