తిమోతికి రాసిన మొదటి పత్రిక
Chapter 1
1 తిమోతీ, పౌలు అనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. మెస్సీయ అయిన యేసు ఆజ్ఞాపించి, ఆయన ప్రతినిధిగా నన్ను నియమించుకున్నట్టు నీకు తెలుసు. మనల్ని రక్షించిన యేసు రాకడ కోసం మనం నమ్మకంగా ఎదురు చూస్తున్నాము.
2 తిమోతీ, నా బోధను బట్టి ప్రభువైన మెస్సీయను విశ్వసించిన నువ్వు నా నిజమైన కొడుకులాంటి వాడవు. నీ ఆత్మలో తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు నుండి కృప, కనికరం నిరంతరం కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. 3 నేను మాసిదోనియకు వెళ్తూ నిన్ను కోరినట్టుగా ఎఫెసులోనే ఉండు. అక్కడే ఉండి ప్రజలకు తప్పుడు సిద్దాంతాలు బోధిస్తున్న వాళ్ళను అదుపు చేస్తూ అలా చేయవద్దని వాళ్ళను ఆజ్ఞాపించు. 4 వివాదాలకు కారణమయ్యే ముసలమ్మ ముచ్చట్లు, అంతూ పొంతూలేని వంశావళులపై దృష్టి నిలిపే వాళ్ళను ఖండితంగా నిరోధించు. ఇలాంటి విషయాలు దేవుణ్ణి నమ్మిన మనకు ఏ విధంగానూ ఉపయోగపడవు.
5 ఇలాంటి వాటిని నిరోధించడం మనుషులు మన నిజమైన బోధ ద్వారా ఒకరినొకరు ప్రేమించుకొనేందుకు, మంచి జరగాలని కోరుకొనేందుకు, దేవుడు మెచ్చిన క్రియలు తాము జరిగించేందుకు కారణమౌతుంది. 6 ఇలాంటి మంచి పనులు చేయడానికి కొందరు నిరాకరించి, వ్యర్ధమైన బోధలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. 7 వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే బోధలుగా ఉండాలని కోరుకుంటున్నారు గానీ వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో, ఏ విషయాలు నిజమని నమ్ముతున్నారో వాళ్లకే అర్థం కాదు.
8 అయితే మోషే ధర్మశాస్త్రాన్ని తగిన రీతిలో ఉపయోగిస్తే అది ఎంత ప్రయోజనమో మనకు తెలుసు.
9 దేవుని చట్టాలు మంచి వారికి తీర్పు తీర్చడానికి గాక వాటిని అగౌరవపరిచే వాళ్ళకి, దేవుణ్ణి ఘనపరచని వాళ్ళకి, తల్లితండ్రులను చంపే హంతకులకి వర్తిస్తాయి. 10 ఆ చట్టాలు వ్యభిచారులు, స్వలింగ సంపర్కులు, అబద్ద సాక్షం చెప్పేవారు, అబద్ధికులు, నిజమైన బోధకు విరుద్ధంగా నడిచే వాళ్ళకి వర్తిస్తాయి. 11 ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.
12 నన్ను నమ్మి బలపరిచి తన సేవకు నియమించుకున్న ప్రభువైన క్రీస్తు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాను. 13 అంతకు ముందు దేవుణ్ణి దూషించి ఆయన భక్తులను హింసించాను, అయితే తెలియక అవిశ్వాసంతో చేసాను కాబట్టి క్షమాపణ పొందాను. 14 మన ప్రభువు నేను చేసిన చెడు కార్యాలను క్షమించి అర్హతలేని నాకు తన క్పపను దయచేసి తన వాడిగా చేసుకున్నాడు.
15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం మనమందరం పూర్తిగా నమ్మాలి, అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి. 16 అందరికంటే పెద్ద పాపినైన నన్ను క్షమించి నిత్య జీవం ఇవ్వడం ద్వారా యేసు క్రీస్తు తన పూర్తి ఓర్పును నాలో కనపడేలా చేసాడు. నా క్షమాపణను ఒక ఉదాహరణలా చేసాడు.
17 అందుకే మనం నిత్యముండే రాజూ, అమరుడు అయిన ఏకైక దేవునికి మహిమ ఘనత చెల్లిద్దాం.
