తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

తీతుకు రాసిన పత్రిక

Chapter 1

1 పౌలు అనే నేను తీతు అనే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను దేవుని సేవకుణ్ణి మరియు యేసు క్రీస్తు అపోస్తలుణ్ణి. తన సొంత వారినిగా ఎన్నిక చేసుకున్నవారు ఆయనను మరింతగా నమ్మేలా బోధించడానికి దేవుడు నన్ను పంపాడు. ఆయన ప్రజలు సత్యమైనదానిని తెలుసుకునేలా సాయపడడానికి నేను పని చేస్తాను. తద్వారా వారు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించగలుగుతారు. 2 ఇలా జీవించడం ఎలాగో ఆయన ప్రజలు నేర్చుకుంటారు. ఎందుకంటే దేవుడు వారిని నిత్యం జీవింప చేయగలడన్న నమ్మకం వారికి ఉంది. దేవుడు అబద్ధం ఆడడు. లోకం ఆరంభం కావడానికి ముందే మనం శాశ్వతంగా జీవించేలా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. 3 తరువాత, తగిన సమయంలో బోధించడానికి నన్ను నమ్మి ఈ సందేశం ద్వారా ఆయన తన ఏర్పాటును తెలియజేశాడు. మనలను రక్షిస్తున్న దేవుని ఆదేశాన్ని పాటించడానికి నేను ఇది చేస్తున్నాను.

4 తీతూ, నేను నీకు రాస్తున్నాను, నువ్వు నాకు నిజమైన కొడుకు లాంటి వాడివి అయ్యావు. ఎందుకంటే ఇప్పుడు మనిద్దరం ఉమ్మడిగా యేసు క్రీస్తులో విశ్వసిస్తున్నాము. మనల్ని రక్షిస్తున్న తండ్రియైన దేవుడూ, మరియు క్రీస్తు యేసూ నీ పట్ల దయ కలిగి యుండి మరియు మనసులో నెమ్మదిని దయచేయడం కొనసాగించును గాక. 5 ఈ కారణం కోసం నిన్ను క్రేతు దీవిలో విడిచి వచ్చాను. నువ్వు చెయ్యాలని నేను నీతో చెప్పినట్టుగానే ఇంకా అసంపూర్ణంగా ఉన్న పనిని నువ్వు చెయ్యాలి మరియు ప్రతి పట్టణంలోనూ విశ్వాసుల సంఘాలలో పెద్దలను నియమించు.

6 ఇప్పుడు ప్రతీ పెద్ద ఎవ్వరూ విమర్శించలేని వారై వుండాలి. అతడు ఒక్క భార్యను మాత్రమే కలిగి ఉండాలి కూడా. అతని పిల్లలు దేవుని మీద విశ్వాసం ఉంచాలి, మరియు ప్రజలు అతని పిల్లలను అదుపులో లేనివారిగానూ లేదా అవిదేయులుగానూ పరిగణించకూడదు. 7 దేవుని ప్రజలను నడిపించే ప్రతివాడు మరొకరి సేవకులను మరియు ఆస్తిని నిర్వహించే వ్యక్తి వలే ఉన్నాడు, అయితే అతడు దీనిని దేవుని కోసం చేస్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తికి మంచి పేరుప్రతిష్ఠలు ఉండడం అత్యవసరం. అతడు గర్విష్ఠిగా ఉండకూడదు మరియు అతడు త్వరగా కోపం తెచ్చుకొనేవాడుగా ఉండకూడదు, అతడు తాగుబోతుగా ఉండకూడదు, కొట్లాటకూ మరియు వాదించడానికీ ఇష్టపడేవాడుగా ఉండకూడదు, మరియు దురాశాపరుడిగా ఉండకూడదు. 8 దానికి బదులుగా అతడు కొత్త వారిని ఆహ్వానించాలి మరియు మంచి విషయాలుగా ఉన్నవాటిని ఇష్టపడాలి. అతడు అన్ని సమయాలలో వివేకంతో ప్రవర్తించాలి మరియు ఇతర ప్రజలను న్యాయంగానూ మరియు నిజాయితీగల విధానంలో ఆదరించాలి. దేవుని పట్ల భక్తిగలవానికి తగినవిధానంలో అతడు ఎల్లప్పుడూ ప్రవర్తించాలి మరియు తన ఉద్రేకాలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. 9 అతనికి మనం నేర్పిన సత్యాలను అతడు ఎల్లప్పుడూ విశ్వసించాలి, మరియు అతడు వాటి ప్రకారం జీవించాలి. అతడు దీనిని చెయ్యాలి తద్వారా ప్రజలు కూడా ఇలా జీవించడానికి అతడు ప్రేరేపించగలడు మరియు తద్వారా ప్రజలు ఈవిధంగా జీవించకూడదని కోరుకున్నట్లయితే అతడు వారిని సరిదిద్దగలడు.

