తెలుగు (Telugu): Indian Easy Version (IEV) Telugu

Updated ? hours ago # views See on DCS

యోహాను రాసిన రెండవ పత్రిక

Chapter 1

1 పెద్దలలో ముఖ్యుడుగా మీరు నన్నెరుగుదురు. విశ్వాసులైన మీకు ఇది రాస్తున్నాను. దేవుడు ఎన్నిక చేసుకున్న మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. కారణం మనందరమూ ఎరిగిన క్రీస్తు. ఇది సత్యం. నేను మాత్రమే కాదు, క్రీస్తు బోధించిన సత్య వార్తను చక్కగా తెలుసుకుని, నమ్మిన వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 2 మనందరం ఒక్కటిగా నమ్ముతున్న క్రీస్తు సత్యమే దీనికి కారణం. ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 3 తండ్రి అయిన దేవుడూ, మానవ కుమారుడూ దేవుడూ అయిన యేసు క్రీస్తూ ప్రతినిత్యం మనపై దయనూ, కనికరాన్నీ కుమ్మరిస్తున్నారు. ఇది మనపై ఉన్న దేవుని ప్రేమకు అద్దం పడుతోంది.

4 దేవుడు మనకు బోధించిన సత్యాన్ని తూచా తప్పక అనుసరిస్తూ మీలో కొంత మంది జీవిస్తున్నారని తెలుసుకొని నేను చాలా సంతోషిస్తున్నాను. మన పరలోకపు తండ్రి ఆజ్ఞ ఇదే.

5 ఇప్పుడు, నా ప్రియ సంఘస్తులారా దేవుడు చేయమని ఇచ్చిన ప్రతి ఆజ్ఞకూ మీరు లోబడి ఉండండి, అని నేను ప్రత్యేకంగా బతిమలాడుతున్నాను. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అన్న దేవుని ఆజ్ఞ కొత్తదేమీ కాదు. పైగా క్రీస్తును నమ్మిన మొదటి రోజుల్లోనే ఇకమీదట మనము పరస్పరం ప్రేమ కలిగి ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాము. 6 దేవుణ్ణి ప్రేమించడం అన్నా, ఒకర్నొకరు ప్రేమించుకోవడం అన్నా దేవుడు మనకు విధించిన ఆజ్ఞలకు విధేయత చూపడమే. పరస్పరం ప్రేమగలిగి దేవుణ్ణి హత్తుకోవాలి అన్నదే దేవుని ఆజ్ఞ.

7 యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. వాళ్ళు ఇతరుల్ని మోసం చేయడమేగాక సంఘాన్ని వదిలి వెలుపలికి వెళ్ళి, మీ చుట్టుపక్కల వారిని కూడా మోసగిస్తున్నారు. వీళ్ళు స్వయానా క్రీస్తు వ్యతిరేకులు. 8 ఇలాంటి బోధకుల విషయంలో జాగ్రత్తపడండి, వారి మోసాల్ని అరికట్టండి. వాళ్ళు మిమ్మల్ని మోసగించనిస్తే మీరూ నేనూ మనందరం కలిసి కష్టపడుతున్న దాని ప్రతిఫలం పోగొట్టుకోవడమే కాక దేవుణ్ణి చేరి మీరు పొందాల్సిన సంపూర్ణ బహుమానాన్ని కూడా పొందలేకపోతారు. 9 క్రీస్తు చెప్పిన దానికి మార్పు చేర్పులు చేసేవాడూ, క్రీస్తు చెప్పిన దానిని విని కూడా దానిలో కొనసాగనివాడూ దేవునితో పొత్తు లేనివాడు. అయితే క్రీస్తు బోధలు నమ్మికతో స్వీకరించి, వాటి ప్రకారం నిత్యం నడుచుకునేవారు మన తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారునితోనూ ఒకే పొత్తుగా ఉంటారు. 10 అందుకని, ఎవరైనా క్రీస్తు బోధకు భిన్నమైన బోధ ప్రకటిస్తూ వస్తే వారిని మీ గృహాలకు ఆహ్వానించకండి. వారు ఎదురైనపుడు ఎలా ఉన్నారూ? బాగున్నారా? అనో, మంచిది, మీకు మేలు జరుగుగాక! అనో ప్రోత్సహిస్తున్నట్టు పలకరించకండి. 11 ఎందుకు ఈ విషయమై హెచ్చరిస్తున్నానంటే, ఒకవేళ మీరు మీ తోటి విశ్వాసులతో ఎలా ఉంటారో అలాగే వీరితో కూడా ఉంటే వారు చేస్తున్న చెడ్డ పనిలో మీరు కూడా సాయపడుతున్న వారౌతారు.

12 ఇంకా ఎన్నో సంగతులు మీకు రాయాలని ఉంది. కాని కాగితం, సిరా వాడడం నాకు ఇష్టం లేదు. మన ఆనందం సంపూర్ణం అయ్యేలా మీ దగ్గరికి వచ్చి మీతో ముఖాముఖి మాట్లాడాలని ఆశగా ఉంది. 13 మీతోపాటు దేవుడు ఎన్నుకున్న ఇక్కడి మీ తోటి విశ్వాసులందరూ మీకు శుభాలు తెలుపుతున్నారు.