18 నా కొడుకులాంటి తిమోతీ, గతంలో నిన్ను గురించి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే అబద్ద బోధకులపై మంచి పోరాటం చేయగలుగుతావు. 19 యేసు ప్రభువుపై విశ్వాసముంచి సరైన పనులు మాత్రమే చెయ్యండి. అలా చెయ్యకుండా దేవునితో సంబంధం చెడగొట్టుకున్న చాలామందిని గుర్తుంచుకో. 20 హుమెనై, అలెగ్జాండర్ అలాటివారే. వారు దేవుణ్ణి దూషించడం మానుకునేలా వాళ్ళని సాతానుకు అప్పగించాను.
Chapter 2
1 నేను విశ్వాసులను కోరుకునే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరి కోసం దేవుణ్ణి ప్రార్థించండి. వాళ్ళ అవసరాలు తీరేలా, వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేలా వాళ్ళ కోసం నిరంతరం ప్రార్థించండి. 2 రాజుల కోసం, అధికారంలో ఉన్నవారి కోసం ప్రార్థించండి. అప్పుడు మనం శాంతి సమానత్వాలతో దేవుని దృష్టిలో నీతిగా, సక్రమంగా జీవించగలుగుతాము. 3 ఇలాంటి ప్రార్థన మన రక్షకుడైన దేవునికి సంతోషం కలిగిస్తుంది. 4 మానవులంతా రక్షణ పొందాలని ప్రతి ఒక్కరూ సత్య వాక్యం తెలుసుకుని ఆయనను అంగీకరించాలని ఆయన కోరుతున్నాడు.
5 దేవుడు ఒక్కడే, మానవులను దేవుని చెంతకు చేర్చేదీ ఒక్కడే. ఆయనే మానవ రూపం దాల్చిన మెస్సీయ అయిన యేసు. 6 మానవుల విమోచన వెలగా ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సరియైన సమయంలో దేవుడు మానవుల రక్షణను ఆమోదించాడు. 7 దేవుని సువార్త సందేశం ప్రకటించేవానిగా ఆయన నన్ను నియమించుకున్నాడు. క్రీస్తు ప్రభువుకు చెందినవాడిగా నేను నిజం చెబుతున్నాను, అబద్ధాలు చెప్పడం లేదు. యూదులు కానివాళ్ళు నిజమైన దేవుని సత్యాలు తెలుసుకుని ఆయనను విశ్వసించాలని వారికి కూడా బోధించాను.
8 అందువల్ల అన్ని స్థలాల్లోని పురుషులు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా జీవిస్తూ ఆయనను ఆరాధించాలని కోరుతున్నాను. అలా చేస్తే ఒకరిపై ఒకరు కోపతాపాలు లేకుండా ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలతో ఉండగలుగుతారు. 9 అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించుకోవాలి. అందంగా కనబడడం కోసం జడలతో, బంగారంతో, ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో అలంకరించుకోకూడదు. 10 భక్తిపరులుగా కనబడాలని చూసే స్త్రీలకు తగినట్టుగా తమ మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
11 సంఘ సమావేశాల్లో స్త్రీలు మౌనంగా ఉండి విధేయతతో నాయకుల నుండి నేర్చుకోవాలి. 12 స్త్రీలు బోధించడాన్ని, పురుషులపై అధికారం చెలాయించడాన్ని నేను అంగీకరించను. స్త్రీలు మౌనంగా ఉండి వినడమే మంచిది.
13 దేవుడు మొదటగా ఆదామును, తరువాత హవ్వను సృష్టించాడు గదా. 14 దేవుడు చెయ్యకూడదు అని చెప్పినదాన్ని చేసి సాతాను చేతిలో పూర్తిగా మోసపోయినది హవ్వే కానీ ఆదాము కాదు. 15 అయినా స్త్రీలు దేవునిలో విశ్వాసముంచి, ఇతరులను ప్రేమిస్తూ, ఆయనకు ఇష్టులై ఉంటే బిడ్డలను కనే సమయంలో దేవుడు వారిని కాపాడతాడు.