10 ఈ సంగతులను నీకు చెపుతున్నాను, ఎందుకంటే తమ మీద అధికారంలో ఉన్న వారికి లోబడడానికి నిరాకరించేవారు అనేకులు ఉన్నారు. వాళ్ళు చెపుతున్న మాటలు విలువ లేనివి. తప్పు సంగతులను విశ్వసించాలని వారు ప్రజలను ఒప్పిస్తున్నారు. ఈ విధంగా ఉన్న ప్రజలు క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరూ సున్నతి పొందాలని చెపుతున్నారు. 11 ఇలాంటి వారు విశ్వాసులకు బోధించకుండా నువ్వు, మరియు నువ్వు నియమించిన పెద్దలూ నివారించాలి. బోధించకూడని విషయాలను వారు బోధిస్తున్నారు, కుటుంబాలన్నీ తప్పు సంగతులు విశ్వసించేలా చేస్తున్నారు. వారు దీనిని మాత్రమే చేస్తున్నారు తద్వారా ప్రజలు వారికి కానుకలు ఇస్తారు. ఇది చాలా సిగ్గుచేటు.

12 క్రేతీయులలో ఒక మనిషి, తన ప్రజలలో ఒకరు అతనిని ఒక ప్రవక్తగా తలంచారు, అతడు ఇలా అన్నాడు, “క్రేతీయులు తరచుగా ఒకరితో ఒకరు అబద్ధాలాడుతారు. వాళ్ళు ప్రమాదకరమైన అడవి జంతువుల్లాగా ఉన్నారు. వాళ్ళు సోమరివాళ్ళు మరియు ఎల్లప్పుడూ అధికమైన ఆహారాన్ని భుజిస్తారు. 13 అతడు చెప్పినది నిజమే. కాబట్టి వారిని ఖండితంగా సరిదిద్దండి తద్వారా వారు దేవుని గురించి సరైన సత్యాలను విశ్వసిస్తారు, మరియు బోధిస్తారు. 14 వాళ్ళు యూదులు కొత్తగా కల్పించిన కథలు, మరియు దేవుని నుండి రాని ఆదేశాల ప్రకారం జీవించడం మానుకోవాలి. సత్యాన్ని పాటించడం మానివేసిన ప్రజల నుండి ఈ ఆదేశాలు వచ్చాయి.

15 కొంతమంది మంచి పనులు చేయాలని కోరుకోవడం లేదా వాటిని చెయ్యడం గురించి ఆలోచించడం మాత్రమే చేసినట్లయితే వారు చేసే ప్రతిదీ మంచిది. అయితే ప్రజలు భ్రష్టులుగా ఉండి మరియు క్రీస్తు యేసును విశ్వసించకుండా ఉన్నట్లయితే వాళ్ళు చేస్తున్న ప్రతీది చెడ్డదే. అటువంటి ప్రజల ఆలోచనా విధానం నాశనమైపోయింది. వాళ్ళు దుష్టమైనదానిని చేసినప్పుడు అపరాధ భావం కూడా లేకుండా ఉంటారు. 16 దేవుడు మాకు తెలుసని వారు చెప్పుకున్నప్పటికీ వారు చేసిన పనులు దేవుడు వారికి తెలియదని చూపిస్తున్నాయి. వారు అసహ్యులుగా ఉన్నారు. వాళ్ళు దేవునికి అవిదేయులు మరియు ఆయన కోసం ఏ మంచి పనీ చెయ్యలేరు.

Chapter 2

1 అయితే తీతూ, నువ్వు మాత్రం దేవుని గురించి సత్యం అని నీకు తెలిసినదానితో అంగీకరించే సంగతులను ప్రజలకు బోధించు. 2 అన్ని సమయాల్లో తమని తాము అదుపులో పెట్టుకుంటూ ఉండాలని ముసలివాళ్లైన మగవాళ్ళకు చెప్పు. ఇతర ప్రజల గౌరవం పొందే విధానంలో వాళ్ళు జీవించాలి. వాళ్ళు వివేకంతో ప్రవర్తించాలి. దేవుని సత్యానికి సంబంధించిన విషయాలను వాళ్ళు స్థిరంగా విశ్వసించాలనీ, ఇతరులను నిజంగా ప్రేమించాలనీ, మరియు ఇవన్నీ ఎంత కష్టమైనప్పటికీ తప్పక చేయాలనీ చెప్పు.

3 పురుషుల వలే వృద్ద స్త్రీలు కూడా అలానే జీవించాలి తద్వారా వారు దేవుణ్ణి ఎక్కువగా గౌరవిస్తారు అని ప్రతిఒక్కరు తెలుసుకొంటారు. వారు ఇతర ప్రజల గురించి నీచమైన మాటలు లేదా తప్పుడు మాటలు పలుకకూడదని చెప్పు, మరియు వారు అధిక మద్యం సేవించడానికి బానిసలు కాకుండా ఉండాలి. దానికి బదులు వారు మేలైన విషయాలను ఇతరులకు నేర్పించాలి. 4 ఈ విధానంలో యువ స్త్రీలు తమ సొంత భర్తలను, మరియు పిల్లలను ప్రేమించడానికి వారు ఉపదేశించగలుగుతారు. 5 యువ స్త్రీలు తమ మాటలు, చేతలు అదుపులో ఉంచుకోవడానికి కూడా వృద్ధ స్త్రీలు బోధించాలి. మగవాళ్ళ విషయంలో తప్పుగా ప్రవర్తింపక, ఇంట ఉండి చక్కగా పని చేసుకోడానికి మరియు తమ భర్తలు వారికి చెప్పిన దానిని చెయ్యడానికి బోధించాలి. వారు వీటన్నిటినీ చెయ్యాలి తద్వారా మనకు వచ్చిన దేవుని సందేశాన్ని ఎవరూ ఎగతాళి చెయ్యలేరు.

6 యువకులు విషయానికొస్తే, తమను తాము చక్కగా అదుపులో ఉంచుకోవాలని ఆలాగే ప్రేరేపించు. 7 నీకు నువ్వుగా మంచి విషయాలను యెడతెగకుండా చెయ్యి తద్వారా ఇతరులు కూడా తాము ఏమి చేయాలో తెలుసుకుంటారు. నువ్వు విశ్వాసులకు బోధించేటప్పుడు, నువ్వు చెప్పే ప్రతీది నిజమని నిర్ధారించుకో మరియు వారు గౌరవించే విధంగా దానిని చెప్పు. 8 ఎవరూ విమర్శించడానికి వీలు లేనివిధంగా నీ బోధతో ప్రజలకు సత్యం బోధించు, తద్వారా ఎవరైనా నిన్ను ఆపాలని కోరితే, ఇతర ప్రజలు వారిని సిగ్గుపడేలా చేస్తారు ఎందుకంటే మనలో ఎవరి గురించి అయినా వారు న్యాయంగా చెప్పగలిగే చెడు ఏమీ ఉండదు.

9 బానిస విశ్వాసుల విషయానికొస్తే, వారు ఎల్లప్పుడూ తమ యజమానులకు లోబడి ఉండాలి అని వారికి బోధించు. ప్రతి విషయంలోనూ తమ యజమానులను సంతోషపెట్టే విధంగా జీవించాలనీ మరియు వారితో వాదించకుండా ఉండమని చెప్పండి. 10 వాళ్ళు తమ యజమానుల నుండి చిన్న వస్తువులు కూడా దొంగతనం చెయ్యకూడదు. దానికి బదులుగా వారికి విశ్వసనీయంగా ఉండాలి. మరియు మనలను రక్షిస్తున్న దేవుని గురించి మనం బోధిస్తున్నవాటన్నిటినీ ప్రజలు ప్రశంసించడానికి నడిపించే విధానంలో వారు ప్రతీ దానినీ చేయాలి.