Chapter 3
1 విశ్వాసుల గుంపుకు ఎవరైనా నాయకుడుగా ఉండాలని కోరుకుంటే, అతడు ఘనమైన పనిని కోరుకుంటున్నాడు అని ప్రతి ఒక్కరూ అంగీకరించవచ్చు. 2 ఈ కారణాన నాయకుడుగా ఉండాలనుకునే వాడు అపనిందకు చోటివ్వకుండా మంచి పనులు జరిగించేవాడై ఉండాలి. అతడు ఏక పత్నీవ్రతుడై ఉండాలి. మితిమీరి ఎలాంటి పనులూ చేయకూడదు. మంచి ఆలోచనలు కలిగి ఉండి చక్కని ప్రవర్తనతో నడుచుకోవాలి. అతిథులను గౌరవిస్తూ ఇతరులకు బోధించేవాడుగా ఉండాలి. 3 అతడు తాగుబోతు కాక, వివాదాలకు దూరంగా ఉండాలి. సాధు స్వభావం కలిగి ఉండి కలహాల, గొడవల జోలికి పోకూడదు. అతనికి డబ్బుపై మోజు ఉండకూడదు.
4 అతడు తన సొంత కుటుంబాన్ని గుట్టుగా గౌరవ మర్యాదలతో నడుపుకోవాలి. పిల్లలు అతనికి చెప్పుచేతల్లో ఉంటూ, గౌరవిస్తూ ఉండాలి. 5 తన కుటుంబాన్ని సవ్యంగా నిర్వహించుకోలేని వాడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు?
6 కొత్తగా విశ్వాసి అయినవాణ్ణి విశ్వాసుల గుంపుకు నాయకుడుగా నియమించవద్దు. ఎందుకంటే అతడు గర్వంగా ప్రవర్తించవచ్చు. అప్పుడు అపవాదితో పాటు దేవుని తీర్పుకు గురౌతాడేమో. 7 విశ్వాసులు కానివారు సహితం అతణ్ణి గురించి మంచి అభిప్రాయం కలిగి ఉండేలా అతని ప్రవర్తన ఉండాలి. మనుషులు వల వేసి జంతువులను పట్టినట్టు, అపవాది వలలో పడకుండా అతనిపై ఎవ్వరూ నిందలు మోపరాదు.
8 అదే విధంగా, నాయకులకు సహాయకుడిగా ఉండేవారు గంభీరంగా ప్రవర్తించాలి. వారి మాటల్లో నిజాయితీ ఉండాలి. అతడు తాగుబోతు కాకూడదు. ధన వ్యామోహం గలవాడుగా ఉండకూడదు. 9 దేవుడు వెల్లడించిన సువార్త సత్యాన్ని విశ్వసిస్తూ దాని ప్రకారం నడుచుకునేవాడై ఉండాలి. 10 నాయకులుగా ఉండగోరిన వాళ్ళను పరీక్షించినట్టే వీళ్ళ నడవడిని కూడా పరీక్షించి, అంతా సవ్యంగా ఉన్నప్పుడు సహాయకులుగా నియమించవచ్చు.
11 అలాగే వాళ్ళ భార్యలు కూడా గౌరవానికి పాత్రులుగా ఉండి, ఇతరుల గురించి చెడ్డ మాటలు మాట్లాడకుండా, మితిమీరి ప్రవర్తించకుండా ఉండాలి. ప్రతి విషయంలోనూ నమ్మకస్తులుగా ఉండాలి. 12 సహాయకుడిగా నియమితుడయ్యే వాడు తన భార్య పట్ల నమ్మకంగా ఉండాలి. అతడు తన పిల్లల, ఇంటిలోని ఇతర వ్యక్తుల విషయం జాగ్రత్త వహిస్తూ వాళ్ళను రుజు మార్గంలో నడిపించాలి. 13 పరిచారకులుగా మంచి సేవ చేస్తూ, తాము నమ్మిన క్రీస్తు యేసును గురించి ధైర్యంగా ప్రకటించే సహాయకులు ప్రజల మన్ననలు పొందుతారు.
14 త్వరలో నేను నీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ విషయాలు నీకు రాస్తున్నాను. 15 నేను నీ దగ్గరికి త్వరగా రాలేని పక్షంలో, దేవుని ఇంట్లో విశ్వాసుల నడవడి, సజీవుడైన దేవుని సంఘంలో విశ్వాసుల ప్రవర్తన గురించి నీవు తెలుసుకోవాలి. వాళ్ళు సత్య సందేశాన్ని నమ్మి, దానిని బోధించ వలసినవారు.