11 విశ్వాసులు ఈ మంచి మార్గాలలో నడుచుకోవాలి, ఎందుకంటే ఎవరికీ అర్హత లేకపోయినా దేవుడు రక్షణను ఒక బహుమానంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇస్తున్నాడు. 12 ఈ ఉచిత బహుమానం ద్వారా, చెడు అనేది చెయ్యకుండా, మరియు లోక ప్రజలు చెయ్యాలనుకుంటున్నదానిని చెయ్యకుండా నిలుపు చెయ్యడానికి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం నిగ్రహం కలిగియుండాలనీ, మరియు మంచిదానిని చెయ్యాలనీ మరియు ఈ ప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయనకు విధేయులై జీవించాలనీ ఆయన మనకు బోధిస్తున్నాడు. 13 అదే సమయంలో మనలను చాలా సంతోషపరచేదీ, భవిష్యత్తులో ఆయన తప్పక చేయబోతున్నదాని కోసం మనం ఎదురు చూడాలని మనకు బోధిస్తున్నాడు. అదేమిటంటే యేసు క్రీస్తు, మరియు మన రక్షకుడు, శక్తివంతుడైన దేవుడు మహిమగల రీతిలో మన వద్దకు తిరిగి వస్తాడు.

14 మన స్థానంలో చనిపోవడానికి ఆయన తన్నుతాను అర్పించుకొన్నాడు తద్వారా మనం జీవించాలని దేవుడు కోరుకున్న విధానంలో మనం జీవించడానికి స్వేచ్చగా ఉండగలం, మరియు మననుండి మన పాపాన్ని తొలగించాడు తద్వారా ఆయనకు మాత్రమే చెందియుండే ఒక ప్రత్యేక ప్రజల గుంపుగా మనం ఉండగలం, మరియు ఆతృతగా మంచి చేయడానికి ఆశపడే ప్రజలుగా మనం ఉండగలం. 15 తీతూ, ఈ విషయాలను గురించి చెప్పు. మరియు నేను వివరించిన విధంగా జీవించేలా విశ్వాసులను పురికొల్పు మరియు వాళ్ళు చెయ్యనప్పుడు వారిని సరిదిద్దు, అవసరమైనప్పుడు వాళ్ళని ఆదేశించడానికి నీ అధికారాన్ని ఉపయోగించు. నువ్వు చెప్పే వాటిని అందరూ జాగ్రత్తగా వినేలా చూసుకో.

Chapter 3

1 తీతూ, మన ప్రజలు వారి మీద పరిపాలన చేసేవారికి లోబడి ఉండాలని వారికి తిరిగి చెప్పడం కొనసాగించు. వారు చేయగలిగినప్పుడల్లా మంచి చేయడానికి సిద్ధంగా ఉండాలి. 2 వారు ఎవరి గురించైనా అగౌరవమైన సంగతులు మాట్లాడకూడదు. వారు సమాధానంగా ఉండాలి. వారు ప్రతి ఒక్కరినీ మృదువుగా ఆదరించాలి, మరియు వాళ్ళను తమకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనవారిగా చూడాలి. 3 మునుపు మన మట్టుకు మనం బుద్ధిలేనివారంగా ఉన్నాము, మరియు దేవునికి లోబడడానికి ఇష్టం లేనివారంగా ఉన్న సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. మన సొంత కోరికలు, మరియు ఆనందాల కోసమైన అభిలాషలు మనలను తప్పుడు మార్గంలోకి నడిపించాయి మరియు మనం వాటికి బానిసలుగా సేవచేసాం. మనం అస్తమానం ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నాము మరియు ఇతర దుష్టక్రియలు చేస్తున్నాం. ప్రజలు మనలను అసహ్యించుకునేలా చేసుకున్నాం. ఒకరినొకరు ద్వేషించుకున్నాం.

4 అయితే దేవుడు మనలను ప్రేమిస్తున్నందున మనలను రక్షించడానికి ఆయన ఉదారంగా వ్యవహరిస్తున్నాడని దేవుడు మనకు చూపించినప్పుడు. 5 పరిశుద్ధాత్మ మనలను నూతనంగా చేశాడు మరియు దేవుని కోసం మన జీవితాలను తిరిగి ప్రారంభించేలా చెయ్యడం బట్టి మన పాపాన్ని తొలగించి మనలను శుద్ధి చెయ్యడం ద్వారా ఆయన మనలను రక్షించాడు. మనం మంచి పనులు చేసిన కారణంగా ఆయన మనలను రక్షించలేదు. అయితే ఆయన కరుణ కలవాడు కనుక ఆయన మనలను రక్షించాడు. 6 యేసు క్రీస్తు మనల్ని రక్షించినప్పుడే దేవుడు తన పరిశుద్దాత్మను మనకు ధారాళంగా ఇచ్చాడు. 7 ఈ ఉచిత బహుమతి ద్వారా మనకీ, ఆయనకీ మధ్య సమస్తం సమాధానపరచడం జరిగిందని దేవుడు ప్రకటించాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు తద్వారా ప్రభువైన యేసు ఇచ్చే ప్రతీదానిని, ముఖ్యంగా ఆయనతో మనకున్న నిత్యజీవాన్ని పంచుకోగలం.

8 ఇది ప్రతి ఒక్కరూ నమ్మదగిన ప్రకటన. మరియు ఈ విషయాలను నువ్వు అస్తమానం నొక్కి చెబుతూ ఉండాలి అని నేను కోరుతున్నాను తద్వారా దేవుణ్ణి విశ్వసించిన వారు వాళ్ళు ఇతరులకు ఉపయోగపడే విధంగా మంచి పనులు చేయడానికి నిరంతరం తమను తాము అంకితం చేసుకొంటారు. ఈ విషయాలు అత్యంత శ్రేష్ఠమైనవి, మరియు అందరికీ మేలు కలిగించేవి.

9 అయితే అనేకమంది ప్రజలు యూదు జాతి పితరుల వంశావళులు వంటి వాటిని గురించి మీతో బుద్ధిహీనమైన మరియు వాదోపవాదాలు చేయాలని కోరుకుంటారు, మరియు వారు మీతో వాదించడానికి కోరుకుంటారు మరియు మతసంబంధమైన ధర్మశాస్త్రం గురించి మీతో విభేదించడానికి కోరుకుంటారు. వీటన్నిటి నుండి దూరంగా ఉండు. ఈ రకమైన చర్చలు పనికిమాలినవి, మరియు అవి ఏ రకంగాను ఉపయోగం లేనివి. 10 వీటిని ఆపు చేయమని నువ్వు ఒకసారి లేదా రెండుసార్లు అతనిని హెచ్చరించినా చీలికలు తెచ్చే ఈ కార్యకలాపాలలో పాల్గొనాలని ఎవరైనా నొక్కి చెపుతుంటే ఇక వాళ్ళతో నీకు సంబంధం లేదు. 11 ఎందుకంటే ఇలాటి ఒకడు సత్యాన్ని విసర్జించాడు, అతడు పాపం చేస్తూ ఉన్నాడు మరియు తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడని నీకు తెలుసు.

12 అర్తెమానుగాని, తుకికునుగాని నేను నీ దగ్గరకి పంపినప్పుడు, నువ్వు నికొపొలి పట్టణంలో నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే నేను అక్కడే చలికాలం గడపాలనుకుంటున్నాను. 13 న్యాయకోవిదుడు జేనాకు, మరియు అపోల్లోకు వారి ప్రయాణం కోసం సమకూర్చడానికి నువ్వు చెయ్యగలిగిన దానంతటిని చెయ్యి. వారికి అవసరమైనవన్నీ వారు కలిగియుండేలా చూడు. 14 అదే విధంగా మనవాళ్లు అవసరతలో ఉన్న ప్రజలందరికి మంచి పనులు చెయ్యడంలో తమంతట తాము నిమగ్నం అవ్వడం నేర్చుకొనేలా చూడు. ఇలా చెయ్యడం ద్వారా దేవుని కోసం ఉపయోగకరమైన విధంగా జీవిస్తారు. 15 తీతూ, నాతో ఉన్నవారందరూ నీకు వందనాలు చెపుతున్నారు. అక్కడ తోటి విశ్వాసులుగా మనలను ప్రేమించే ప్రతి ఒక్కరికీ మా పక్షంగా దయచేసి వందనాలు చెప్పు. దేవుడు మీ అందరి యెడలా కరుణ చూపిస్తూ ఉంటాడు గాక.