16 దేవుడు వెల్లడి పరచిన సందేశం ఇది. ఈ సంగతులు మన ఊహకు అందని అద్భుతమైన సత్యాలని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.
క్రీస్తు ప్రభువు మానవ శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు.
ఇది వాస్తవమని పరిశుద్దాత్మ రుజువు చేశాడు.
దేవదూతలు ఆయనను చూశారు.
విశ్వాసులు ఆయన గురించి ప్రపంచమంతటా ప్రచారం చేశారు.
లోకంలో అనేక ప్రాంతాల వారు ఆయనను నమ్మారు.
మహిమా ప్రభావాలతో దేవుడు ఆయనను పరలోకానికి కొనిపోయాడు.
Chapter 4
1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది యేసును గురించిన నిజ విశ్వాసాన్ని విడిచిపెట్టి, ప్రజలను మోసగించే ఆత్మలను, అబద్ద బోధకులు దురాత్మల ద్వారా చేస్తున్న తప్పుడు బోధలను నమ్ముతారు. 2 వీళ్ళు అబద్దీకులు, నిజాలే బోధిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. వాళ్ళు తమ మనస్సాక్షి గద్దింపుకు లోబడరు.
3 విశ్వాసులు పెళ్లి చేసుకోవడాన్ని వాళ్ళు అంగీకరించరు. దేవునికి స్తుతులు చెల్లించి భుజించేలా ఆయన సృష్టించిన ఆహార పదార్థాలలో కొన్నింటిని తినకూడదని చెబుతారు. దేవుణ్ణి నమ్మిన మనకు నిజం తెలుసు కాబట్టి మనం వాటిని తింటున్నాము. 4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే, దేవునికి స్తుతులు చెల్లించి తీసుకున్నది ఏదీ నిషేధం కాదు. 5 మనం ఆయన మాట నమ్మి, ఆయనకు ప్రార్థించి తీసుకున్న ఆహారం ఆయన అంగీకరిస్తాడు.
6 ఈ సంగతులను తోటి విశ్వాసులకు వివరించడం ద్వారా ప్రభువైన క్రీస్తుకు సేవ చేసినవాడవౌతావు. నువ్వు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు. 7 పనికిమాలిన ముసలమ్మ ముచ్చట్లు వదిలిపెట్టి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకో. 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.
9 నేను రాస్తున్న ఈ విషయాలన్నిటి మీదా నువ్వు పూర్తిగా ఆధారపడవచ్చు. ఇది నమ్మదగిన సందేశం. 10 ఈ కారణం చేత, మనం శాయశక్తులా కష్టపడుతున్నాం. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం మన విషయంలో పూర్తిగా నెరవేరుతుందని మనం నమ్మకంతో ఎదురుచూస్తున్నాం.
11 ఈ విషయాలు బోధించి, ఆజ్ఞాపించు.
12 నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. నీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు. 13 నేను తిరిగి వచ్చేవరకు విశ్వాసుల సమక్షంలో వాక్యం చదవడంలో, బోధలో, దేవునికి లోబడమని హెచ్చరించడంలో స్థిరంగా నిలబడు.
14 నీకున్న వరాన్ని ఉపయోగించడంలో నమ్మకంగా ఉండు. పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 15 నేను నీకు బోధించిన ఈ సంగతులను సాధన చెయ్యి. ఇతరులకు యేసు అనుచరుడుగా నీ అభివృద్ది కనుగొనేలా నీ ప్రవర్తన ఉండాలి. 16 నీ ప్రవర్తన గురించీ, ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే కాకుండా నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.
Chapter 5
1 నీకంటే వయసులో పెద్దవాణ్ణి కఠినంగా కాక, సున్నితంగా మందలించు. అతనిని నీ తండ్రిగా భావించి హెచ్చరించు. యువకులను నీ సోదరులుగా భావించి వారికి మంచిని బోధించు. 2 నీకన్నావయసులో పెద్దవారైన స్త్రీని తల్లిలా భావించి వాళ్లకు తగిన సూచనలివ్వు. యువతులను నీ అక్కచెల్లెళ్ళుగా భావించి హెచ్చరించు. ఇవన్నీ చేస్తున్నపుడు నువ్వు సరైన దారిలో ఉంటావు.
3 ఎలాంటి ఆసరా లేని నిజమైన వితంతువులకు సహాయం అందించేలా ఉండాలనేది సంఘం లక్ష్యంగా ఉండేలా చూడు. 4 ఒకవేళ ఆ వితంతువుకి పిల్లలు లేదా మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నప్పుడు ఇతర సత్కార్యాలు చేసే ముందు ఆ ఇంటివారే వాళ్ళని చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన పెద్దవాళ్ళ ఋణం తీర్చుకోవచ్చు, అదే దేవునికి ఇష్టం. 5 ఒక ఒంటరి వితంతువుకి ఎవ్వరి సహాయమూ లేకపోతే, ఆమె దేవుని వైపు మాత్రమే సహాయం కోసం చూస్తూ నిజాయితీగా ప్రార్థన చేస్తుంది. 6 అయితే విలాసాల్లో బ్రతకాలి అనుకునే వితంతువు శారీరకంగా బ్రతికి ఉన్నా చచ్చినట్టే. 7 వారి ప్రవర్తన చెడుగా ఉన్నప్పుడు వారికి సరైన విషయాలు బోధించు. 8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన సొంత ఇంటి వారి బాగోగులు చూసుకోపోతే అతను మనం నమ్మే వాటిని తిరస్కరించాడన్న మాట. అలాటివాడు అవిశ్వాసికన్నా చెడ్డవాడు.
9 అరవై ఏళ్ళ వయస్సు నిండి, గతంలో ఒక్క పురుషుడికి మాత్రమే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే వితంతువుల గుంపులో చేర్చవచ్చు. 10 ఆమె మంచి పనుల్లో పేరుగాంచి ఉండాలి, తన పిల్లలను మంచిగా పెంచాలి, విశ్వాసులకు సేవ చేసి ఉండాలి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి ఉండాలి. ప్రతి మంచి పనికీ సిద్ధంగా ఉండాలి, అలాటి వారు వితంతువుల జాబితాలో ఉండవచ్చు.
11 కాని పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు, యేసు క్రీస్తుకు విరోధంగా వారి కోరికలు అదుపు తప్పితే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. 12 ఇలా వారు తమ ప్రధాన నిర్ణయం వదిలేసి తమ మీదకు అపరాధం తెచ్చుకుంటారు. 13 ఇవే కాకుండా వారు ఇంటింటికీ తిరుగుతూ, ఏ పనీ చెయ్యకుండా ముసలమ్మ ముచ్చట్లు చెబుతూ ఇతరుల విషయాల్లో తల దూర్చేవారిలా తయారవుతారు.
14 అందువలన వారు ఆ వితంతువుల గుంపులో చేరకుండా పెళ్లి చేసుకుని పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఇల్లు గడుపుకోవాలి, ఇలా చెయ్యడం ద్వారా శత్రువైన సాతానుకు నిందించే అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. 15 ఇప్పటికే కొంతమంది యువతులు యేసును కాదని సాతాను దారిలో వెళ్ళిపోయారు, అందుకే ఇలా రాస్తున్నాను.
16 ఏ విశ్వాసి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి వదిలేయకుండా ఆమే వారికి సహాయం చెయ్యాలి.
17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యం బోధించే వారికి, వాక్య బోధనలో కష్టపడే వారికి విశ్వాసులు ఎక్కువగా గౌరవం ఇవ్వాలి. 18 ఇది సరైనది అని మనకు తెలుసు. ఎందుకంటే, "కళ్ళెం నూర్చే ఎద్దు నోటిని గడ్డి తిననీయకుండా చిక్కం తగిలించ వద్దు." అని మోషే లేఖనాల్లో రాశాడు. అలాగే యేసు "కష్టపడి పనిచేసిన పనివాడికి జీతం డబ్బులు ఆపవద్దు" అని చెప్పాడు.
19 ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే తప్ప సంఘ పెద్దపై మోపిన నిందను ఆలకించవద్దు. 20 పాపంలో కొనసాగుతున్న వ్యక్తులను ప్రజలందరి ఎదుటా గద్దించు. అలా చేస్తే మిగతావాళ్ళు ఆ పాపం చేయడానికి జంకుతారు.
21 దేవుని ఎదుటా, ప్రభువైన క్రీస్తు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నేను నీకు బోధించిన సూచనలను తుచ తప్పకుండా అనుసరించు. ఎలాంటి పక్షపాతం చూపకుండా అందరికీ తీర్పు తీర్చు.
22 పెద్దలను ఎంపిక చేసే సమయంలో తొందర పడవద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పాపంలో ఉన్నట్టయితే ఆ పాపంలో నీకు కూడా పాలు ఉంటుంది. కాబట్టి వాళ్ళను పరీక్షించడానికి కావలసినంత సమయం తీసుకో. ఈ విషయంలో నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకో.
23 తిమోతీ, ఇక నుండి మంచినీళ్ళు మాత్రమే కాక, నీ కడుపులో తరచుగా వచ్చే నొప్పి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగుతూ ఉండు. 24 గుర్తుంచుకో, కొందరు చేసే పాపాలు తేలిగ్గా అందరికీ తెలిసిపోయి త్వరలోనే శిక్షకు గురౌతారు. మరికొందరు రహస్యంగా చేసే పాపాలు చాలా కాలానికిగానీ బట్టబయలు కావు. 25 అదే విధంగా కొందరు చేసే మంచి పనులు అందరికీ తెలిసిపోతాయి. కొందరు రహస్యంగా చేసే మంచి పనులు, దానాలు కొంత కాలం గడిచిన తరువాత గానీ బయటపడవు.
Chapter 6
1 బానిసలుగా ఉన్న విశ్వాసులు తమ యజమానులను అన్ని విధాలుగా గౌరవించాలి. ఆ విధంగా చేయడం వల్ల దేవుని నామం, ఆయన బోధ హేళనకు గురి కాకుండా ఉంటాయి.
2 క్రీస్తును విశ్వసించిన యజమానుల దగ్గర పనిచేసే బానిసలు తమ యజమానులు ప్రభువులో తమ సోదరులే కదా అని వారిని చిన్నచూపు చూడకూడదు. తాము సేవించేది తమ ప్రేమకు పాత్రులైన విశ్వాసులనే అని ఇంకా బాగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు.
3 కొందరు అసత్య విషయాలు బోధిస్తున్నారు. ఆధార పడదగ్గ ప్రభువైన క్రీస్తు బోధలను వాళ్ళు అంగీకరించరు. దేవుణ్ణి సంతోషపరిచే రీతిలో జీవించాలనే బోధను వాళ్ళు తృణీకరిస్తారు. 4 ఈ వ్యక్తులు గర్విష్టులై ప్రాముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోలేరు. వాళ్ళు బహిరంగంగా అనవసరమైన విషయాల గురించి వాదులాటలు పెట్టుకుంటారు. ఇతరులను ద్వేషిస్తారు. ఇతరులతో తగవులు పెట్టుకుంటూ, చెడ్డ మాటలు పలుకుతుంటారు. చెడ్డ తలంపులతో ఇతరులను అనుమానిస్తూ ఉంటారు. 5 వాళ్ళు సత్య సందేశాన్ని తృణీకరించారు గనుక వాళ్ళ ఆలోచనా విధానం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఫలితంగా దైవభక్తి కలిగి ఉండడం ధన సంపాదనకు మార్గమని భావిస్తుంటారు.
6 అయితే మనకున్న దానితో సంతృప్తి కలిగిన దైవభక్తి ఎంతో లాభకరం. 7 మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకు రాలేదు, అలాగే మనం చనిపోయినప్పుడు ఏమీ తీసుకు వెళ్ళడం సాధ్యం కాదు. 8 కాబట్టి మనకున్న తిండి, దుస్తులతో సంతృప్తి కలిగి ఉందాం.
9 అయితే కొందరు ధనవంతులుగా ఉండాలనే యావ కలిగి ఉంటారు. డబ్బు సంపాదన కోసం అడ్డ దారులు తొక్కుతారు. అప్పుడు తప్పించుకోలేని తీవ్ర పరిణామాలు వారికి ఎదురౌతాయి. వాళ్ళు అజ్ఞానంతో హానికరమైన దురాశల్లో పడిపోతారు. చివరికి ఇవన్నీ వాళ్ళను నాశనంలోకి నడిపిస్తాయి. 10 డబ్బు సంపాదించాలన్న దురాశతో మనుషులు నానా గడ్డీ కరుస్తారు. కొందరు డబ్బు సంపాదనలో పడిపోయి తమ విశ్వాసం నుండి తొలగిపోయి తమ నెత్తిమీద తామే నిప్పులు పోసుకుంటారు.
11 అయితే దేవుని సేవకుడివైన నువ్వు డబ్బుపై వ్యామోహం వదిలి మంచి పనులు చేస్తూ, దేవుణ్ణి సంతోషపరిచే వాడిగా జీవించు. దేవునిపై నమ్మకముంచి ఇతరులను ప్రేమించు. కష్ట పరిస్థితులను ఓపికతో సహించు. ఇతరులతో అన్నివేళలా మృదువుగా ప్రవర్తించు. 12 కష్టాలు ఎదురైనా నువ్వు నమ్మిన దాని కోసం స్థిరంగా నిలబడు. నీకోసం దేవుడు సిద్ధపరిచిన నిత్యజీవమనే బహుమానం కోసం ప్రతిరోజూ నిరీక్షణ కలిగి ఉండు. అనేకుల ఎదుట సువార్త ప్రకటిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తుకు చెందినవాడివని గుర్తుంచుకో.
13 దేవుడు సమస్తానికీ జీవం అనుగ్రహించాడు. ఇదే సత్యాన్ని యేసు పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ప్రకటించాడు. 14 క్రీస్తు ప్రభువు మనల్ని చూస్తున్నాడు. మనం చెప్పేది వింటున్నాడు. కనుక నువ్వు ఇతరులు నీపై వేలెత్తి చూపకుండా ఉండేలా నిర్దోషంగా ప్రవర్తిస్తూ ఆయన తిరిగి వచ్చేంత వరకూ దేవునికి లోబడుతూ జీవించు.
15 నిర్ణీత సమయలో దేవుడు యేసును తిరిగి పంపిస్తాడు. లోకంలో రాజులు, అధికారులు ఆయన పాలనకు లోబడతారు. ఆయనే అద్భుతకరుడైన రాజు. 16 ఆయన మరణం లేనివాడుగా, పరలోకంలో ఎవ్వరూ సమీపించలేని ప్రకాశవంతమైన వెలుగులో నివసిస్తున్నాడు. మనుషులంతా ఆయనను ఘనపరచి, ప్రభావవంతమైన ఆయన పాలనలో ఉండాలని నా కోరిక.
17 ధనవంతులైన విశ్వాసులు తమకున్న ధనాన్ని బట్టి గర్వించకూడదని బోధించు. వాళ్ళు నమ్ముకున్న సిరిసంపదలు కలకాలం వాళ్ళతో ఉండవు. అయితే సమృద్ధిగా శాశ్వత కాలం నిలిచి ఉండే ఆనందకరమైన జీవం కోసం దేవునిపై నమ్మకం ఉంచాలని బోధించు. 18 ఇంకా, మంచి పనులు చెయ్యమని బోధించు. ఎక్కువగా ధనం పోగు చేసుకోవడం కంటే ఎక్కువ మంచి పనులు చెయ్యాలని కోరుకోవాలి. తమకున్న సిరిసంపదలను ఇతరులకు దానం చేసే గుణం వాళ్ళు అలవర్చుకోవాలి. 19 అలా చేసినట్టైతే పరలోకంలో తమ కోసం గొప్ప ధన నిధిని సమకూర్చుకున్న వారు అవుతారు. ఇలాంటి మంచి పనులు చేసి తమకు దేవుడు అనుగ్రహించబోయే నిత్య జీవానికి సిద్ధపడతారు. అదే నిజమైన జీవితం.
20 తిమోతీ, ప్రభువు నీకు అనుగ్రహించిన నిజ సందేశాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దేవుని దృష్టికి ఆమోదం కాని మాటలు చెప్పే వాళ్ళను దూరంగా ఉంచు. తామే జ్ఞానం గలవారమని గొప్పలు చెప్పుకుంటూ మనం బోధించిన దానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకు దూరంగా ఉండు. 21 కొందరు ఇలాంటి విషయాలు బోధిస్తూ, దేవుని గురించిన తమ విశ్వాసం నుండి తొలగిపోయారు. దేవుని కృప మీ అందరికి తోడై ఉండునుగాక.